Home తాజా వార్తలు సైరా సెట్ లో అగ్నిప్రమాదం

సైరా సెట్ లో అగ్నిప్రమాదం

Sye Raa Filmరంగారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా న‌ర‌సింహ‌రెడ్డి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేట‌లోని చిరంజీవి ఫాం హౌజ్ లో  షూటింగ్ కోసం ప్ర‌త్యేక సెట్‌ వేశారు. అయితే ఈ సెట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఫాంహౌజ్ లో  మంట‌లు చెలరేగడాన్ని గమనించిన స్థానిక ప్రజలు  అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. గండిపేట లేక్‌ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. సైరా సెట్ పూర్తిగా కాలిపోయిందని,  2 కోట్ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగిందని పోలీసులు తెలిపారు. షార్ట్ స‌ర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్ చ‌ర‌ణ్ సైరా సినిమాను నిర్మిస్తున్నారు. సైరా సినిమా స్వాతంత్య్ర స‌మరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు  సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే  ద‌స‌రా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Fire Accident in Sye Raa Film Shooting Set at Kokapet