Home జాతీయ వార్తలు రాఫెల్ ఫైటర్లొస్తున్నాయి

రాఫెల్ ఫైటర్లొస్తున్నాయి

First batch of six Rafale jets likely to arrive by July 27

న్యూఢిల్లీ: అన్ని వివాదాలు, కరోనా సంక్లిష్టతలను తట్టుకుని రాఫెల్ యుద్ధ విమానాల తొలి బ్యాచ్ జూలై 27న దేశానికి చేరుకుంటాయి. ఈ బ్యాచ్‌లో ఆరు ఫైటర్ జెట్స్ ఉంటాయి. రాఫెల్ ఫైటర్ల తొలి వైమానిక దళం హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో మకాం వేసుకుని ఉంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. భారత వైమానిక బలగాల పోరాట పటిమకు మరింత వెన్నుదన్నుగా ఈ రాఫెల్ విమానాలు నిలుస్తాయి. గల్వాన్ లోయలో చైనాతో ఇటీవలి కాలంలో తలెత్తిన సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో అరడజన్ రాఫెల్స్ రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్) వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిపై పూర్తి స్థాయిలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. చైనా నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురైనా తిప్పికొట్టే విషయంలో భారత రక్షణ వ్యవస్థకు వాయుదళమే కీలకంగా ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల చేరవేత విషయం గురించి ఈ నెలారంభంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో ఫోన్‌లో మాట్లాడారు. ఫ్రాన్స్‌లో కూడా కలవరం కల్గిస్తోన్న కరోనా వైరస్ వల్ల రాఫెల్స్ అప్పగింతపై జాప్యం ఏర్పడిందని తొలుత అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఈ మహమ్మారికి రాఫెల్ చేరవేత షెడ్యూల్‌కు సంబంధం లేదని, అనుకున్న ప్రకారమే ఈ ఫైటర్స్‌ను ఇండియాకు పంపిస్తామని రక్షణ మంత్రికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి తెలిపినట్లు వెల్లడైంది.

ఈ మేరకే వచ్చే నెలలో ఇవి అంబాల వైమానిక స్థావరానికి చేరుకుంటాయని వెల్లడైంది. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన వాయుబలగాల శక్తి మరింత ఇనుమడిస్తుందని రక్షణ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. అయితే ఐఎఎఫ్ దీనిపై ఎటువంటి స్పందనకు దిగలేదు. 2016 సెప్టెంబర్‌లో భారత్ ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ సేకరణకు సంబంధించి అంతర్ ప్రభుత్వ ఒప్పందం కుదిరింది. ఈ కొనుగోళ్ల ఒప్పంద విలువ రూ 58000 కోట్లు. ఒప్పందం విలువ, దళారీల పాత్ర గురించి పలు వివాదాలు తలెత్తాయి. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

క్షిపణి సంపన్నం ..పలు ప్రత్యేకతలు
భారత్‌కు అందే రాఫెల్స్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి క్షిపణి వ్యవస్థ దీనికి బలాన్ని ఇస్తుంది. భారతీయ వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేపట్టారు. ఇజ్రాయెల్ నిర్మిత హెల్మెట్ డిస్‌ప్లేయర్, రాడార్ వార్నింగ్ రిసివర్స్, తక్కువ స్థాయి జామర్స్, 10 గంటల విమానయాన గణాంక సామర్థం, ట్రాకింగ్ సిస్టమ్స్, ప్రత్యేకమైన ఇన్‌ఫ్రా రెడ్ సెర్చ్ ప్రక్రియ వంటివి రాఫెల్స్‌కు అదనపు ఆకర్షణలు. మొత్తం 36 రాఫెల్స్‌లో 30 ఫైటర్ జెట్స్ కాగా ఆరు శిక్షణ విమానాలు. పూర్తి స్థాయిలో ఫైటర్ జెట్స్‌నుపోలి ఉండే ఇవి రెండు సీట్లతో అమరి ఉండి, యుద్ధ విమానాల పైలెట్లకు శిక్షణకు ఉపయోగపడుతాయి.

First batch of six Rafale jets likely to arrive by July 27