Friday, April 19, 2024

మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు: ఎన్నికల కమిషనర్

- Advertisement -
- Advertisement -

కౌంటింగ్ ప్రక్రియను పరిశీలకులు పర్యవేక్షించాలి
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
ఒక్కో రౌండుకు 14 వేల ఓట్ల లెక్కింపు
ప్రతి వార్డు లెక్కింపు పూర్తైన తర్వాత పరిశీలకుని అనుమతితో ఫలితం వెల్లడి
ఎన్నికల పరిశీలకుల అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి

First Counting Postal Ballots says SEC Parthasarathy

మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలోని 30 సర్కిళ్ళకు నియమించిన 30 మంది కౌంటింగ్ పరిశీలకులు తమకు కేటాయించిన పరిధిలోని అన్ని వార్డుల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి అన్నారు. ఎన్నికల పరిశీలకులకు గురువారం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫెరెన్స్ హాలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పార్థసారధి మాట్లాడుతూ, ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుల్స్ ఉంటాయని, హాల్ చిన్నగా ఉన్నందున 16 వార్డులలో 7 టేబుళ్ళ చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతించామని అన్నారు. ఈ 16 వార్డుల రిటర్నింగ్ అధికారుల కు, అదనపు రిటర్నింగ్ అధికారులను కేటాయించామని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయిందని, పరిశీలకులు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రాథమిక లెక్కింపు కౌంటింగ్ టేబుళ్ళ వద్ద ఉదయం 8.10 గంటలకు ప్రారంభించాలని తెలిపారు. కౌంటింగ్ రెండు దశలలో జరుగుతుందని మొదటి దశలో బ్యాలెట్ బాక్స్‌లలోని బ్యాలెట్ పేపర్లను మడత విప్పకుండా లెక్కిస్తారని, ఆ తర్వాత బండిళ్ళను కలిపి అభ్యర్ధి వారీగా లెక్కిస్తారని వివరించారు. సందేహాత్మక బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, రిటర్నింగ్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు. ప్రతి వార్డు లెక్కింపు పూర్తయన తర్వాత రిటర్నింగ్ అధికారి పరిశీలకుని అనుమతి పొందిన తర్వాతనే ఫలితం ప్రకటించాలని చెప్పారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152 మంది అని, ఒక్కో రౌండుకు 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని అన్నారు. 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లకు గాను 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారని పేర్కొన్నారు. అధికారులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పక మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

First Counting Postal Ballots says SEC Parthasarathy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News