Home ఆదిలాబాద్ ముగిసిన మొదటి విడత ప్రచారం

ముగిసిన మొదటి విడత ప్రచారం

ZPTC and MPTC Election-ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం
-గెలుపు ధీమాలో టిఆర్‌ఎస్
-ప్రచారంలో చతికిలపడిన కాంగ్రెస్, బిజెపి
ఆదిలాబాద్‌ప్రతినిధి : తొలి విడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆరు జడ్పిటిసి స్థానాలతో పాటు 51 ఎంపిటిసి స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని నియమించిన అధికార యంత్రాంగం ఆదివారం మద్యాహ్నంలోగా వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, తాంసి, భీంపూర్ జడ్పిటిసి స్థానాలతో పాటు ఈ మండలాల్లోని ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లను జడ్పి సీఈవో నరేందర్ పర్యవేక్షిస్తున్నారు. మండలాల వారీగా జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో పోలింగ్ సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద షామియానాతో పాటు మంచినీటి వసతిని కల్పిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసుకొని సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించడంపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. డిఎస్పి నర్సింహారెడ్డి ఇప్పటికే ఆరు మండలాల పరిస్థితులపై అవసరమైన నివేదికను రూపొందించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇదిలాఉంటే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రంగంలోకి దిగిన టిఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలిపింది. నామినేషన్లు దాఖలు చేసిన వెంటనే ప్రచారాన్ని ప్రారంభించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు సైతం టిఆర్‌ఎస్ అభ్యర్థులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపూరావ్‌లు సైతం టిఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేపట్టి వారి గెలుపు కోసం కృషి చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో సత్తా చాటుతామని జడ్పిటిసి స్థానాలతో పాటు ఎంపిపి స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బిజెపి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సరైన కేడర్ లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల బరిలో నిలవక పోతే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో గెలుపుపై భరోసా లేకపోయినా అభ్యర్థులను నిలిపాయి. ఏ స్థానంలోనూ కాంగ్రెస్, బిజెపి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

First Phase ZPTC and MPTC Election Campaign End