Home జాతీయ వార్తలు మావోయిస్టులకు ఎదురుదెబ్బ

మావోయిస్టులకు ఎదురుదెబ్బ

Five Naxals killed in Gadchiroli forest Encounter

 

రెండు వేర్వేరు
ఎన్‌కౌంటర్లలో ఏడుగురు హతం
ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి

మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం ఆదివారం జరిగిన ఎదురుకాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని నర్సింహాసాగర్ అటవీ ప్రాతంలోని ముసలమ్మతోగు సమీపంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబీంగ్ నిర్వహిస్తున్న తరుణంలో మావోయిస్ట్‌లు తారస పడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరుపగా ఇద్దరు మావోయిస్ట్‌లు మృతి చెందినట్టు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ తెలిపారు. గత కొంత కాలంగా మావోయిస్ట్‌లు సరిహద్దు ప్రాంతం అయిన చత్తీస్‌ఘడ్ ప్రాంతంనుంచి గోదావరి దాటి తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి అడవుల్లోకి ప్రవేశించారని ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది దీంతో రాత్రి పగలు తేడాలేకుండా పోలీసులు ఆయా జిల్లాలలోని అటవీ ప్రాంతాలపై డేగ కన్ను వేశారు. నిత్యం గోత్తికోయ గూడాలను క్షుణ్ణంగా పరిశీలిస్తు గొత్తి కోయలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఆదివారం నర్సింహాసాగర్ అటవీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్ట్‌లకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు.

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతి

మహారాష్ట్ర అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు. రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలోని కొస్మి కిస్నెలి అడవులలో ఆదివారం మధ్యాహ్నం నక్సల్స్ పోలీసులతో తలపడ్డారని అధికారులు తెలిపారు. గడ్చిరోలి పోలీసు బలగాలకు చెందిన సి 60 కమాండోదళం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలకు దిగిందని, ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని ఎస్‌పి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. పరస్పర కాల్పుల తరువాత ఈ ప్రాంతం నుంచి నక్సల్స్ దళం తప్పించుకుంది. తరువాత జరిగిన గాలింపు చర్యల సందర్భంగా అక్కడ పడి ఉన్న నక్సల్స్ భౌతిక కాయాలను కనుగొన్నట్లు వివరించారు. మృతులైన నక్సలైట్ల పేర్లు ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటన తరువాత ఇక్కడ పోలీసు బలగాలు మరింత ఉధృత స్థాయిలో అణువణువూ జల్లెడపడుతోంది.