Home తాజా వార్తలు ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి

ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి

Maoists killed

 

కొత్తగూడెం: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అబూజ్‌మడ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని చత్తీస్‌గఢ్ డిజిపి అవస్ధి ధృవీకరించారు. చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, మోర్చా పోలీసుస్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలోని దుర్వేధ అటవి ప్రాంతంలో మావోయిస్టులకు, చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు డిస్ట్రిక్ట్‌గార్డ్ (డిఆర్‌జి) బలగాలకు మధ్య దాదాపు గంటన్నరపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరుపుతూ మావోయిస్టులు సురక్షితమైన ప్రాంతానికి తప్పించుకుపోయారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ఆప్రాంతంలో గాలిస్తే అయిదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.

ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారని, సంఘటనా స్ధలంలో ఒక ఆటోమేటిక్ రైఫిల్, ఒక కార్బన్ తుపాకి, మరికొన్ని ఆయుధాలు లభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాల్లో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతభాగంలో ఈ అబూజ్‌మడ్ విస్తరించి ఉంది. అబూజ్ అంటే అంతు తెలియని, మడ్ అంటే కొండలు, గుట్టలతో ఉన్న అడవి అందుకే దీన్ని అబూజ్‌మడ్ అని పిలుస్తున్నారు. బ్రిటీష్ కాలం నుంచి కూడా ఈ అబూజ్‌మడ్ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ సర్వే జరగలేదు. 2017లో ఇక్కడ సర్వే కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాని ఐఈడి పేలుడుతో సర్వేను కోల్డ్‌స్టోరేజ్‌లో పడేశారు.

దాదాపు నాలుగువేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న అబూజ్‌మడ్‌లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు ఏమీ చెల్లవు. ఇది దుర్భేధ్యమైన మావోయిస్టుల అడ్డా. ఇది మావోయిస్టుల అప్రకటిత రాజధాని, ఈ ప్రాంతంలో విసిరివేయబడ్డట్టు ఉండే ఊర్లలో సుమారు 32వేల జనాభా నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ పధకాలేవి అక్కడి వరకు చేరవు. బయటి వ్యక్తులు ఈ అబూజ్‌మడ్‌లో ప్రవేశించకూడా నిషిధ్దం. అడుగడుగునా మావోయిస్టులు, మిలిషియా సభ్యులు, పీపుల్స్ లోకల్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ ) ఉంటుంది. పోలీసు బలగాలు అక్కడకు చేరాలన్నా కష్టమే. అయిదే అబూజ్‌మడ్ నాలుగువైపు లా పారామిలటరీ బలగాల పూర్తి నిఘా ఉండడంతో ఇది మావోయిస్టులకు కీలక కేంద్ర స్ధావరంగా ఉంటోంది. ప్రాంతంపై పోలీసులకు పూర్తి భౌగోళిక అవగాహన రావటానికి మరో పదేళ్లపైగా పడుతుందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని చత్తీస్‌గఢ్ డిజిపి అవస్ధి తెలియజేశారు.

Five suspected Maoists killed in Encounter at Chhattisgarh