Tuesday, April 23, 2024

మహూర్తం ‘ఖరారు’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (పుట్టిన రోజు) చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు ఆ రోజు ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ సచివాలయం భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు.
అంతకు ముందు వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ముఖ్యులు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్య అతిథులందరూ పాల్గొంటున్నారు.

కాగా తుదిమెరుగులు దిద్దుకుంటున్న పనుల పురోగతిని స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రులు, సంబంధిత అధికారులతో కలిసి సిఎం కెసిఆర్ సచివాలయాన్ని సందర్శించారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉండి ప్రతి పనిని నిశితంగా గమనించారు. సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియ తిరిగారు. పనుల పురోగతి పరిశీలనలో సంబంధిత అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమవుతున్న రోడ్లను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన కెసిఆర్……అక్కడ బ్యాంకులు, క్యాంటీన్, ఎటిఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. అక్కడి సౌకర్యాలతో పాటు వివరాలను సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.

పచ్చదనంతో కళకళలాడాలి

కొత్త సెక్రటేరియట్ భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. భవనంలో ఎక్కడ చూసిన పచ్చదనంతో కళకళలాడాలన్నారు. అనంతరం గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సిఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంత్రులు, ఉన్నతాధికారుల చాంబర్లను పరిశీలించిన సిఎం

సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిక్కున నిర్మితమవుతున్న ప్రార్థనా మందిరాన్ని సిఎం పరిశీలించారు. ఆ తర్వాత పడమటి దిక్కున ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతా అంశాల గురించి సిఎం కెసిఆర్ ఆరా తీశారు. సచివాలయం పడమటి భాగంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. వెహికల్ పార్కింగులను కూడా సందర్శించారు.

అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి ఫ్లోరుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజనీర్లకు సూచించారు. మొదటి ఫ్లోరు కలియ దిరిగిన సిఎం లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సిఎం చాంబర్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్ సీలింగ్, వుడ్ పానెలింగ్, ఎసి ఫిట్టింగ్స్, తదితర తుది మెరుగుల పనులను కెసిఆర్ క్షున్నంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌ను, సిఎంవో కార్యదర్శులు, పిఆర్‌ఒలు, తదితర సిఎంవో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సిఎం పరిశీలించారు. సిఎం చాంబర్ లో మార్పులు చేపట్టాలని సూచనలు చేశారు. అదే ఫ్లోర్ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌ను, వాటిల్లో చేపట్టిన ఫాల్స్ సీలింగ్ పనులను పరిశీలించారు.

కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులను, ఎలివేషన్ లో భాగంగా జిఆర్‌సితో చేసే కళాకృతులను, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా పరిశీలించి చూశారు.

ఇంటీరియర్ డిజైన్లు, కరెంటు పనులు, ఎసిల ఫిటింగ్, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్కు పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన సిఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులను, వుడ్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్టుల పనుల తీరును తెలుసుకున్నారు.

ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సిఎం మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమౌతున్న లాన్‌లను, రోడ్లు, పార్కింగ్‌తో పాటు గార్డెనింగ్ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన కలియదిరుగుతూ రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ ముందుకు సాగారు.

విఆర్‌వి టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎసి ప్లాంట్లను, జనరేటర్లను, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను కూడా సిఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ పనులపై ఇంజనీర్లకు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఎంఎల్‌సిలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు, బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ అండ్ బి ఇఎన్‌సి గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నో ప్రత్యేకతలు….
రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం అవుతున్న సచివాలయాన్ని రూ.610 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. మొత్తం 265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఉంది. ఇందులో మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. ఇక మూడు నుంచి ఐదు అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కాగా 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్ రూమ్, సిబ్బంది రూమ్స్ లాంటివి ఉంటాయి.

బిల్డింగ్‌పైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు గల జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలో తయారు చేయించారు. భారీ క్రేన్ల సహాయంతో వీటిని బిల్డింగ్ పైభాగంలో ఏర్పాటు చేశారు. బిల్డింగ్ నలువైపులా మొత్తం 2 ప్రధాన గుమ్మటాలతో పాటుగా 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేశారు. కాగా సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్ ఎదురుగా ప్రధాన ద్వారం ఉండనుండగా.. సిఎం కాన్వాయ్ ఈ ద్వారం గుండా లోపలికి వస్తుంది. ఇక ఎన్‌టిఆర్ గార్డెన్‌కు ఎదురుగా మరో గేటు ఏర్పాటు చేయగా ఉద్యోగులు ఈ గేటు గుండా ఆఫీసులకు చేరుకుంటారు. ఇక బిర్లామందిర్ వైపు మరో గేటు ఉండగా సామాన్యులకు ఈ ద్వారం కూడా ప్రవేశం ఉంటుంది. ఇక సచివాలయం వెనుక భాగంలో నాలుగు గేటు ఉంటుంది.

అలాగే 300 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునేలా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. సిఎంఒ ఛాంబర్‌లో 30 కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఉద్యోగులు, సామాన్యులకు వేర్వురుగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. 100 ఏళ్ల పాటు ఉండేలా తెలంగాణ కొత్త సచివాలయం నిర్మితమైనట్లుగా నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ భవనంలో మూడు అంతస్థుల అరైవల్ గ్రాండ్ పోర్టికోతో 15 అడుగుల ఎత్తైన ఎంట్రీ పోడియంతో అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. ఇక భవనం మధ్యలో ఎల్‌ఇడి వాల్ కూడా ఉంటుంది. ఇందులో తెలంగాణ అభివృద్ధిని ప్రదర్శిస్తారు. 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శించే కుడ్యచిత్రాలను గొడలపై ఉంటాయి. అలాగే బ్యాంకు, ఎటిఎం, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఇంధనం నింపే స్టేషన్, అగ్నిమాపక స్టేషన్, విజిటర్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. భవనం మెుత్తం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమైంది. అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ఒక ప్రణాళిక ప్రకారం చేశారు.

సచివాలయం కింద మినీ రిజర్వాయర్
సచివాలయంలో పని చేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంక్ సిద్ధం చేశారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్‌లా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉండనుంది. వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయం భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

టిటిడి నుంచి శిల్పాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలను కూడా నెలకొల్పారు. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు తయారు చేయించింది. వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సేకరించింది. కృష్ణ శిలలతో ఈ దేవతామూర్తులు రూపుదిద్దుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News