Home జాతీయ వార్తలు ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం

ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం

rain

గౌహతి/అగర్తల/ఇంఫాల్:  ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అస్సోం, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌లను వరదలు ముంచెత్తాయి. అసోంలో వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దాదాపు 4లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. దిఫోలు నది ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల 37జాతీయ ప్రధాన రహదారి కొంత మేర మునిగిపోయింది. కజిరంగ నేషనల్ పార్క్‌లో నీరు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గోల్‌ఘాట్, కబ్రి అంగ్‌లాంగ్ ఈస్ట్, కబ్రి అంగ్‌లాంగ్ వెస్ట్, బిస్వనాత్, కరీంగంజ్, హైలకండి ప్రాంతాలు ఎక్కువగా వరద బారిన పడ్డాయి. దాదాపు 3.7 లక్షలు మంది వరద తాకిడికి గురయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా పంట నీటమునిగినట్లు అసోం రాష్ట్ర విపత్తు మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. వరద బాధితుల కోసం 71కి పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మణిపూర్‌లోని దాదాపు 40 నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంఫాల్, కొండ ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనిపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు.  ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. అసోం, మణిపూర్‌ను కలిపే ప్రధాన జాతీయరహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని కొన్ని నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మిజోరాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వందల సంఖ్యలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐజాల్‌లో పాటు మరో నాలుగు జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. లెంగ్పు విమానాశ్రయానికి వెళ్లే దారిలో మట్టిపెళ్లలు పడటంతో ఆ ప్రాంతాన్ని మూసివేశారు.