Thursday, April 25, 2024

కృష్ణమ్మ దుంకింది

- Advertisement -
- Advertisement -

Flood water coming to Jurala project from Karnataka

కర్ణాటక నుంచి వస్తున్న వరదలు
నారాయణపూర్ డ్యామ్ నీటి విడుదల
నేడు జూరాలకు చేరుకోనున్న వరద
వారంలోగా నిండనున్నజూరాల
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ సరిహద్దు రాష్ట్రాల్లో విస్తారంగా కరుస్తున్న వర్షాలతో వరదజలాలు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్రమేనా చేరుకుంటున్నాయి. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా 9.66 టిఎంసిల సామర్థం ఉంది. అయితే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఆదివారం నాటికి జూరాలలో 8 టిఎంసిల నీరు ఉంది. మరో 1.66 టిఎంసిల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. ప్రస్తుత వర్షకాలంలో అతి త్వరగా జూరాల నిండే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రాజెక్టులు దాదాపుగా నిండాయి. కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ నీళ్లు జూరాల వైపు పరుగులు తీస్తున్నాయి. సోమవారం సాయంత్రం వరకు ఈ నీరు జూరాలకు చేరుకోనుంది. అయితే నారాయణపూర్ డ్యామ్ పూర్తి సామర్థం 37.64 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం 33.47 టిఎంసిలు ఉన్నాయి. అలాగే ఈ డ్యాంకు ఆల్మట్టి నుంచి 40వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉంది. ఈ నేపథ్యంలో నారాయణపూర్ రెండు రేట్లు ఎత్తి 11.240 క్యూసెక్కులు వదులుతున్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు కర్ణాటక నుంచి వస్తున్న నీటితో వారం రోజుల్లోగా జూరాల పూర్తి సామర్థంతో నీరు నిండే అవకాశాలున్నాయి. గద్వాలకు 16 కిలో మీటర్ల దూరంలో ధరూర్ మండలంలో రేవుల పల్లి గ్రామంలో ఉన్న జూరాల ప్రాజెక్టు లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించనుంది. ఇందులో కుడికాలువ సోమాద్రి 37వేల 700 ఎకరాలకు, ఎడమకాలువ 64వేల 500 ఎకరాలకు సాగునీరు అందివ్వ నుంది. అలాగే చిన్న చిన్న కాలవల ద్వారా సుమారు మరో 20 వేల ఎకరాలకు నీరు అందే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాకాలంలో మొదటి నుంచి జూరాలలో నీరు ఆశాజనకంగా ఉండటంతో ఇప్పటికే రైతులు పంటలు వేశారు. కృష్ణానదీ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోకి ప్రవేశించగానే ఉన్న మొదటి డ్యామ్ జూరాల. ఇది పూర్తి స్థాయి నీటి మట్టంతో సాగునీరు అందించే అవకాశాలుండ టంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 27.80 మీటర్ల ఎత్తులో ఉన్న జూరాలకు 64 గేట్లు ఉన్నాయి. ఇప్పటికే ఇందులో కొన్ని గేట్లు ఎత్తి పంట పొలాలకు నీరు అందింవ్వడంతో పాటు చెరువులు,కుంటలు నింపారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు నీరు జూరాలకు చేరుకోగానే మరి కొన్ని గేట్లు తెరిచి పంటలకు అవసరమైన సాగు నీరు విడుదల చేయనున్నట్లు సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లు తెలిపారు.

Flood water coming to Jurala project from Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News