Home తాజా వార్తలు జూరాల గేట్లు ఎత్తివేత

జూరాల గేట్లు ఎత్తివేత

flood water flow increasing to Jurala project

శ్రీశైలానికి 26,759 క్యూసెక్కుల వరద

కృష్ణ, గోదావరి నదులకు వరద తాకిడి
లక్ష్మీ బ్యారేజీ 17 గేట్లు ఎత్తివేత
జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి
శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు, చెరువుల్లోకి వరద
మూసీ ప్రాజెక్టుకు జలకళ

మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ నదికి వరద పెరిగింది. నారాయణపూర్ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో తాజాగా మంగళవారం నాడు రాత్రి జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. ఐదు గేట్లు తెరిచి నీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు. జూరాలరెండు గేట్లు రెండు మీటర్లు, మూడు గేట్లు ఒక మీటర్ తెరచి దిగువకు నీటిని వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 26,759 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి తరలుతోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామ్‌సాగర్‌లోకి వరదనీరు చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తు తం 1072.4 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. మంగళవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి సుస్మిర్ ఒర్రే ఉప్పొంగడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో 6.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగొండ మండలంలో 55.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, మిర్యాలగూడ మండలంలో 30.6 మి.మీలు, నాగార్జునసాగర్ మండలంలో 22.4 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. సూర్యాపేట జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ నియోజకవర్గాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీప్రాజెక్టు జలకళను సంతరించుకుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి, బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంభ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.