Saturday, March 25, 2023

జలకళను సంతరించుకుంటున్న శ్రీశైలం

Flood Water Inflow Increases to Srisailam Reservoir
లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరదనీరు, మూసీలో కొనసాగుతున్న వరదప్రవాహం
- Advertisement -

హైదరాబాద్ : 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు వరదనీటితో నిండిపోతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి శ్రీశైలం జలకళను సంతరించుకుంటోంది. జూరాల నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, నల్లమల అడవుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలానికి వస్తున్న వరద సుమారు లక్ష క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌కు 95,279 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. వరదనీరు మరింతకాలం కొనసాగనున్న నేపథ్యంలో ఎడమగట్టున ఉన్న భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తని కొనసాగిస్తున్నారు.

ఆల్మట్టి, నారాయణపురం నుంచి ఇన్‌ఫ్లో తగ్గినా శ్రీశైలానికి మాత్రం వరద కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం ఆల్మట్టికి 50 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరగా, మూడు రోజులుగా మాత్రం వరద తగ్గుముఖం పట్టింది. 17 నుంచి 20 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే వస్తుండడంతో నారాయణపుర నుంచి కూడా దిగువకు 15 వేల క్యూసెక్కుల లోపు వస్తోంది. ఈ క్రమంలో జూరాలకు వరద తగ్గడం మొదలయ్యింది. 70 నుంచి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా శనివారానికి సాయ్రంతానికి 58 వేల క్యూసెక్కులకు చేరింది.

శ్రీరాంసాగర్‌కు 8వేల క్యూసెక్కుల పైచిలుకు..

ముఖ్యంగా తుంగభద్ర డ్యాం దిగువన, అంలపూర్, కర్నూల్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండురోజులుగా సుంకేశులకు వరద పోటెత్తింది. శ్రీశైలానికి ఇక్కడి నుంచే 25 నుంచి 30 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. అటు గోదావరిలో లక్ష్మిబరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయానికి బరాజ్‌కు 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్‌కు మోస్తరుగా 8 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అధికారులు తెలిపారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 539.80 అడుగుల నీటిమట్టం..

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 539.80 అడుగులుగా ఉంది. అలాగే ఇన్‌ప్లో 40,259 క్యూసెక్కులు కాగా ఔట్ ప్లో 1500 క్యూసెక్కులుగా నమోదయ్యింది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థం 645 అడుగులు (4.46 టిఎంసిలుగా) ఉందని అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుత నీటిమట్టం 628.10 అడుగులకు (1.16 టిఎంసి)లుగా నమోదయ్యింది. ఇన్ ప్లో 2950 క్యూసెక్యులు, ఔట్‌ప్లో 25 క్యూసెక్కులుగా నమోదయ్యింది.

పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 10.994 టిఎంసిలుగా నమోదు..

పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థం 45.77 టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 10.994 టిఎంసిలుగా నమోదయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 175. 89 అడుగులకు గాను, ప్రస్తుత నీటిమట్టం 143.404 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్టు ఇన్ ప్లో 1674 క్యూసెక్కులు కాగా మొత్తం ఔట్ స్లో 100 క్యూసెక్కులుగా నమోదయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News