Home తాజా వార్తలు శ్రీరాంసాగర్ కు పెరిగిన వరద ఉధృతి

శ్రీరాంసాగర్ కు పెరిగిన వరద ఉధృతి

Sriram Sagar Project

 

హైదరాబాద్: శ్రీరాంసాగర్‌లో నీటి నిల్వ 78 టిఎంసిలకు చేరింది. 90 టిఎంసిల పూర్తిస్థాయికి గాను ప్రస్తుతం 78 టిఎంసిల నీరు నిల్వ కాగా, ఇంకా 14810 క్యూసెక్కుల నీరు స్థానిక వర్షాల వల్ల వచ్చి జలాశయంలో చేరుతుంది. జైక్వాడి డ్యాంకు 6333 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరుకు ఇన్‌ఫ్లో బంద్ కాగా, ప్రస్తుతం 2.68 టిఎంసిల నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరుకు సైతం ఇన్‌ఫ్లో లేదు. 24 టిఎంసిలకు గాను ప్రస్తుతం 20.5 టిఎంసిల నీరు నిల్వ ఉంది. కడెంలో 7.27 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. శ్రీపాద ఎల్లంపల్లిలో 19.8 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, 5596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఎల్లంపల్లి నిండుగా ఉండడం, కాళేశ్వరం పంపులు నడవకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

కృష్ణా బేసిన్‌లో వరద స్థిరంగా వస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 80760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 121277 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నాగార్జునసాగర్‌కు 91151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 69305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదిలారు. జూరాలకు 50000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదిలారు. దీనికి తుంగభద్ర నుంచి వస్తున్న 10588 క్యూసెక్కుల నీరు కలిసి, శ్రీశైలానికి చేరింది. దీనికి తోడు స్థానిక వర్షాలతో కొంత నీరు అదనంగా తుంగభద్ర, కృష్ణా నదిలోకి వస్తుంది. ఆల్మట్టికి 20000 క్యూసెక్కులు, నారాయణపూర్‌లకు 30000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, అంతే నీటిని దిగువకు వదిలారు.

Flood Water inflow to Sriram Sagar Project