Home మంచిర్యాల వానలు, వరదలు

వానలు, వరదలు

Flood waters that fall into houses

ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగా, ప్రాణహిత
దిల్‌దార్ పల్లి జలదిగ్భంధం
పలుచోట్ల ఇండ్లలోకి చేరిన వరద నీరు
ఓపెన్‌కాస్టుల్లో స్తంభించిన బొగ్గుఉత్పత్తి
నీల్వాయి వాగులో ఒకరి గల్లంతు
పలుగ్రామాలకు నిలిచిపోయిన రవాణా
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జెసి ఆదేశాలు

మనతెలంగాణ/మంచిర్యాల : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన వాగులు ,వంకలు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తం కాగా పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కురిసిన భారీ వర్షాల వలన జిల్లాలోని పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. అదే విధంగా నీల్వాయివాగులో ఒకరు గల్లంతయ్యారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాల వలన పలువాగులు ఉప్పొంగాయి. బెజ్జూరు,చెన్నూరు, వేమనపల్లి ,జన్నారం, మండలాల్లో పలువాగులు ఉప్పొంగగా రవాణ సౌకర్యాలు స్థంభించిపోయాయి. మంచిర్యాల నుండి ఆదిలాబాద్‌కు వెళ్ళె రహాదారి మధ్యలోనే అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోగా ఈమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహందాటి ప్రజలు అవతలి ఒడ్డుకు చేరుకొని ఆటోలలో ప్రయాణిస్తున్నారు. కన్నెపల్లి మండలంలోని దిల్‌దార్ పల్లి గ్రా మాన్ని వరద నీరు ముంచెత్తింది. గ్రామం చుట్టు ఉన్న వాగులు ఉప్పొంగడంతో జలదిగ్బందం అయ్యింది. అధికారులు వెంటనే స్పందించి గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే విధంగా కౌటాల,చింతలమానెపల్లి, బెజ్జూరు, ఆసిఫాబాద్‌లలో వరదనీరు ఇండ్లలోకి ప్రవేశించింది. అంతేకాకుండా నీల్వాయి వాగులో సోమవారం మోర్లే సోమయ్య ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. చెన్నూరులోని బ్యాంకుకు వచ్చిన సోమయ్య తిరుగుప్రయాణంలో వాగును దాటుతుండగా ఒక్కసారి వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. అతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలను ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా గతమూడురోజులుగా బెల్లంపల్లి,మందమర్రి, రామక్రిష్ణాపూర్ ఏరియాలలోని ఆరు ఓపెన్‌కాస్టులలో బొగ్గుఉత్పత్తి పూర్తిగా స్థంభించింది. ప్రతిరోజు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగగా సంస్థకు కోట్లాధి రూపాయాలలో నష్టం వాటిల్లింది. క్వారీలలో నీరు చేరడంతో పనులు జరుగక బొగ్గురవాణ స్థంభించింది. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల వేతనల రూపంలో కోట్లాధి రూపాయాల నష్టం జరుగడంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో పత్తిమొలకలు వరదనీటితో మునిగిపోగా రైతులు నష్టాలకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతవరణ శాఖ అధికారులు వెల్లడించడంతో జిల్లా అధికారులు అందరూ స్థానికంగా అప్రమత్తంగా ఉండాలని జెసి సురేందర్‌రావు ఆదేశాలను జారీ చేశారు.