Home తాజా వార్తలు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీరు

జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీరు

Floodwater Inflow To Jurala Project Today హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు  గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు 58,600 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో అధికారులు ఆరుగేట్లు ఎత్తివేసి 66,090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 26,907 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నుంచి దిగువ్ె 972 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు అయితే  ప్రస్తుతం 534.80 అడుగుల మేర  నీరు నిలువ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 177.6686 టీఎంసీల నీరుంది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 71,202 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులకు గాను 1088.80 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ఇప్పుడు 78.981 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు శ్రీరాంసాగర్‌కు 64 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.