Home ఆఫ్ బీట్ పిండి వంట.. విజయాల పంట

పిండి వంట.. విజయాల పంట

 అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు కొందరైతే… ఉన్నత చదువులు చదివి, పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండేవారు  ఇంకొందరు. ఇంట్లో ఉన్నా తమకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుని, పది మందికి ఉపాధి కల్పించేవారు మరికొందరు. ఒకప్పుడు పండుగ పబ్బాలకు పిండివంటలను ఇంట్లోనే వండుకునేవారు. రోజులు మారాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు. వంట చేసుకోవడమే కష్టంగా మారుతోంది. ఇక పిండివంటలా…అని భయపడుతున్నారు. వేడుకలు, పండుగలు, సాయంత్రం పూట  స్నాక్స్ తినాలనిపించేవారికి చేతివంట రుచి చూపిస్తున్నారు ఈ మహిళలు.  

lf

పల్లెల్లో చేసే పిండివంటలు సర్వపిండి, సకినాలు, లడ్డూలు ..ఇలాంటి చిరుతిళ్లను మరిచి మార్కెట్లో దొరికే పిజ్జాలు, బర్గర్‌ల వెంటపడుతున్నారు ఇప్పటి తరం. వాటితో లేనిపోనిరోగాలను కొనితెచ్చుకుంటు న్నారు. కాని మార్కెట్లోకి ఎన్ని రకాల ఆహారపదార్థాలు వచ్చినా చేతి రుచికి మించింది లేదు. పాతికేళ్లుగా కల్తీ లేని ఆహారాన్ని అందిస్తూ కమ్మని రుచులను ఆస్వాదించేలా చేస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. హైదరాబాద్ నాచారంలో చిన్నగా దుకాణం పెట్టి రోజు ఒకటి రెండు కిలోల సర్వపిండి, సకినాలు చేసి, ప్రతి ఇంటికి తిరిగి ఇచ్చి వచ్చేవారు. ఊరి నుండి పోయి హైదరాబాద్‌లో అప్పాలు అమ్ముకుంటున్నారా…..! అని ఆ కుటుంబాన్ని హేళన చేసిన సందర్భాలు లేకపోలేదు. కాని ఈ రోజు అదే కుటుంబం రోజు 50 మందికి ఉపాధి కల్పిస్తూ రోజు 200 కిలోల పిండి వంటలు చేసే స్థాయికి ఎదిగారు. ఆ అత్తాకోడళ్లే సకినాల “సావిత్రి- రేణుక”లు. ‘శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు’ అనే పేరుతో మంచి రుచిని అందిస్తున్న వీరిని మన తెలంగాణ సకుటుంబం పలకరించింది. తన వ్యాపారాన్ని గురించి సావిత్రమ్మ మాట్లాడుతూ…మాది కరీంనగర్ జిల్లా, సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామం. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. వారికీ పిల్లలున్నారు. కొడుకు, కోడలు అందరం కలిసే ఉంటాం. ఇంతకు ముందు మేము ఊర్లో వ్యవసాయం చేసేవాళ్లం. కొంత కాలం తర్వాత వ్యవసాయంతో పాటు ఒక స్కూల్, హాస్టలు పెట్టి నడిపించాం. మా ఇంట్లో హాస్టల్లో చాలా మంది పని చేసేవారు. అప్పుడే ఏదైనా పండుగ వస్తే అందరికీ మా ఇంట్లోనే వండి పెట్టేవాళ్లం. చాల రకాల పిండి వంటలు చేసేవాళ్లం. నేను మా పెద్ద వాళ్లు చేసినపుడు చూసి నేర్చుకుని కొత్తగా ప్రయోగాలు చేశాను. రుచిగా వచ్చేవి. అలా కొంత కాలం తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కొని వచ్చేశాము. ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. ఎస్‌టిడి టెలిఫోన్ పెట్టి నడిపించాం. తరువాత సెల్‌ఫోన్లు వచ్చి ఎస్‌టిడి వాడకం పడిపోయింది. దాని తర్వాత కిరాణ దుకాణం ప్రారంభించాం. దాంతో పాటు ఐదు మెస్‌లూ నడిపించాం. క్యాటరింగ్ కూడా చేశాం. చర్లపల్లి జైలు, సింగపూర్ టౌన్‌షిప్, కాచిగూడలో వైశ్య హాస్టల్, ఫ్యాక్టరీల కార్మికులకు ఫుడ్ సప్లయ్ చేశాం. అలా ఆహారం అందించడంలోనే గడిపాం. అప్పుడప్పుడూ ఒకటి,రెండు కిలోల లోపు సర్వపిండి,సకినాలు లాంటివి తెలిసినవాళ్లు ఎవరైనా అడిగితే తయారుచేసి ఇచ్చేవాళ్లం. మా దుకాణానికి వచ్చేవారికి పిండి వంటలు నచ్చడంతో నెమ్మదిగా ఆర్డర్లు రావడం మొదలైంది. ఆర్డర్లు ఎక్కువ కావడంతో కిరాణ దుకాణం మూసేసి పిండివంటలపైనే సమయం కేటాయించడం మొదలెట్టాం. హైదరాబాద్‌లో చాలా రకాల ఫుడ్ దొరుకుతుంది. గుంటూరు, నెల్లూరు, బెంగళూరు, ముంబయి ఇలా చాలా ప్రాంతాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. కానీ ఎక్కడా తెలంగాణ పిండివంటలు ఉన్నట్లు మాకు కనిపించలేదు. అందుకే మేం తెలంగాణ పిండివంటలను ప్రారంభించాం.

life
మొత్తం 40 నుండి 50 వరకూ వెరైటీస్ చేస్తాం. ప్రతి రోజూ మా దగ్గరికి 100 నుండి 200 వందల మంది కస్టమర్లు వస్తుంటారు. మామూలు రోజులకంటే పండుగలప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. కొన్ని వంటకాలు పండుగలప్పుడు తొందరగా అమ్ముడుపోతాయి. అసలు సరిపోవు కూడా. చాలా మంది ఫోన్లు చేసి ముందే ఆర్డర్లు ఇస్తారు. సంపాదన బాగానే ఉంది. మా దగ్గర రోజూ 50 మంది వర్కర్లు పనిచేస్తారు.
ఎక్కువగా మహిళలు ఉన్నారు. వారికి యూనిఫాం కూడా ఉంది. మాకు నిజామాబాద్ నుండి నువ్వులు వస్తాయి. 25 సంవత్సరాల నుంచి ఒకే రైతు దగ్గర పాలు కొనుగోలు చేస్తున్నాం. నెలకు సరిపడా కావల్సినవి మార్కెట్లో తెప్పిస్తాం. ఏ వంటకానికైనా నూనె ఒకే సారి వాడుతాం. మాదాపూర్, మెహిదీపట్నం, నాచారంలలో మాకు బ్రాంచులున్నాయి. మా పిండివంటల్ని విదేశాలకు కూడా పంపిస్తాం. సర్వపిండి, సకినాలతో చాలా పేరు వచ్చింది. అవి మా దగ్గర చాల స్పెషల్. చాలా రకాల లడ్డూలు చేస్తాం. ప్రతి ఏడాది జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జరిగే ఉత్సవాల్లో మా వంటల్ని డిస్‌ప్లే చేస్తుంటాం. నాచారంలో ఉన్న రామకృష్ణ స్కూల్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాం.
ప్రతి వినాయక చవితికి 108 రకాల నైవేద్యాలు చేయడం ఆనవాయితీ అయింది. మా ఊర్లో గోపాలస్వామి గుడి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి 21 రకాల స్వీట్స్ పంపిస్తాం.. అలాగే మా బంధువుల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఇంకా ఎవరి ఇంట్లో ఏదైన బాధాకరమైన సందర్భంలో కూడా మా వంటల్ని పంపిస్తాం.

బొర్ర శ్రీనివాస్

నాన్‌వెజ్ పచ్చళ్లు మా ప్రత్యేకత

lif

మహిళ తలచుకుంటే ఏ పనినైనా చేయగలదు. కాని కొందరు పెళ్లి అయ్యాక ఇంట్లోనే ఉంటూ వారి ఆలోచనలకు ముగింపు పలుకుతారు. అలాంటి వారికి నా సూచన ఏమంటే…బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం కష్టంగా ఉంటే, ఇంట్లోనే ఉండి మీరు చేసే చిన్న చిన్న పనులతో అంటే వంట, బట్టలు కుట్టడం, అల్లికలు ఇలాంటి పనులతో చిన్నగా ఓ వ్యాపారాన్ని దలుపెట్టండి. తర్వాత కాలంలో అవి మీరు ఉహించనంతగా పెద్ద సంస్థగా మారుతుంది. అలాంటి ఆలోచనలు నేను చేసాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటున్న ప్రమదారెడ్డిని పలకరిద్దాం.
మా ఊరు నల్గొండజిల్లా నాగార్జున సాగర్. మా ఆయన రామసహాయం సుధి రాంరెడ్డి. ఇంటర్ వరకు చదువుకున్నాను. పల్లెటూరులో పుట్టిపెరిగాను. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా చుట్టాలందరూ వచ్చేవారు. వారికి అమ్మమ్మ పిండివంటలు వండిపెట్టేది. నేనూ ఆమె దగ్గర నేర్చుకున్నాను. నాకు పాప, బాబు. పాప అమెరికాలో మాస్టర్స్ చదువుకుని ఇప్పుడ ఇక్కడే ఉంటుంది. బాబు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. ప్రస్తుతం నేను మా ఆయన ఇద్దరం ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. నాకు చిన్నప్పటి నుంచి వంటలపై పట్టు ఉండేది. పెళ్లయ్యాక ఖాళీగా ఉన్న నేను, స్నేహితుల సలహాతో 2006లో పిండివంటలను తయారుచేసే వ్యాపారాన్ని మొదలుపెట్టాను. వంద రూపాయలతో మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్ ఇప్పుడు లక్షల్లో చేరుకోవడం ఆనందంగా ఉంది. 30 రకాల స్వీట్లు,్ల్ల వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లు తయారు చేస్తాం. అలాగే వడియాలు, పొడులు, సక్కినాలు, జంతికలు, చెగోడి, సర్వపిండి ఇలాంటివి తయారుచేస్తాం. కేవలం తెలంగాణ అని కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ఫేమస్ అయిన పిండివంటలన్నీ మా దగ్గర దొరుకుతాయి. విదేశాలకు కూడా పంపించే సౌకర్యం ఉంది. ప్రతిరోజు చాలా వరకు ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన వారికి మా పిండివంటలు పంపిస్తాం. కారంలాంటివి ఇంట్లోనే కొట్టించి వాడుతుంటాం. పాలు నేరుగా రైతుల నుంచి తీసుకుంటాం. ఒక్కసారి వాడిన నూనె మళ్లీ వాడం. మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకంగా స్వీట్లు తయారుచేయడం మా ప్రత్యేకత. ఇక్కడ పనిచేసే 12 మందిలో 10 మంది మహిళలే ఉన్నారు. ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాల్లో ఇంత వరకు పాల్గొనలేదు. నాకు పబ్లిసిటీ అంటే నచ్చదు. అపోలో ఫ్యామిలీవారు ఎక్కువగా పిండి వంటలను మా దగ్గర కొనుగోలు చేస్తుంటారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు అప్పుడప్పుడు వెళ్లి కొన్ని పచ్చళ్లు ఇస్తుంటాను. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ విలువలు తెలుసు కాబట్టి నా దగ్గర ఉన్న కార్మికులతో కలిసిపోతుంటాను. ప్రతి సంవత్సరం మా గ్రామంలో జరిగే వినాయకచవితిలాంటి పండుగలకు కొన్ని పిండి వంటలు పంపిస్తుంటాం.
మా దగ్గరకు చాలా వరకు పెద్ద వయసు ఉన్నవారు వస్తుంటారు. విదేశాల్లో ఉండే వారి పిల్లలకు మా పిండి వంటలను పంపిస్తుంటారు. పెళ్లిళ్లకు, చిన్న చిన్న ఫంక్షన్లకు 10 రోజుల ముందే ఆర్డర్ ఇస్తే తయారుచేసి ఇస్తాం. పచ్చళ్లు, పిండి వంటలు కాకుండా బియ్యం, టీ పౌడర్, జొన్న రొట్టెలు వంటివి కూడా దొరుకుతాయి. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరిగినప్పుడు మేము మా ధరలు ఏమాత్రం పెంచం. సినిమా వారికి కూడా మా షాప్ నుంచి పార్సల్స్ వెళ్తుంటాయి. గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ముసలమ్మలతో మాట్లాడి నాకు తెలియని వంటల గురించి తెలుసుకుంటాను.

కాసోజు విష్ణు