Home ఎడిటోరియల్ పేరు గొప్ప ప్యాకేజీ

పేరు గొప్ప ప్యాకేజీ

Sampadakiyam      ప్రభుత్వాల అట్టహాస ప్రకటనల వెనుక నిరుపేదల పెదవులపై చిరుదరహాసాన్ని మొలిపించేదేమైనా ఉందా అని మన వంటి దేశాల్లోని ఆలోచనాపరులు శోధించడం సహజం. అత్యధిక శాతం ప్రజలు తల మీద సరైన గూడు, ఒంటి మీద నిండైన వస్త్రం, ముప్పూటలా తిండి కరువై అలమటిస్తున్న చోట వారి ఓటుతో అందలమెక్కే పాలకులు ముందుగా వారి పేగులను శాంతింప చేయడానికి ప్రాధాన్యమివ్వాలని కోరుకోడం తప్పు కాదు. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌లో పనులు కోల్పోయి ఎక్కడివారక్కడ చిక్కుబడిపోయి స్వస్థలాలకు వెళ్లే దారి లేక వందల, వేల కిలోమీటర్ల కాలి నడకలోనే ప్రాణాలు కడతేరిపోతున్న కోట్లాది మంది వలస కార్మికులకు కేంద్రం ఏమి చేస్తున్నదని ప్రశ్నించకపోడం అపరాధమవుతుంది. మార్చి 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ. లక్షా 70 వేల కోట్ల తొలి ప్యాకేజీలో పేదలకు విదిలించింది బహు తక్కువ, వారిని ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిందీ అతి పరిమితమే.

అందుచేత ప్రధాని మోడీ ఇతోధిక కేటాయింపులతో రెండో ప్యాకేజీని ప్రకటిస్తారని దేశం ఇంత కాలం ఎదురు కళ్లతో నిరీక్షించింది. అది ఇన్నాళ్లకు ఊడిపడింది కాని దాని నుంచి సాధారణ ప్రజానీకానికి సంక్రమించనున్నది మాత్రం సత్తు రూపాయేనని తేటతెల్లమైపోయింది. తాజా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 10 శాతం అంటే రూ. 20 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రధాని మోడీ మంగళవారం నాడు ప్రకటించిన రెండో ప్యాకేజీలో లాక్‌డౌన్‌లో దీర్ఘకాలం మూతపడి కుంగి కుదేలైపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎం ఎస్‌ఎంఇలు) పరిశ్రమలకు భారీగా, ఉదారంగా రుణాలివ్వడానికి నిర్ణయించారు. అంతేగాని చెమట చిందించి సిరులు పెంపొందించే అసలు సిసలు సంపద సృష్టికర్తలైన పేదలకు, వలస కార్మికులకు నేరుగా విదిల్చింది ఏమీ లేదు. అలాగే వారిని ఆదుకుంటున్న రాష్ట్రాలకూ ఈ ప్యాకేజీ ద్వారా ఒరిగేది ఏమీ ఉండదని చెప్పాలి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్ పథకం) పేరిట ప్రకటించిన ఈ ప్యాకేజీ లాక్‌డౌన్ వల్ల కొడిగట్టి పోయే స్థితికి చేరుకున్న ఎంఎస్‌ఎంఇలకు భారీగా ఉద్దీపన కలిగించి దేశాన్ని మేకిన్ ఇండియా వైపు గట్టిగా మళ్లించడానికి ఉద్దేశించారు.

ఇందుకోసం రూ. వంద కోట్ల టర్నోవర్ గల సంస్థలకు ఎటువంటి హామీలు అక్కర లేకుండా రుణాలివ్వడానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు. ఈ రుణాలు తీసుకునే సంస్థలు ఏడాది పాటు అసలు నుంచి పైసా తిరిగి చెల్లించనవసరం ఉండదు. దివాలా స్థితికి చేరుకున్న ఎంఎస్‌ఎంఇలకు ప్రత్యేక రుణాల కింద రూ. 20 వేల కోట్లు ప్రత్యేకించారు. మరి రూ. 50 వేల కోట్ల మేరకు పెట్టుబడి సహకార పథకాన్ని వాటి విస్తరణ కోసం ఉద్దేశించారు. ఈ పరిశ్రమలకు రుణాలిచ్చే నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకూ తోడ్పడనున్నారు. ఇంకా విద్యుత్తు పంపిణీ సంస్థలకు, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగానికి రాయితీలు కల్పించారు. ఇదంతా దేశీయ పరిశ్రమల వికాసానికి తద్వారా విదేశీ వస్తు బహిష్కరణకు తోడ్పడి భారత్ ఆర్థికంగా స్వావలంబన పథంలో పరుగులు తీయడానికి దోహదం చేస్తుందని ప్రధాని మోడీ ఆశిస్తున్నారు.

అయితే బ్యాంకులుగాని, ఇతర ఆర్థిక సంస్థలుగాని ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఎన్ని ఎంఎస్‌ఎంఇలకు సులభ రుణాలను మంజూరు చేస్తాయో అవి వాటిని ఎంతవరకు నిజాయితీగా ఉపయోగించి దేశ ఆర్థిక వృద్ధికి, జిడిపి పెరుగుదలకు తోడ్పడతాయో ఆచరణలోగాని రుజువు కాదు. బ్యాంకులను ముంచేసి ఆస్తులను పెంచుకునే భ్రష్టాచారానికి అలవాటు పడిన ప్రైవేటు రంగమూ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం లోతుగా వేళ్లూనుకున్న దేశంలో ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఈ పథకం మరొక పెద్ద కుంభకోణానికి దారి తీస్తే ఆశ్చర్యపోవలసిన అవసరం ఉండదు. రూ. 20 లక్షల కోట్ల కిమ్మత్తు పథకమని జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలనూ తెలుసుకోవలసి ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించిన ప్యాకేజీ, రిజర్వు బ్యాంకు తీసుకున్న ఉద్దీపన నిర్ణయాల విత్తం కూడా ఇందులో భాగమేనని ప్రధాని చల్లగా సెలవిచ్చారు.

గత మార్చి నెలాఖరులో ప్రకటించిన తొలి ప్యాకేజీ మొత్తం రూ. లక్షా 70 వేల కోట్లు, ఆర్‌బిఐ నిర్ణయాల వల్ల విడుదలైన రూ. ఐదారు లక్షల కోట్లు కూడా దీనిలోకే వస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రుణాల పరంగా విడుదల చేయబోతున్నది గట్టిగా రూ. 12 లక్షల కోట్లకు మించి ఉండబోదు. బ్యాంకుల ద్రవ్యతను పెంచడానికి దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ పథకం ద్వారా ఆర్‌బిఐ కల్పించిన రూ. లక్ష కోట్ల ద్రవ్య సౌలభ్యాన్ని కూడా కలుపుకుంటే కొత్త ప్యాకేజీ కింద ప్రభుత్వం విడుదల చేసేది రూ. 12 లక్షల కోట్ల కంటే తక్కువే అవుతుంది. అందుచేత ప్రధాని మోడీ, ఆర్థిక అమాత్యులు నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన తాజా భారీ సహాయ ప్యాకేజీ వల్ల వాస్తవంలో కలగబోతున్న మేలు అతి స్వల్పమేనని చెప్పక తప్పదు. ప్రధాని మోడీ ఆ విధంగా మరోసారి ఉత్తుత్తి చప్పుళ్లతో ఉవ్వెత్తు ప్రచారాన్ని సంపాదించుకున్నారని అనిపిస్తే తప్పు పట్టలేము.

FM announced Rs 20 lakh crore economic package