సౌత్‌లో స్టార్ హీరోయిన్లుగా పేరుతెచ్చుకున్న కాజల్, తమన్నా, త్రిషలు కెరీర్ పరంగా చరమాంకంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే వెల్లువలా దూసుకొస్తున్న యువ కథానాయికల హవా ముందు తమని తాము కాపాడుకునేందుకు నిరంతరం ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందేనని ఈ భామలు అర్థం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే పూర్తిగా క్రేజు మసకబారక ముందే అవకాశాల కోసం ఇతర ఆప్షన్స్ వెతుకుతున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా ఇద్దరూ వెబ్ సిరీస్‌ల బాట పట్టారు. దీంతో పాటే ఇరుగు పొరుగు భాషల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు-, తమిళంలో అవకాశాలు తగ్గడంతో కన్నడ-, మలయాళం చిత్ర పరిశ్రమల వైపు చూస్తున్నారు ఈ భామలు.
ఇక కాజల్, -తమన్నా బాటలోనే త్రిష వెబ్ సిరీస్ అవకాశాలను పరిశీలిస్తోందట. త్రిష ఇప్పటికే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన ఓ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ‘96’ సక్సెస్‌తో తిరిగి తమిళంలో బిజీ అయి కన్నడ రంగంలో అవకాశాలు వచ్చినా అంగీకరించడంలేదు. ఏమాత్రం సీన్ మారినా ఆమె మరోసారి కన్నడంలో నటించేందుకు ఆస్కారం ఉంది.
ఇక తాజాగా అందాల చందమామ కాజల్… కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ‘కబ్జా’ అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. తెలుగు, తమిళం సహా హిందీ పరిశ్రమలో నటించిన మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కెరీర్ గ్రాఫ్ నెమ్మదిస్తోంది. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌తో కన్నడిగులకు పరిచయమైంది. ఆ తర్వాత కన్నడ రంగంలో అవకాశాలు వెల్లువెత్తినా కాదందట. అయితే ఇప్పుడు సీన్ మారుతున్న కొద్దీ కన్నడ , మలయాళ పరిశ్రమల వైపు దృష్టి సారిస్తోందట.