Home ఎడిటోరియల్ ఆపదలో ఆహార భద్రత!

ఆపదలో ఆహార భద్రత!

cartoonకశ్మీర్ లోయలో భద్రతా చర్యలు, ఆర్ధిక వ్యవస్థలో చోటు చేసుకున్న మాంద్యం ఈ వార్తలతోనే పత్రికలు నిండిపోతున్నాయి. జమ్ము కశ్మీరు ఆర్థిక వ్యవస్థను బాగు చేసే కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ కూడా తలమునకలై ఉండవచ్చు. కాని వాతావరణ మార్పుల వల్ల భారత వ్యవసాయ రంగంపై పడుతున్న ప్రభావం గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలు ఇప్పుడు కాదు చాలా కాలం తర్వాత కనబడవచ్చని తాపీగా కూర్చునే పరిస్థితి ఇప్పుడు లేదు. భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం వార్షిక ఉష్ణోగ్రతలు 1901 2018 మధ్య కాలంలో 0.6 డిగ్రీల సెల్పియస్ పెరిగాయి. ఈ శతాబ్ద కాలంలో అత్యంత వేడిగా గడిచిన 11 సంవత్సరాలు గత 15 సంవత్సరాల కాలంలోనే ఉన్నాయి. 2018 అత్యంత వేడిగా గడిచిన సంవత్సరంగా నమోదైంది.

భూతాపం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కర్బన ఉద్గారాల సమస్య మరింత జటిలమవుతోంది. 2100 నాటికి ప్రపంచంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరగవచ్చని అంచనా. భౌగోళికంగా భారతదేశం ఉన్న ప్రాంతం వేడి ప్రాంతం కాబట్టి భూతాపం పెరిగితే ఈ సమస్య మనకు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ తలసరి ఆదాయం కూడా తక్కువ. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం, ఆహార ఉత్పత్తి దెబ్బ తింటాయి. ఒక అంచనా ప్రకారం ప్రధాన పంటల ఫలసాయం తగ్గిపోతుంది. దాదాపు 25 శాతం దిగుబడి తగ్గవచ్చని తెలుస్తోంది.

రానున్న సంవత్సరాల్లో ఆహార భద్రతకు ప్రమాదాలున్నాయని, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చని ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్ నివేదిక తెలియజేస్తోంది. ప్రపంచ జనాభా ప్రస్తుతం 770 కోట్లు. 2030 నాటికి ఈ జనాభా 850 కోట్లు కావచ్చు. 2050 నాటికి 970 కోట్ల మంది భూగోళంపై నివసిస్తుంటారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం భారత జనాభా కూడా 136 కోట్ల నుంచి 2030 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది. 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుంది. జనాభాకు ఆహార భద్రత, పోషకాహారం అందించడానికి పటిష్టమైన పథకాలు అవసరం. ఉష్ణోగ్రతలు పెరగడం, అతివృష్ఠి వంటివి వ్యవసాయాన్ని దెబ్బ తీస్తాయి. నేల సారాన్ని కూడా దెబ్బ తీస్తాయి. సాగు నీరు లభించదు. పురుగుల బెడద ఎక్కువవుతుంది. దిగుబడి పడిపోతుంది. పశుపోషణపై కూడా ప్రభావం పడుతుంది. చేపల పెంపకం కూడా దెబ్బ తింటుంది.

వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించేది సైన్సు మాత్రమే. 2011లో కేంద్ర వ్యవసాయ శాఖ వాతావరణ మార్పుల వల్ల పడే ప్రభావాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టి పరిశోధనలను ప్రోత్సహించింది. వాతావరణాన్ని తట్టుకునే వినూత్న వ్యవసాయ పద్ధతులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రారంభించింది. వాతావరణ మార్పుల్లో అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం, దిగుబడి పెంచడం, పశుపోషణ, చేపల పెంపకాలపై పడే ప్రభావాన్న కూడా తగ్గించడం తదితర లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన సంస్థల్లో ఈ పరిశోధనకు పూనుకుంది. దేశంలో దాదాపు 151 వాతావరణ మార్పులకు గురయ్యే జిల్లాలను కూడా గుర్తించారు. బహుశా ఈ వివరాలేవీ మన రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదు.

పంటలపై పడే ప్రభావాన్ని తెలుసుకునే పరిశోధనలు జరిగాయి. 2020, 2050, 2080 సంవత్సరాల్లో వాతావరణం ఎలా ఉంటుందన్న లెక్కల ఆధారంగా అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో తేలిందేమిటంటే సాగు నీరు ఉన్న ప్రాంతాల్లో వరి దిగుబడి 2050 నాటికి 7 శాతం తగ్గవచ్చు. 2080 నాటికి 10 శాతం తగ్గవచ్చు. మొక్కజొన్న దిగుబడి ఖరీఫ్ లోని సాగు నేలల్లో 2020 నాటికి 18 శాతం తగ్గవచ్చు.

2018-19 సంవత్సరంలో కూడా అనావృష్ఠి కారణంగా మొక్కజొన్న పండించే ప్రాంతాల్లో దిగుబడి దెబ్బతింది. అయితే జులై, ఆగష్టు నెలల్లో కురిసిన వర్షాల వల్ల వచ్చే సంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కర్నాల్ లో ఉంది. ఇక్కడ జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే, ఉష్ణోగ్రత పెరిగితే ఆవుల్లో, గేదెల్లో పునరుత్పాదక శక్తి తగ్గిపోతోంది. అలాగే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో తెలిసిందేమిటంటే, తూర్పు కోస్తా తీరాల్లోని చేపల జాతులు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. పశ్చిమ కోస్తా తీరాల్లో అంతగా ఈ ప్రభావం లేదు. వాతావరణ మార్పులు సముద్రంలో ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. సముద్ర జలాల ఆమ్ల స్వభావాన్ని, ఉష్ణోగ్రతను, ఆహార లభ్యతను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ చేపల ఉత్పత్తిపై ప్రభావం వేస్తాయి.

పరిశోధనల్లో తేలిందేమిటంటే గంగా, సింధూ మైదానంలో వరి, గోధుమ పంటలు, పశ్చిమ బెంగాల్లో జొన్న, ఆలుగడ్డల పంటలు, దక్షిణాది ప్రాంతాల్లో జొన్న, ఆలుగడ్డలు, మొక్కజొన్న పంటల దిగుబడి తగ్గిపోవచ్చు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సోయాబిన్, వేరుశనగ, ఆలుగడ్డల దిగుబడి కూడా తగ్గుతుందని తెలుస్తోంది. ఉత్తర భారత దేశంలో పత్తి దిగుబడి కూడా పడిపోవచ్చు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో యాపిల్ దిగుబడి పెరగవచ్చని తెలుస్తోంది. వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వేడిని, కరువు పరిస్థితులను తట్టుకునే గోధుమ, పప్పుధాన్యాల విత్తనాలు అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.

అలాగే వరదలను తట్టుకునే వరి విత్తనాలు అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను కనిపెట్టడానికి కష్టపడి పని చేస్తున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఆహార ధాన్యాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సహభాగీధాన్ అలాంటి ఒక వరి వంగడం. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, మన దేశానికి చెందిన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కలిసి తయారు చేసిన వరి వంగడమిది. దీన్ని 2010లో మార్కెట్ లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ వరి వంగడం చాలా విజయవంతమైన పరిశోధనగా రుజువయ్యింది. కరువు పరిస్థితులు ఏర్పడే తూర్పు భారత ప్రాంతాల్లో దీనివల్ల మంచి ఫలితాలు లభించాయి. కేవలం 105 రోజుల్లోనే కోతకు వస్తుంది.

ఇతర వరి రకాలు కోతకు రావాలంటే 120 నుంచి 150 రోజులు పడుతుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ వరదలను తట్టుకునే వరి వంగడాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. 15 రోజుల పాటు నీట మునిగి ఉన్నప్పటికీ తట్టుకునే వరిని తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒడిశా, శ్రీలంకల్లోని వరి రకాల్లో ఇలాంటి జన్యువు వున్నట్లు గుర్తించారు. జన్యు మార్పిడి వంగడాల పట్ల సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ వరద బాధిత ప్రాంతాల్లోని రైతులకు ఇవి ఎంతో ఊరటనిస్తాయి. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పులు రైతులను కోలుకోలేని దెబ్బ తీసే వరకు ప్రభుత్వాలు వేచి ఉండడం మంచిది కాదు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోతోంది. ఈ సూచనలను వెంటనే గుర్తించవలసిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం గొప్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ భారత వ్యవసాయ రంగానికి దశదిశ నిర్దేశించే గట్టి చర్యలేవీ చేపట్టలేదు. ఆర్ధిక మాంద్యం గురించి కనబడుతున్న ఆందోళన వ్యవసాయ సమస్యల విషయంలో కనబడడం లేదు.

food security at risk

 

* సిరాజ్ హుస్సేన్ ( ది వైర్)