సావోపాలో: అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దపేగుకు సర్జరీ అనంతరం పర్యవేక్షణ నిమిత్తం ఆయనను ఐసియులో ఉంచారు. అయితే ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడ గలుగుతున్నారని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలియజేశాయి. తన ఆరోగ్యం రోజురోజుకు మెరుగవుతోందని పీలే తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా గత నెల ఆస్పత్రికి వెళ్లగా పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించాలని తెలిపారు. రొటీన్ కార్డియో వాస్కులర్, లేబొరేటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు ఉంది. అంతేకాకుండా బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది.
Football Legend Pele Remains in ICU