– శ్రీకాంత్ సంస్మరణ సభలో వక్తలు
మనతెలంగాణ/సోమాజిగూడ ః విలువలతో కూడిన జర్నలిజంతో వన్నె తెచ్చిన జర్నలిస్ట్ గుర్రంకొండ శ్రీకాంత్ నేటి జర్నలిస్టులకు ఆదర్శమని సీనియర్ పాత్రికేయులు రాంచంద్రమూర్తి కొనియాడారు. శ్రీకాంత్ జర్నలిస్టుల శిష్యబృందం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో దివంగత జర్నలిస్ట్ గుర్రంకొండ శ్రీకాంత్ సంస్మరణ సభను నిర్వహించారు. సీనియర్ పాత్రికేయురాలు అజిత అద్యక్షతన జరిగిన ఈ సభకు సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, టంకశాల అశోక్, ఎంఎల్‌సి రామచంద్రయ్యలు విచ్చేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆపునాడు మ్యాగజైన్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను అధ్యయనం చేసి తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తు, వామపక్షమేధావిగా నిలిచి పొయారని పేర్కొన్నారు. శ్రీకాంత్ విలువలతో ఉంటూ ఎక్కడ రాజీపడకుండ తన వృత్తి దర్మాన్ని నిర్వర్తించాడని కొనియాడారు. ఉదయం పత్రికను మూసి వేసినతరువాత తిరిగి తెరిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, ఆ సమయంలో తనతో పాటు శ్రీకాంత్ కూడ ఉన్నారని రామచంద్రమూర్తి గుర్తు చేశారు. శ్రీకాంత్ తనతో కలిసి వార్త దినపత్రికలో కలిసి పనిచేశామని చెప్పారు. చాలామంది ఆయన శిష్యులు శ్రీకాంత్ వద్ద పనిచేశామని గర్వంగా చెప్పుకుంటారని, అది ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఏదైనా ప్రసంగాలు చేసేముందు శ్రీకాంత్ సలహాలు తీసుకునేవాడినని ఎంఎల్‌సి రామచంద్రయ్య తన అనుభవాలను గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో శ్రీకాంత్ లాంటి జర్నలిస్టులు అవసరమని పేర్కొన్నారు. శ్రీకాంత్ సార్ పేరుమీద ఓ ప్రత్యేకమైన అవార్డును ఏర్పాటుచేసి ఉత్తమ జర్నలిస్టులకు అందజేస్తామని శ్రీకాంత్ శిష్యబృందం ప్రకటించారు. ఈ సభలో టియూడబ్లుజె ఉపాద్యక్షులు పల్లె రవి కుమార్, పాత్రికేయులు మంజరి, యల్ శ్యాంసుందర్ రెడ్డి, శ్రీకాంత్ సతీమని కుసుమ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాజమౌళీ చారి తదితరులు పాల్గోన్నారు.