Saturday, April 20, 2024

సంపాదకీయం: ఎన్‌జిఒలపై కన్నెర్ర

- Advertisement -
- Advertisement -

Foreign Donations Amendment Bill effect on NGOs

కేంద్రప్రభుత్వం సోమవారం నాడు లోక్‌సభ ఆమోద ముద్ర వేయించుకున్న విదేశీ విరాళాల (సవరణ) బిల్లును దేశంలోని ఏ అండాలేని కోట్లాది అణగారిన వర్గాల చేతి ఊతకర్రను ఊడబెరకడానికి ఉద్దేశించిన ఘాతుక శాసన చర్యగా పరిగణించడం ఆక్షేపణీయం కాదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు ప్రత్యామ్నాయంగా మూడవ అతి పెద్ద రంగంగా దేశమంతటా అల్లుకున్న ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జిఒలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్) కు విదేశాల నుంచి అందుతున్న విరాళాల వినియోగంపై తీవ్రమైన ఆంక్షలు విధించడానికి ఈ బిల్లును ఉద్దేశించారు. ప్రజారోగ్యం నుంచి హక్కుల పరిరక్షణ వరకు వివిధ రంగాలలో నోరు లేని వర్గాలకు అండగా ఉంటున్న ఈ సంస్థల వెన్నెముకను విరిచేయడమే ప్రభుత్వ ఉద్దేశమనే విమర్శ వెల్లువెత్తుతున్నది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని గత యుపిఎ ప్రభుత్వం కూడా 2010లో ఈ చట్టానికి సవరణ తెచ్చి ఎన్‌జిఒలను కట్టడి చేసింది. 2012లో తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజల ప్రాణ భద్రత కోసం ఉద్యమించిన ఎన్‌జిఒలపై చర్య తీసుకున్నది.

అలాగే అటవీ ప్రాంతాలలో బొగ్గు గనుల కేటాయింపు ద్వారా ఆదివాసీల బతుకులను ధ్వంసం చేయడాన్ని సవాలు చేసిన గ్రీన్ పీస్, చత్తీస్‌గఢ్‌లో గిరిజనుల హక్కుల రక్షణకు పోరాడిన పౌర హక్కుల ప్రజాసంఘం వంటి ఎన్‌జిఒల మీద కూడా ఎన్‌డిఎ ప్రభుత్వం విరుచుకుపడిన ఉదంతాలున్నాయి. దేశ రాజకీయా ల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని నిరోధించడానికి ఉద్దేశించి 1976లో విదేశీ విరాళాల చట్టాన్ని తీసుకు వచ్చారు. ప్రజాస్వామిక ప్రమాణాల మేరకు ప్రజా జీవనాన్ని మెరుగుపరిచే కృషిలో భాగంగా పని చేస్తున్న ఎన్‌జిఒలను దేశాభివృద్ధిని అడ్డుకుంటున్న విదేశీ ఏజెంట్లుగా పరిగణించడం మన పాలకులకు అలవాటైపోయింది. ఎన్‌డిఎ ప్రభుత్వం 2018లో 20 వేల ఎన్‌జిఒల లైసెన్సులను రద్దు చేసింది. అందులో దళితుల హక్కుల కోసం పని చేసిన నౌ సర్జన్ అనే సంస్థ కూడా ఉంది. పేద పిల్లలకు విద్య అందించడం, దిక్కు మొక్కు లేని జనానికి ఆరోగ్య సేవలు లభించేలా చూడడం, విలయాలలో, విపత్తులలో బాధితులను ఆదుకోడం, భారత రాజ్యాంగం ప్రసాదిస్తున్న హక్కులు అట్టడుగు వర్గాలకు అంది వచ్చేలా చేయడం, ప్రభుత్వాలను ప్రజలకు జవాబుదారీ గావించడం, శాస్త్రీయ పరిశోధనలకు అండగా నిలవడం వంటి ఎన్నో కోణాల్లో దేశంలోని లక్షలాది ఎన్‌జిఒలు పని చేస్తున్నాయి.

ఈ సంస్థలు పలు మార్గాల నుంచి వచ్చే విరాళాల మీద ఆధారపడి పని చేస్తుంటాయి. అందులో ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం వీటిని వినియోగించుకొనేటప్పుడు ఇచ్చే డబ్బు కూడా ఉంటుంది. కార్పొరేట్ సామాజిక భద్రత బాధ్యత కింద రూ. 5 కోట్లు మించి లాభాలు గడించే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు అందులో రెండు శాతం నిధులను కేటాయించవలసి ఉంటుంది. ఆ డబ్బులో కొంత భాగం కూడా ఎన్‌జిఒలకు అందుతూ వచ్చేది. కరోనా నేపథ్యంలో ఏర్పాటైన ఏ షరతూ వర్తించని నిర్నిబంధమైన ‘పిఎం కేర్స్’ నిధికి కార్పొరేట్ విరాళాలన్నీ తరలిపోతున్న కారణంగా ఎన్‌జిఒలకు అటు నుంచి కూడా సాయం ఆగిపోయినట్టే. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, ఎంపిలు, మంత్రులు, ఎంఎల్‌ఎల వంటి వారికి అంటే ప్రజా సేవకులకు విదేశీ విరాళాలు పొందే హక్కు ఉండదు. అలాగే ఈ చట్టం ద్వారా విరాళాలు పొందే ఎన్‌జిఒలు కింది స్థాయిలోని వేరే ఏ చిన్న ఎన్‌జిఒకు ఆ నిధులు మళ్లించకూడదు. ముఖ్యంగా పాలనావసరాల కింద వాడుకోదగిన విత్తం పరిమితిని ప్రస్తుతమున్న విదేశీ విరాళంలోని 50 శాతం నుంచి 20 శాతానికి సవరణ చట్టం కుదించివేస్తుంది. దీని వల్ల ఎన్‌జిఒలు తాము పని చేయదలచుకునే రంగంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోడానికి, పరిష్కారాలను కనుకోడానికి అవసరమయ్యే పరిశోధన కింద చేసే ఖర్చు అతి పరిమితమైపోతుంది.

పై స్థాయిలో ఏర్పడే ఒక పెద్ద ఎన్‌జిఒ తన ప్రకటిత లక్షాన్ని సాధించుకోడానికి కింది స్థాయి వరకు అనేక అంచెలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అందుకు కింది స్థాయి వరకు విరాళాల బదిలీ అవసరమవుతుంది. కొత్త చట్టం వల్ల అటువంటి పంపిణీకి అవకాశాలు పరిమితమైపోతాయి. విదేశాల నుంచి వచ్చే విరాళాలన్నీ ఢిల్లీలోని స్టేట్ బ్యాంకుకే చేరాలన్న నిబంధన ఎన్‌జిఒలపై మరిన్ని పరిమితులను విధించనున్నది. కేంద్ర హోం శాఖ నిఘా పరిధిలో పని చేయక తప్పని పరిస్థితిని నెలకొల్పడమే ఈ నిబంధన ఉద్దేశమని ఎన్‌జిఒల బాధ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 31 లక్షల ఎన్‌జిఒలు పని చేస్తున్నట్టు సమాచారం. వీటి శాఖోపశాఖల కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక లక్షల మంది బాధ్యులున్నారు. వారందరి ఉపాధులు ఈ సవరణ చట్టం వల్ల దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. దేశమంతటినీ ప్రైవేటు గుప్పెట్లోకి నెట్టివేస్తున్న పరిస్థితుల్లో వారిని ప్రశ్నించేవారు లేకుండా చేయడమే ఈ సవరణ చట్టం ఉద్దేశమా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News