Home ఎడిటోరియల్ దిద్దుబాటు లేకపోగా దూకుడు

దిద్దుబాటు లేకపోగా దూకుడు

BIHARబీహార్ ఎన్నికల్లో ఘోరపరాజయం బిజెపిలోని వృద్ధతరానికి, అసమ్మతివాదులకు గళమిచ్చినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ బృందంపై ఎటువంటి ప్రభావం చూపినట్లు లేదు. ఒకవేళ, ఏదైనా ప్రభావమున్నా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, అది లేనట్లే చాటుకునేందుకు తమ ప్రజావ్యతిరేక,

అనుకూల విధానాల అమలులో దూకుడు పెంచి ఏకంగా 15 ప్రధానరంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) పరిమితులు పెంచే లేదా ద్వారాలు బార్లా తెరిచే చర్యలు ప్రకటించింది. వాటిలో ఎక్కువభాగం, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ఆటోమేటిక్ మార్గంలో అనుమతి స్తున్నట్లు ప్రకటించటం మరీ దారుణం. దీంతో ‘వ్యాపారాలను సులభతరం చేసిన’ దేశాల జాబితాలో 135వ స్థానం నుంచి ఎగబ్రాకుతామని, ఎఫ్‌డిఐ కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంకోచరహితంగా ప్రకటించారు. బీహార్ ఫలితాలకు రెండ్రోజులముందు ‘స్వచ్ఛ భారత్ పన్ను’ పేరుతో సర్వీసు టాక్స్‌ను అరశాతం పెంచారు. ఇది చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా వున్న కమిటీ సిఫారసు. దీంతో సేవాపన్ను 14.5 శాతానికి పెరుగుతుంది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై అదనపు భారం మోపటానికి వారికి కించిత్తైనా బెరుకు లేకపోయింది. అలాగే రైల్వే టిక్కెట్ల రద్దు ఛార్జీలను రెట్టింపు చేశారు. కనీస ఆదాయపు పన్ను చెల్లించేవారికి సైతం వంటగ్యాస్ సబ్సిడీ ఉపసంహరించాలని ఆలోచిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అలాగే విద్యుచ్ఛక్తి పంపిణీ సంస్థల (డిస్కంలు) పేరుకుపోయిన నష్టాలను రాష్ట్రప్రభుత్వాలకు (75శాతం), విద్యుచ్ఛక్తి బోర్డులకు (25శాతం) బదలాయించే స్కీమును ప్రభుత్వం ప్రకటించింది. విద్యుచ్ఛక్తి పంపిణీ వ్యాపారంలో వున్న టాటాలు, రిలయెన్స్ వంటి కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుంది.
ఈ తిరోగమన, ప్రజావ్యతిరేక చర్యలకు పరాకాష్టగా 15 కీలక రంగాల్లో ఎఫ్‌డిఐ పరిమితులు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. బీహార్‌లో పాలకపార్టీకి ఎదురుదెబ్బ సంస్కరణలను వేగవంతం చేసే విధానాలపై ప్రభావం చూపుతుందేమోనని స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు సందేహించకుండా, ప్రధానమంత్రి బ్రిటన్ పర్యటనకు, అక్కడనుంచి టర్కీలో జి.20 సమావేశానికి బయలు దేరేముందు, ఈ హామీపత్రాన్ని జేబులో పెట్టుకుని మరీ విమానమెక్కారు. ప్రతిపక్షంలో ఉండగా, రిటైల్ వ్యాపారంలోకి ఎఫ్‌డిఐని గట్టిగా వ్యతిరేకించిన బిజెపి విధానాన్ని పూర్తిగా వెనక్కి మళ్లించటం కూడా ‘సంస్కరణ’ల్లో ఉండటం విశేషం. బిజెపి ద్వంద్వనీతిని ఇది బట్టబయలు చేస్తున్నది. భూసేకరణ చట్టానికి సవరణలు తెచ్చిన ఆర్డినెన్సులు కూడా అటువంటివే. ఎఫ్‌డిఐ పరిమితులు పెంచిన లేక 100శాతం అనుమతించిన రంగాల్లో వస్తూత్పత్తి, ప్రైవేటు బ్యాంకులు, పౌర విమానయానం, తోటల పెంపకం, బ్రాడ్‌కాస్టింగ్, మైనింగ్, వ్యవసాయం-పశుసంవర్థన, భవన నిర్మాణాలు, రక్షణ తదితర రంగాలున్నాయి. రక్షణరంగం, ప్రసార రంగాల్లోకి ఎఫ్‌డిఐ అనుమతించటం దేశ స్వావలంబన కృషికి, సార్వభౌమత్వానికి చేటు చేస్తుంది. రక్షణ ఉత్పత్తుల రంగంలోకి 49శాతం ఎఫ్‌డిఐని అనుమతించి అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ తదితర దేశాలు ఎన్నేళ్లగానో చేస్తున్న ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలొగ్గింది. ఇక అత్యంత కీలకమైన బ్రాడ్ కాస్టింగ్ రంగానికొస్తే ఎఫ్‌ఎం రేడియో, వార్తా ఛానళ్ల అప్‌లింకింగ్‌లో అప్రూవల్ రూటులో ఎఫ్‌డిఐ పరిమితిని 29 నుంచి 49 శాతానికి పెంచిన ప్రభుత్వం, డిటిహెచ్, కేబుల్ నెట్‌వర్క్, మొబైల్ టీవి, హిట్స్ అంట్ టెలిపోర్ట్, వార్తా యేతర ఛానళ్లలో ఎఫ్‌డిఐ పరిమితిని 74 నుంచి 100 కు పెంచింది. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించే పెట్టుబడుల పరిమితిని రూ.3000కోట్ల నుంచి రూ.5000 కోట్లకు పెంచింది. పార్లమెంటు ముందుకు రాకుండా, అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం ద్వారా ఒకేసారి ఇన్ని రంగాల్లో ఎఫ్‌డిఐలపై నిర్ణయం తీసుకోవటం ఇదే ప్రథమం. ఎవరు ఏమైనా అనుకోండి – మా బాట మాదే అని మోడీ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టింది. ‘స్వదేశీ’ అని ఘోషించే ఆర్‌ఎస్‌ఎస్, మరికొన్ని పరివార్ సంస్థలు నోరుమెదపకపోవటం గమనించదగ్గది.
ఆర్థిక సంస్కరణల విషయంలో చూపిన దూకుడే, బీహార్ ఎదురుదెబ్బతర్వాత నోరువిప్పిన పార్టీ పెద్దలపైన ఎదురుదాడిలోను కనిపిస్తుంది. బీహార్‌లో పరాజయానికి నరేంద్రమోడీ, అమిత్‌షా బాధ్యత వహించాలనే గొంతులు బలపడకుండా ముందు జాగ్రత్తగానే అద్వానీ తదితరులపై పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం మంత్రులైన వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరి, రాజ్‌నాథ్‌సింగ్ చేత సంయుక్త తిరస్కార ప్రకటన ఇప్పించారు. మోడీ, అమిత్‌షా ఒంటెత్తు పోకడపట్ల గొంతువిప్పటానికి బీహార్‌లో బిజెపి పరాజయం వృద్ధనాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్‌జోషీ, యశ్వంత్‌సిన్హా, శాంతాకుమార్‌లకు అవకాశం కల్పించింది. మోడీ, అతని బృందం గత సంవత్సరకాలంలో పార్టీని నిర్వీర్యం చేశారని, సమష్టి నిర్ణయాల పద్ధతిని గాలికొదిలేశారని, కొద్దిమంది తీసుకునే నిర్ణయాలను పార్టీ అనుసరించేటట్లు చేశారనీ, అందువల్ల విజయాలొచ్చినపుడు తమ ఘనతగా చాటుకునేవారు ఢిల్లీ, బీహార్ పరాజయాలకు బాధ్యత వహించాలని వారొక సంయుక్త ప్రకటనలో కోరారు. వాటిపై అందుకు కారకులైన బాధ్యులు కాకుండా ఇతరులు సమీక్షించాలన్నారు. ఓటమికి అందరూ బాధ్యులేనన్న అరుణ్‌జైట్లీ వాదనను వారు తిరస్కరించారు. జవాబుదారీ తనం కోరినందుకు సీనియర్ నేతలపై కొన్ని గంటల్లోనే మోడీ విశ్వాస పాత్రులనుంచి ఎదురు ప్రకటన వచ్చింది. సీనియర్‌ల సంయుక్త ప్రకటన మోడీ-షా నాయకద్వయంపై అభిశంసనలాగా ఉన్నందున, ఆలస్యం చేస్తే అంటువ్యాధిలా వ్యాపిస్తుందని బయపడ్డారో ఏమో! శతృఘ్నసిన్హా తదితర ముగ్గురు- నలుగురు బీహార్ ఎంపిలు కూడా మోడీ-షా ఎన్నికల ప్రచారం నడిపిన తీరును ఆక్షేపించారు. ఏదిఏమైనా, ఎదురుదాడితో తప్పులు కప్పిపుచ్చుకోలేరు! చేటుచేసే సంస్కరణలతో ప్రజాభిమానం పొందలేదు!! ‘అసహన’ కార్యక్రమాలతో భారతదేశ మౌలిక విలువలను కాపాడలేరు!!!