Wednesday, April 24, 2024

ఎల్‌ఐసిని ముంచుతున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

Foreign investment in LIC

మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి మరీ బహుళ జాతి సంస్థలకు పీటలేస్తూ దేశ ప్రజల పీకల మీదకు తెచ్చి పెడుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వజూపుతుంది. ఇదే జరిగితే, సంస్థ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) లో విదేశీ పెట్టుబడిదారులు కూడా పాల్గొనే వీలు కలుగుతుంది. ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐ అనుమతికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల విభాగం, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపవ్‌ు) గతంలో చర్చలు కూడా జరిపాయి. ఎల్‌ఐసిలో ఎక్కువ వాటాను ఒకటే విదేశీ పెట్టుబడి సంస్థ కొనుగోలు చేసేలా వీలు కల్పించడమే ఈ చర్చల సారాంశం.

ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డిఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్‌ఐసికి వర్తించదు. ఎందుకంటే ప్రజల చిన్న మొత్తాల పొదుపును ప్రీమియంల రూపంలో సమీకరించి, తద్వారా దేశ సర్వతోముఖాభివద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఎల్‌ఐసిని పార్లమెంటు చట్టం ద్వారా 1956లో ఏర్పరిచారు కాబట్టి. అలాంటి ఎల్‌ఐసిలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తే అతి పెద్ద విదేశీ పెన్షన్ ఫండ్‌లు, బీమా సంస్థలు దేశంలోనే అతి పెద్ద ఐపిఒగా భావిస్తున్న ఎల్‌ఐసి పబ్లిక్ ఇష్యూలో పాల్గొనే వీలుంటుంది.ఇది దేశ ప్రజలకు ప్రమాదకరమైనప్పటికీ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించడానికే వాణిజ్యం, పరిశ్రమల శాఖ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) విధానాల సవరణకు నడుం బిగించింది. బీమా రంగానికి చెందిన ప్రస్తుత విధానాలు ఎల్‌ఐసి డిజిన్వెస్ట్‌మెంట్‌కు అనుమతించవని, దీంతో మార్గదర్శకాలను సవరించాల్సిందేనని, వెరసి ఎఫ్‌డిఐ విధానాలు మరింత సరళీకరించి వీలైనంత త్వరగా సవరించిన విధానాలను ప్రకటిస్తామని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి) కార్యదర్శి అనురాగ్ జైన్ ప్రకటించారు.

ఎల్‌ఐసి ప్రత్యేక చట్టంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం లేదు కాబట్టే ఐపిఒను పూర్తి చేసి దాని ద్వారా నిధుల సేకరణతో ఎల్‌ఐసిలో వాటాలు ఉపసంహరించుకోవాలనేదే కేంద్రం ఎత్తుగడ. అందుకోసమే ఎల్‌ఐసి చట్టానికి సవరణలు తీసుకొచ్చే ప్రక్రియను మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఐసి చట్టం ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లు మాత్రమే ఆ సంస్థలో వాటాల కొనుగోలుకు నిబంధనలు పర్మిట్ చేస్తున్నాయి. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లకు అనుమతులు ఉన్నా ఎల్‌ఐసికి ఈ నిబంధనలు వర్తించవు గాబట్టి ఇన్వెస్టర్లను అనుమతించడానికే ఎల్‌ఐసి చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. ఇలా ఎల్‌ఐసి చట్టాన్ని సరళతరం చేస్తే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డిఐ పాలసీ ప్రకారం దేశీయ బీమా రంగంలో నేరుగా 74 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తారు.

అయితే ప్రత్యేక చట్టం కింద ఎల్‌ఐసి ఉన్నందున ఈ నిబంధనలు దానికి వర్తించవు. ఈ నేపథ్యంలోనే దేశ చరిత్రలోనే అతి పెద్దది కానున్న ఎల్‌ఐసి ఐపిఒ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ శాఖలు చురుగ్గా చర్యలు చేపట్టి జయప్రదంగా ఎల్‌ఐసి ఐపిఒ ముగియడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసిని లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపంకు సలహాదారులుగా డెలాయిట్ కంపెనీ, ఎస్‌బిఐ కాప్స్ కంపెనీలను నియమించింది. ఎల్‌ఐసి నిజ విలువ మదింపు చేయడానికంటూ మిల్లిమాన్ కంపెనీని కూడా నియమించింది. అంతిమంగా ఎల్‌ఐసిలో వాటాలు అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేమంటే మన దేశ బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఐఆర్‌డిఎ చట్టం-1999 ద్వారా బీమా రంగంలో 26 శాతం విదేశీ ఈక్విటీని అనుమతించారు. తదనంతరం ఎఫ్‌డిఐ పరిమితిని 2015 సంవత్సరంలో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఇప్పుడు ఈ పరిమితిని 49 నుండి 74 శాతానికి పెంచి బీమా సంస్థలలో కూడా విదేశీ యాజమాన్యాన్ని అనుమతించాలనేదే కేంద్ర ప్రభుత్వ నాటకం.

మన దేశ బీమా రంగంలోకి ప్రవేశించిన పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల విస్తరణ కోసం దేశం వెలుపల భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ బీమా సంస్థలు ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యి, మార్కెట్ల ద్వారా మూలధనాన్ని సమీకరించే స్థితిలోనే ఉన్నాయి. కనుక దేశీయ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల అవసరమే లేదు. ఒకవేళ బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఎక్కువగా అనుమతిస్తే అవి దేశీయ పొదుపుపై పట్టు, నియంత్రణ సాధిస్తాయి. గతంలో ప్రపంచ వ్యాప్త అనుభవాలను బట్టి చూస్తే విదేశీ పెట్టుబడులు, దేశీయ పొదుపుకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపితమైంది. ఇప్పటికే 49 శాతం పరిమితితో ఉండాల్సిన విదేశీ పెట్టుబడులు జీవిత బీమాలో 35.36 శాతం, సాధారణ బీమాలో 23.66 శాతంగా మాత్రమే ఉన్నాయి.

అందువల్ల బీమా పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. గత ఇరవై సంవత్సరాల కాలంలో ఇప్పటి దాకా ఎఫ్‌డిఐ ల ద్వారా దేశ బీమా రంగంలోకి వచ్చిన రూ. 10 వేల కోట్ల పెట్టుబడులలో అధిక భాగం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికే ఉపయోగించారు తప్ప దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం ఏ మాత్రమూ ఉపయోగపడలేదు. ఇప్పటి వరకూ లిస్టింగ్ అయిన ప్రైవేటు బీమా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చూస్తే, దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం అవి పెట్టిన పెట్టుబడులు నామమాత్రమే అని అర్ధం అవుతుంది. కాబట్టి బీమా రంగంలో ఎఫ్‌డిఐలను పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం లాంటి నిర్ణయాలన్నీ భారతదేశంలోని ప్రజల విలువైన పొదుపును విదేశీ శక్తుల చేతికి అప్పగించడమే అవుతుంది. ఇక్కడ మరో ప్రమాదకరమేంటంటే ఎల్‌ఐసిలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడుల్ని ఉపసంహరించడమంటే అది ప్రైవేటీకరణ దిశగా వేస్తున్న తొలి అడుగే.

ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికే అనే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు విజయవంతంగా ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న ఎల్‌ఐసి ఒక పారదర్శక సంస్థ. ఇది ప్రతి నెలా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ కి తన పని తీరు నివేదికలను సమర్పించి పార్లమెంట్ పరిశీలనకు తన జమ, ఖర్చులు, ఎకౌంట్ పుస్తకాలను పెడుతుంది. మరి ఇంత పారదర్శకంగా ఈ సంస్థ పని చేస్తున్నప్పుడు ఇంకేం పారదర్శకత కావాలి? భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు వరకు నిధులను పెట్టుబడులుగా పెట్టగల ఎల్‌ఐసి సంస్థకు నిధుల కోసం మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేదు. ఎల్‌ఐసిలో వాటాలను అమ్మే అవసరం లేకుండానే, ఆ లక్ష్యాన్ని మించి మరీ నిధులు సమకూరే అవకాశం ఉంది. ఐఆర్‌డిఎఐ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సాల్వెన్సీ మార్జిన్ నిధులు, ఎల్‌ఐసి వద్ద సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉన్నాయి.

కాబట్టి ఒక్క శాతం వాటా కూడా అమ్మాల్సిన అవసరమే లేదు. పాలసీదారులకు భారంగా మారిన 18 శాతం జిఎస్‌టిని వెంటనే తొలగించాలి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి ప్రకారం పిఎఫ్, పాలసీలు, ఇంటి రుణంపై వాయిదాలు, పిల్లల చదువులకయ్యే ఖర్చులు మొత్తం అన్నీ కలిపి ఉన్న ఒకటిన్నర లక్షల రూపాయల పరిమితి గుదిబండలా మారుతోంది. కాబట్టి బీమా పాలసీల కోసం ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేసి, దాని పరిమితిని కనీసం పది లక్షల రూపాయలకు పెంచాలి. దీనివల్ల ప్రజల్లో పొదుపు అలవాటు పెరిగి, ప్రభుత్వాలకు అవసరమయ్యే దీర్ఘకాలిక నిధులు సైతం తేలికగా సమకూరతాయి. అలాగే నిధుల సమీకరణను ఎల్‌ఐసి ఐపిఒ ద్వారా మాత్రమే కాకుండా, విభిన్న మార్గాల ద్వారా కూడా చేపట్టవచ్చు. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వానికి కావలసిందల్లా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై ఆసక్తి, వాటి ఆచరణలో చిత్తశుద్ధి మాత్రమే.

నాదెండ్ల శ్రీనివాస్- 9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News