Home తాజా వార్తలు సూపర్ రిచ్ సర్‌చార్జీ పెంపుపై దిగొచ్చిన ప్రభుత్వం

సూపర్ రిచ్ సర్‌చార్జీ పెంపుపై దిగొచ్చిన ప్రభుత్వం

Nirmala Sitharaman

 

ప్రభుత్వ బ్యాంకులకు రూ.70 వేల కోట్లు మంజూరు
చౌకగా మారనున్న గృహ, వాహన రుణాలు
సిఎస్‌ఆర్ ఉల్లంఘన నేరపూరిత చర్య కాదు
అక్టోబర్ నుంచి కేంద్రీకృత విధానంలో ఐటి నోటీసులు

ముంబై: ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు)లపై సర్‌చార్జీ పెంపు ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్వల్ప, దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులపై సర్‌చార్జ్‌ను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని అన్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. రూ.2 నుంచి 5 కోట్ల ఆదాయం కల్గిన ఎఫ్‌పిఐలపై సర్‌చార్జీని గతంలో 15 శాతం ఉండగా, 25 శాతానికి పెంచుతున్నట్టు అప్పట్లో బడ్జెట్ సందర్భంగా సీతారామన్ ప్రతిపాదించారు. దీంతో 40 శాతం మంది ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు ఈ పన్ను జాబితాలోకి వచ్చారు. దీంతో ఈ సూపర్ రిచ్ సర్‌చార్జ్‌పై ఆందోళన వ్యక్తం కావడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పెరగడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.

ఎట్టకేలకు దీనిపై ప్రభుత్వం దిగొచ్చి సర్‌చార్జీ పెంపును రద్దు చేసింది. అలాగే సిఎస్‌ఆర్(కార్పొరేట్ సమాజిక భాద్యత) ఉల్లంఘన నేరపూరిత చర్య కాదని, సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామని మంత్రి అన్నారు. ఇకపై రెపో రేటుకు అనుగుణంగానే వడ్డీ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2014 నుంచి సంస్కరణలను కొనసాగిస్తున్నామని, గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఇండియా వేగంగా వృద్ధి రేటు నమోదు చేస్తోందని అన్నారు.

మాంద్యం ప్రభావం ఉండదు
ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని విస్మరించి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై నిరంతరం కృషి చేస్తోందని సీతారామన్ అన్నారు. ప్రపంచంలో మాంద్యం వాతావరణం కమ్ముకుందని, అయితే భారత్‌లో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి మూలధన లాభ పన్నును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది బడ్జెట్లో సందర్భంగా సూపర్ రిచ్ సర్‌చార్జీ పెంచన్నామని చేసిన ప్రతిపాదన.

బ్యాంకులకు రూ.70 వేల కోట్లు
రుణాలకు ఊతరం అందించడం, ద్రవ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన నిధులు ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. తాజా నిర్ణయంతో రుణాలకు ప్రోత్సాహం అందివ్వడంతో పాటు ద్రవ్యకొరత సమస్య పరిష్కారమవుతుంది. తాజా నిధుల మంజూరుతో బ్యాంకులు 5లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలను పంపిణీ చేయగలవు. వినియోగదారులు రెపో రేటును తగ్గింపు ప్రయోజనాన్ని పొందటానికి బ్యాంకులు తమ ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గిస్తాయని ఆమె తెలిపారు. రెపో- అనుసంధాన ఉత్పత్తులను ప్రారంభించాలని బ్యాంకులు నిర్ణయించాయి. రుణాలు ముగిసిన 15 రోజుల్లోగా ప్రభుత్వ బ్యాంకులు ఈ పత్రాన్ని వినియోగదారులకు తిరిగి ఇస్తాయని సీతారామన్ చెప్పారు.

చౌక కానున్న గృహ రుణాలు
గృహ, వాహన రుణాలు, వినిమయ వస్తువులు మరింత చౌక కానున్నాయి. ఎంసిఎల్‌ఆర్(నిధుల ఆధారిత రుణ రేటు మార్జినల్ వ్యయం) తగ్గింపు ద్వారా ఆర్‌బిఐ రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులకు రుణగ్రస్తులకు బదిలీ చేస్తాయని ఆర్థికమంత్రి తెలిపారు. రెపో రేటు, బాహ్య బెంచ్‌మార్క్ అనుసంధాన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, దీంతో గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాలకు నెలసరి వాయిదాలు మరింత తగ్గుతాయని వెల్లడించారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అదనంగా రూ.20 వేల కోట్ల నిధులను ప్రకటిస్తున్నామని తెలిపారు.

కేంద్రీకృత విధానంలో ఐటి నోటీసులు
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్) ఉల్లంఘన ఇకపై నేరపూరిత చర్యగా పరిగణించరు. దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. పన్నుల విభాగానికి సంబంధించిన నోటీసులు, ఇతర ఉత్తర్వులు అక్టోబర్ 1 నుండి కేంద్రీకృత విధానం నుండి జారీ చేస్తారు. అనుమతి లేకుండా పన్ను సంబంధిత నోటీసులు జారీ చేయరు. కంప్యూటర్ సృష్టించిన ప్రత్యేక పత్ర గుర్తింపు సంఖ్య లేకుండా ఎటువంటి కమ్యూనికేషన్ చెల్లుబాటు కాదు. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. ఏ అధికారీ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని సీతారామన్ తెలిపారు.

ఆటో రంగానికి ఊరట
డీలాపడిన ఆటో రంగానికి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2020 మార్చి వరకు కొనుగోలు చేసిన బిఎస్4 వాహనాలు రిజిస్ట్రేషన్ మొత్తం వరకు పనిచేస్తాయి. ఇప్పటి నుండి మార్చి 2020 వరకు పొందిన వాహనాలపై అదనంగా 15 శాతం తరుగుదలని ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనంతో నడిచే వాహనాలు రెండూ రిజిస్ట్రేషన్ వరకు పనిచేస్తాయి.

సమావేశం ముఖ్యాంశాలు..

1.ప్రస్తుత అంచనా ప్రపంచ జిడిపి వృద్ధి సుమారు 3.2 శాతం, బహుశా ఇది దిగువకు సవరించవచ్చు.
2. అమెరికా, -చైనా వాణిజ్య యుద్ధం, కరెన్సీ విలువ తగ్గింపు ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో చాలా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
3. ప్రపంచ డిమాండ్ చాలా బలహీనంగా ఉందని చాలా సంస్థలు చెబుతున్నాయి.
4. అనేక దేశాలతో పోల్చితే భారతదేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
5.సంపద సృష్టికర్తలను గౌరవిస్తాం, ఆర్థిక సంవత్సరం(201920) బడ్జెట్‌కు స్ఫూర్తి వారే. వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి వివిధ రంగాలతో సంప్రదింపులు చేపట్టాం.
6. ప్రభుత్వ ప్రధాన ఎజెండా సంస్కరణలు, సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుంది.
7. ఎఫ్‌పిఐలపై పెంచిన సర్‌చార్జ్ పన్ను ఉపసంహరించుకున్నాం, ఇది బడ్జెట్‌కు ముందు ఉన్న స్థితిని పునరుద్ధరిస్తుంది.
8. పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు ముగింపు పలికేందుకు కేంద్రీకృత వ్యవస్థ నుండి అన్ని పన్ను నోటీసులు జారీ చేయాలని నిర్ణయించాం.
9. అన్ని పాత పన్ను నోటీసులు అక్టోబర్ 1 నాటికి నిర్ణయిస్తారు లేదా కేంద్రీకృత వ్యవస్థ ద్వారా మళ్లీ అప్‌లోడ్ చేస్తారు. అన్ని ఐటి నోటీసులు సమాధానం ఇచ్చిన 3 నెలల వ్యవధిలో మూసివేస్తారు.
10. మార్కెట్లో రూ .5 లక్షల కోట్ల లిక్విడిటీని విడుదల చేయడానికి ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలను ప్రభుత్వరంగ బ్యాంకులకు మంజూరు చేయనుంది.
11. ఆర్‌బిఐ రేటు తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. రెపో రేటు లేదా బాహ్య బెంచ్‌మార్క్- ఆధారిత రుణ ఉత్పత్తులను ప్రారంభించింది. దీంతో గృహ, వాహన రుణాలు చౌక కానున్నాయి.
12. ఎంఎస్‌ఎంఇలకు పెండింగ్‌లో ఉన్న అన్ని జిఎస్‌టి రీఫండ్స్ 30 రోజుల్లో చెల్లింపు, భవిష్యత్‌లో జిఎస్‌టి రీఫండ్ 60 రోజుల్లో చెల్లించాలి
13. ఎంఎస్‌ఎంఇలకు ఒకే నిర్వచనం త్వరలో ప్రకటిస్తాం.
14. క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ మార్కెట్లపై తదుపరి త్వరలో చర్యలు.
15. పాత వాటి స్థానంలో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
16. మార్చి 2020 వరకు కొనుగోలు చేసిన బిఎస్-ఐవి వాహనాలు మొత్తం రిజిస్ట్రేషన్ కాలానికి పనిచేస్తాయి.
17. ఇప్పటి నుండి మార్చి 2020 వరకు పొందిన వాహనాలపై అదనంగా 15 శాతం తరుగుదలని ప్రభుత్వం అనుమతిస్తుంది.
18. ఎలక్ట్రిక్ వెహికిల్‌లు, ఇంధనంతో నడిచే వాహనాలు రెండూ నమోదు చేస్తారు.
19. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రకటనలతో రానుంది.

Foreign Investors to Be Exempted from Super Rich Tax