Wednesday, April 24, 2024

యూట్యూబ్‌లో వీడియో వ్యవహారం.. మాజీ న్యాయమూర్తి కర్ణన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Former High Court Judge Karnan arrest

చెన్నై: హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌ను చెన్నైలో అరెస్టు చేశారు. పలువురు మాజీ, ప్రస్తుత మహిళా జడ్జిలపై ఆయన చేసిన వ్యాఖ్యల ఫలితంగా నెలరోజుల క్రితం ఆయనపై కేసునమోదు అయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ వేదికగా కర్ణన్ మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై లైంగిక పరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు వెలువడ్డాయి. అక్టోబర్ 27వ తేదీన చెన్నై పోలీస్ సైబర్ విభాగం వివాదాస్పద వ్యాఖ్యలకు పేరొందిన కర్ణన్‌పై మద్రాస్ హైకోర్టు లాయర్ ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. తరువాత దశలో పలువురు సీనియర్ న్యాయవాదులు కూడా కర్నన్‌కు వ్యతిరేకంగా ఓ లేఖ రాశారు. దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డేకు పంపించారు. కర్ణన్ వెలువరించినట్లుగా చెపుతున్న వ్యాఖ్యలతో కూడిన వీడియోలోని అంశాలను మద్రాసు హైకోర్టు న్యాయవాదులు చీఫ్ జస్టిస్‌కు పంపించడం చర్చనీయాంశం అయింది. వీటి ప్రాతిపదికన ఇప్పుడు ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు చెన్నై పోలీసులు బుధవారం తెలిపారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తులు, కోర్టుల సిబ్బంది కొందరు లైంగిక దాడులకు దిగుతున్నారని ఈ వీడియోలో కర్ణన్ పేర్కొన్నారు. కోర్టులలోని మహిళా సిబ్బంది, మహిళా జడ్జిలను లైంగికంగా రకరకాలుగా వేధించారని ఈ మాజీ న్యాయమూర్తి ఈ వీడియోలో తెలిపారు. పైగా ఫలానా ఫలానా వారు బాధితులయ్యారని కూడా ఇందులో ప్రస్తావించారు. సుప్రీంకోర్టును, జుడిషియరీని, న్యాయ ప్రక్రియను పూర్తిగా కించపరిచే విధంగా కర్ణన్ వ్యవహరించారని నిర్థారణ కావడంతో 2017 మే నెలలో సుప్రీంకోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల సర్వీసు మిగిలి ఉన్న దశలోనే ఆయనకు ఈ శిక్ష పడింది. న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన దశలో కర్ణన్‌పై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే, తన దళిత నేపథ్యం కారణంగానే పలు రకాలుగా తనను కేసులలో ఇరికించారని, ఇది న్యాయవ్యవస్థలో ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్యపు కేంద్రీకృతపు వ్యవస్థ చేదు ఫలం అని తరచూ కర్ణన్ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.

Former High Court Judge Karnan arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News