Home తాజా వార్తలు జేమ్స్‌ బాండ్ హీరో సీన్ కానరీ ఇకలేరు

జేమ్స్‌ బాండ్ హీరో సీన్ కానరీ ఇకలేరు

Former james bond actor sean connery passes away

 

007గా చిత్రసీన్ అంతా కానరీదే
ప్రపంచవ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు

లండన్ : కల్పనితకు వాస్తవిక రూపాన్ని ప్రసాదించే వారు అరుదుగా ఉంటారు. ఓ ఫిక్షన్‌లోని అసాధారణ లక్షణాల పాత్రకు జీవం పోసే వారు తక్కువగా ఉంటారు. జేమ్స్‌బాండ్ 007 ఈ కేటగిరికి చెందిన వారు. ప్రఖ్యాత రచయిత ఐయాన్ ఫ్లెమింగ్ 1953లో ఓ అత్యద్భుత రచనా సృష్టికి దిగారు. అదే ప్రత్యర్థుల శక్తియుక్తులను పసికట్టి వారిని ఆటకట్టించే అపూర్వ స్థాయి కల్పనిక వీరుడు బ్రిటిష్ సీక్రెట్ సర్వీసు ఏజెంట్ పాత్రను నిజంగా వీడే వాడు అనే విధంగా సీన్ కానరీ రక్తి కట్టించారు. ఫ్లెమింగ్ రాసిన 12 నవలలో ఒకదానితో ఒకటి పోటీపడుతూ సాగిన రసవత్తర హీరోచిత కథలలో సీన్ కానరీ తమ నటనతో సినిమాలలో జీవం పోశాడు.

బ్రిటన్ ఏజెంటుగా ఉంటూ సాగించిన విన్యాసాలు, మరణపు టంచుల వరకూ వెళ్లినా ఎటువంటి త్రోటుపాటులేకుండా చూసే ప్రేక్షకులకు గగుర్పాటు కల్పించిన దిట్టగా సీన్ కానరీ నిలిచారు. నవలా నాయకులు అతి కొద్ది మందిలో సీన్ మేటిగా నిలిచారు. ముందు ఏదో డేంజర్ పొంచి ఉందని తేలినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం తనలో ఏముందో ఇతరులకు తెలియని వైఖరిని తెరపైపండించి శభాష్ జేమ్స్‌బాండ్ అన్పించుకున్న ఘనత కానరీదే. 1964లో ఫ్లెమింగ్ మరణం తరువాత మరో ఎనమిది మంది రచయితలు తమ జేమ్స్‌బాండ్ ఇతివృత్తపు నవలలను సినిమాలుగా తీసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో సీన్ కానరీ నాయకుడిగానే వీటిలో అత్యధిక సినిమాలు వచ్చాయి. ప్రపంచాన్ని సినిమాపరంగా జయించి అజేయంగా నిలిచాయి.

కోడ్ నెంబర్ 007 అనగానే పొడగరి, చేతుల్లో రివాల్వర్‌తో ఉండే కానరీనే అందరికీ గుర్తుకు వస్తుంటారు. కానరీ జేమ్స్‌బాండ్ సినిమాలను ఆధారంగా చేసుకుని తరువాత టీవీ, కామిక్ వీడియో గేమ్స్ కూడా వచ్చిపడ్డాయి. పిల్లల్లో ఈ విధంగా ఈ జేమ్స్‌బాండ్ యాక్షన్ నాటుకుపోయింది.1962లో సీన్‌కానరీ జేమ్స్‌బాండ్‌గా వచ్చిన డాక్టర్ నోతో ఇటువంటి సినిమాల శకం ఆరంభం అయింది. అప్పటివరకూ హాలీవుడ్ సినిమాలకు యుద్ధాలు, మానవ భావోద్వేగాలు లేదా సైన్స్ సంబంధిత అంశాలతో వచ్చిన సినిమాలను తలదన్నుతూ విశేషరీతిలో ఈ జేమ్స్‌బాండ్ అధ్యాయం వచ్చిచేరింది. కానరీ తరువాత పలువురు తమదైన రీతిలో జేమ్స్‌బాండ్ 007గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

జేమ్స్‌బాండ్ ఓ వ్యక్తి పేరు
జేమ్స్‌బాండ్ అనే పేరు అమెరికాకు చెందిన అమెరికాకు చెందిన పక్షుల అధ్యయనకర్త , ఎగుమతిదారుడు జేమ్స్‌బాండ్ పేరు నుంచి వచ్చింది. ఈ కరిబియన్ పక్షుల ఎగుమతిదారుడు వెస్టిండిస్ బర్డ్‌పై పుస్తకం కూడారాశారు. ఇదే దశలో పక్షుల పట్ల ఆసక్తి కనబర్చే ఐయాన్ ఫ్లెమింగ్ ఈ జేమ్స్‌బాండ్ జీవనశైలిని పరిగణనలోకి తీసుకుని ఆయన పేరును తన నవలలోని ప్రధాన పాత్రకు తగిలించారు. ఈ విధంగా జేమ్స్‌బాండ్ పేరు దూసుకుపోయింది.

ఆస్కార్ విజేత సెక్సియస్ట్ మ్యాన్
స్కాటిష్‌నటుడు అయిన సర్ థామస్ సీన్ కానరీ నిర్మాతగా కూడా పేరొందారు. పలు అవార్డులను ప్రత్యేకించి ఆస్కార్ అవార్డును కూడా పొందారు. ఈ ఏడాది ఆగస్టులోనే కరోనా గడగడల మధ్య ఈ జేమ్స్‌బాండ్ తమ 90వ పుట్టిన రోజు నిర్వహించుకున్నారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్‌బాల్, యు ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్ ఆర్ ఫరెవర్ వంటి జేమ్స్‌బాండ్ చిత్రాలలో ఆయన అందరినీ అలరించారు. తరువాతి క్రమంలో జేమ్స్‌బాండ్‌గా అంతగా ఆకట్టుకున్న నటుడు రోగర్ మూర్ . ది అన్‌టచ్‌బుల్స్ చిత్రంలో సీన్ కానరీ నటనకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ వచ్చింది. ఫ్రెంచ్ టఫ్ పోలీసుగా నటించి మెప్పు పొందారు. 1989లో ఆయనకు పీపుల్ మ్యాగజైన్ సెక్సియస్ట్ మ్యాన్ ఎలైవ్‌గా తరువాత 1999లో సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్‌ది సెంచరీగా కీర్తించింది. 2006లె అమెరికా ఫిల్మ్ ఇనిస్టూట్ నుంచి లైవ్ అచివ్‌మెంట్ పురస్కారం పొందారు. తరువాత కానరీ సినిమాలకు గుడ్‌బై కొట్టి విశ్రాంతి పొందుతూ ఇప్పుడు తరలిపొయ్యారు. 2012లో సర్ బిల్లీ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు.

భాషలు యాసల తేడాల్లేని మాస్
దేశం భాష, ప్రాంతం యాస తేడాల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్న జేమ్స్‌బాండ్ సర్ సీన్ కానరీ కన్నుమూశారు. ది బహమాస్‌లోని నసావూలో ఆయన మృతి చెందారు. పరమ సస్పెన్స్ లోగుట్టుల ఛేదనలో వీరోచితంగా దూసుకుపోయే గండరగండడు జేమ్స్‌బాండ్ అంటే ఇతడే అన్పించుకున్న సీన్ కానరీ తమ 90వ ఏట నివాసంలోనే నిద్రలోనే తన జీవిత పాత్రను చాలించాడు. జేమ్స్‌బాండ్‌కు చెందిన ట్విట్టర్ నిర్వాహకులు శనివారం తెలియచేశారు. హాలీవుడ్ చిత్రప్రముఖులు పలువురు సీన్ కానరీ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. జేమ్స్‌బాండ్ సినిమాల నిర్మాతలు మైఖెల్ జి విల్సన్, బార్బారా బ్రోకోలి ఇతరులు సంతాపం ప్రకటించారు. తండ్రి కొద్ది కాలం స్వల్ప అస్వస్థతకు గురి అయినా తిరిగి కోలుకున్నారని, బహమాస్‌లో ఆయన నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారని కుమారుడు జెసన్ కానరీ బిబిసికి తెలిపారు. ఆయన భార్య డెయినీ క్లియింటో 1973లో చనిపొయ్యారు. కుమారుడు జేసన్ కానరీ.

జీవిత విశేషాలు.
జననం 1930 ఆగస్టు 25. స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్న ఫౌంటెన్ బ్రిడ్జి ప్రాంతంలో జన్మించారు. సీన్ కానరీకి సైన్యంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మూడు సంవత్సరాలు ఆయన 1946 నుంచి 49వరకూ బ్రిటన్ రాయల్ నెవీలో నావికుడిగా వ్యవహరించారు.

Former james bond actor sean connery passes away