Home తాజా వార్తలు కాంగ్రెస్ ఫైట్

కాంగ్రెస్ ఫైట్

kong

సీట్ల కోసం ముందస్తు కుమ్ములాటలు

అజహరుద్దీన్ ప్రకటనపై మాజీ ఎంపి అంజన్ ఆగ్రహం
సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే కాటేస్తా : అజహర్‌కు హెచ్చరిక
సముదాయించేందుకు ఉత్తమ్ ప్రయత్నాలు విఫలం
భువనగిరిలో ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గీయుల బాహాబాహీ
ఎఐసిసి నేత ముందే తమ నేతలకే టికెట్లు ఇవ్వాలని వాగ్వాదం
నిజామాబాద్ ఉమ్మడిజిల్లా విస్తృత స్థాయి సమావేశం రసాభాస

మన తెలంగాణ / హైదరాబాద్ / నిజామాబాద్ / భువనగిరి : కాంగ్రెస్‌పార్టీ వర్గ సంస్కృ తి మరోసారి బయటపడింది. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే మూడు ప్రాంతాల్లో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా ఎఐసిసి కార్యదర్శుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో అధిష్టానం ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తానన్న అజహరుద్దీన్ ప్రకటనపై గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్ నగర కార్యకర్తల సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. ఆయనకు దమ్ముంటే హైదరాబాద్ నుండి పోటీ చేయాలని సవాలు విసిరారు. భువనగిరిలో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. నియోజకవర్గం పరిధిలోని ఒక్కటి మినహా ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆశావాహుల మద్దతుదారులు ఒకరినొకరు దూషించుకున్నారు. నిజామాబాద్ పార్లమెం టు స్థానం కాంగ్రెస్ సమావేశంలో సైతం అవే దృశ్యాలు సాక్షాత్కరించాయి. వివిధ నియోకజవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతల అనుచరులు ఏకంగా వేదికపైకి ఎక్కి గలాభాకు దిగారు.
హైదరాబాద్‌లో అజహర్‌పై ఫైర్
గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరాభవన్‌లో సోమవారం హైదరాబాద్ నగర కాంగ్రెస్ విస్తృ త స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు, టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నా రు. సమావేశంలో నగర అధ్యక్షులు, సికింద్రాబాద్ మాజీ ఎంపి అంజన్ ప్రసంగాన్ని ప్రారంభిస్తుండగానే ఆయన అనుచరులు “అంజన్ కుమార్ జిందాబాద్‌” “ సికిందరాబాద్ టిక్కెట్‌పై ఉత్తమ్ మాట్లాడాలి” అంటూ స్లోగన్స్ ఇచ్చారు. వారిని వారించేందుకు ఉత్తమ్, సర్వే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో విహెచ్ అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుండి అజర్ ఎంపిగా గెలిచాడని, ఆయన క్షేత్రం యుపినే కాని సికిందరాబాద్ కాదన్నారు. సికిందరాబాద్ నుండి పోటీ చేస్తే కాటేస్తానని హెచ్చరించారు. కొందరు కావాలనే ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే తాను రాహుల్‌గాంధీ సోనియాగాంధీని కలిసి దీని వెనుక ఉన్నవాళ్ళ జాతకాలు బైటపెడతానన్నారు. సర్వే కూడా అంజన్‌కుమార్‌కు మద్దతు పలికారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఏదైనా ఉంటే ఎఐసిసి కార్యదర్శి బోసు రాజుకు చెప్పుకోవాలని, వారు రాహుల్‌గాంధీకి తెలియజేస్తారని ముక్తసరిగా చెప్పారు. తాము టిక్కెట్ ఇచ్చేందుకు రాలేదని, ఇది అభ్యర్థుల ఎంపిక సమావేశం కాదని బోసు రాజు అన్నారు.
నిజామబాద్‌లో రసాభాస : నిజామాబాద్‌లోని భూమారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ముందే పార్టీ శ్రేణులు పరస్పరదాడులకు సిద్ధపడ్డారు. ఒక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వైపు జుక్కల్ నియోజవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌ఎలు గంగారామ్, అరుణతార వర్గాలు, మరోవైపు నిజామబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌సి అరికెల నర్సారెడ్డి, స్థానిక మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేశ్ రెడ్డి వర్గాలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఈ నాయకుల అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. జుక్కల్, డిచ్‌పల్లి నియోజక వర్గ కార్యకర్తలు తమ నేతలకు ప్రాధాన్యత దక్కలేదని నేరుగా సభ వేదిక వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. వారిని సముదాయించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ఒకరినొకరు దూషించుకున్నారు. చివరికి మాజీ ఎంపి మధుయాష్కి వారిని సముదాయించేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ అర్బన్‌లో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలంతా వేదికపై క్యూకట్టారు. ఎల్లారెడ్డికి చెందిన మూడు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. బాన్సువాడ నియోజక వర్గంలోను ఇద్దరు నేతల మధ్య నెలకొన్న అదిపత్య పోరు పార్టీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. చివరికి భోజనాల వద్ద సైతం కార్యకర్తలు గలాట సృష్టించారు.
టికెట్ల కోసం హోరెత్తిన కార్యకర్తల వర్గ నినాదాలు
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలు ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గంగా విడిపోయి నినాదాలతో హోరెత్తించాచరు. జయలక్ష్మిగార్డెన్స్‌లో జరిగిన సమావేశానికి ఎఐసిసి కార్యదర్శి సలీమ్ అహ్మద్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, ఎంఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏలు హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఒకవైపు, ఉత్తమ్ వర్గీయులైన భిక్షమ య్యగౌడ్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులు మరోవైపు తమ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్ వర్గీయుడు ప్రసన్నరాజ్ అనుచరులు తమ నేతలకే టిక్కెట్ ఇవ్వాలంటూ బాహాబాహీకి దిగారు.ఒకదశలో లింగయ్యను సైతంనెట్టేశారు. మునుగోడు నుండి తమకంటే తమకు అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. కార్య కర్తలు అల్లరి చేయవద్దని , తమ సమస్యలు ఏవైనానిదానంగా చెప్పుకోవాలని ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కార్యకర్తలు పట్టించుకోకుండా నినాదాలు చేస్తుండడంతో ఆయన సమావేశం నుండి నిష్క్రమించాడు.