Home కరీంనగర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. నలుగురు అరెస్ట్

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. నలుగురు అరెస్ట్

Cannabis

కరీంనగర్ : గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు యువకులను శనివారం నగరంలోని సర్కస్‌గ్రౌండ్ వద్ద కరీంనగర్ టూటౌన్ పోలీసులతో కలిసి కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి రూ.15 లక్షల విలువైన 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డిసిపి (లాఅండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్ ఈ ఘటన వివరాలను మీడియాకు తెలిపారు. కొమురంభీం జిల్లా సిర్పూర్ మండల పరిధిలోని శీలపల్లికి చెందిన జంగటి జనార్ధన్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహార్‌నగర్‌కు చెందిన పుసాల హరికృష్ణ, ఇదే జిల్లా ధర్మారం మండలానికి చెందిన రేగుల శ్రీధర్, వంగర నవీన్‌లు కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి విక్రయాలను మొదలుపెట్టారు.

అయితే గంజాయి పండించే జనార్ధన్‌తో కలిసి మిగితా ముగ్గురు కొమురంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన గంజాయిని కరీంనగర్, వరంగల్, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు విక్రయించి డబ్బు సంపాదించేవారు. వీరు ఎక్కువ యువత ఉండే ప్రాంతాలను ఎంచుకుని గంజాయిని విక్రయించేవారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసి, వారికి గంజాయిని సరఫరా చేసేవారు. ఈ క్రమంలో శనివారం 30 కిలోల గంజాయినీ తీసుకొస్తుండగా సర్కస్‌గ్రౌండ్ వద్ద కరీంనగర్ టూటౌన్ బ్లూకోల్ట్ సిబ్బంది, కరీంనగర్ టూటౌన్ సిఐ సి.హెచ్.దేవారెడ్డి పట్టుకున్నారు.

గంజాయి సరఫరా చేసేవారిని పట్టుకోవడమే కాకుండా గంజాయిని పండిస్తున్న వారికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టడం జరిగిందని డిసిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ సిఐలు రత్నపురం ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, కరీంనగర్ టూటౌన్ సిఐ సి.హెచ్.దేవారెడ్డి, కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఎస్.ఐ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Four arrested for smuggling 30kg Cannabis