Saturday, April 20, 2024

పూర్తికాల అధిపతులు లేని 4 కేంద్ర పోలీసు సంస్థలు

- Advertisement -
- Advertisement -

Four central police organisations without regular chiefs

 

న్యూఢిల్లీ: పూర్తి కాల అధిపతులను ప్రభుత్వం నియమించకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాలుగు పోలీసు సంస్థలు గత కొంత కాలంగా రెగ్యులర్ అధిపతులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఈ కోవలోకే తాజాగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్‌ఎఫ్) కూడా చేరిపోయింది. సిఐఎస్‌ఎఫ్ ప్రస్తుత అధిపతి రాజేష్ రంజన్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఎస్‌ఎస్‌బి డైరెక్టర్ జనరల్ రాజేష్ చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈనెల 26న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అదేవిధంగా ఉగ్రవాద నిరోధక విభాగం నేషనల్ సక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి), బ్యూరో ఆఫ్ పోలీసు రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బిపిఆర్‌డి)కి కూడా పూర్తి కాల అధిపతుల స్థానంలో వివిధ ఐపిఎస్ అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఎకె సింగ్ పదవీ విరమణ చేసిన తర్వాత ఎస్‌ఎస్‌జి అధిపతిగా ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు అధిపతి ఎస్‌ఎస్ దేశ్వాల్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా..హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా డిజి అభయ్ నియమాకంతో ఖాళీ అయిన ఎన్‌సిబి అధిపతి స్థానంలో గత ఏడాది జులై నుంచి బిఎస్‌ఎఫ్ అధిపతి రాకేష్ ఆస్థానా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అభయ్ ప్రస్తుతం ఒడిషా పోలీసు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత)గా పనిచేస్తున్న విఎస్‌కె కౌముది ప్రస్తుతం బిపిఆర్‌డి అధిపతిగా ఈ ఏడాది ఆగస్టు నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ్యులుగా గల క్యాబినెట్ నియామకాల కమిటీ(ఎసిసి) త్వరలోనే సమావేశమై ఈ పదవులలో పూర్తికాల అధిపతులను నియమించే ప్రక్రియను పూర్తి చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News