Home తాజా వార్తలు ‘ఫార్చూన్’లో నలుగురు భారతీయులు

‘ఫార్చూన్’లో నలుగురు భారతీయులు

bs

 జాబితాలో నాలుగో స్థానంలో జనరల్‌మోటార్స్ సిఎఫ్‌ఒ దివ్య సూర్యదేవర 

 14, 24, 32 స్థానాల్లో మరో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు 

 తొలి స్థానంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అధినేతలు

న్యూయార్క్: ఫార్చూన్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘40 అండర్ 40’ జాబితాలో నలుగురు భారత సంతితికి చెందిన వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. నలబై ఏళ్ల లోపు ప్రభావంత, స్ఫూర్తిని కల్గించే 40 మంది యువ పారిశ్రామివేత్తల జాబితాలో వీరు ఎంపికయ్యారు. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు, ఓ పురుషుడికి చోటు లభించింది. 34 ఏళ్ల వయసు కల్గిన ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ కెవిన్ సిస్ట్రోమ్, పేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌లు ఇద్దరూ జాబితాలో తొలి స్థానానికి పోటీపడ్డారు. వీరిద్దరు మొదటి స్థానాన్ని ఉమ్మడిగా పంచుకున్నారు. అమెరికాలో దిగ్గజ వాహనాల తయారీ సంస్థ జనరల్ మోటర్స్ సిఎఫ్‌ఒగా పనిచేస్తున్న దివ్య సూర్యదేవర ఈ జాబితాలో నాలుగో స్థానం పొందారు. ఆ తర్వాత వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘విమియో’ సిఇఒ అంజలి సూద్ 14వ స్థానం, ‘రాబిన్‌హుడ్’ కంపెనీ కొసిఇఒ బైజు భట్‌కు 24 వ స్థానం, ‘ఫీమేల్ ఫండర్స్ ఫండ్’ వ్యవస్థాపకురాలు అను దుగ్గల్ 32వ స్థానంలో నిలిచారు. కాగా 39ఏళ్ల దివ్య సూర్యదేవర జిఎం మోటర్స్ సిఎఫ్‌ఒగా ఎన్నికై చరిత్ర సృష్టించారని ఫార్చ్యూన్ తెలిపింది.
‘లెడ్జర్ 40 అండర్ 40’లోనూ నలుగురు
ఈ జాబితాకు అనుబంధంగా మొదటి సారి ఫార్చ్యూన్ ‘లెడ్జర్ 40 అండర్ 40’ అనే మరో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితా టెక్నాలజీతో వ్యాపారాన్ని జత చేసి అద్భుతాలు సాధిస్తోన్న 40 ఏళ్లలోపు వ్యాపారులను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో కూడా నలుగురు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో రియల్ టైమ్ కరెన్సీ ఎక్సేంజ్ అండ్ రెమిటెన్స్ నెట్‌వర్క్ రిపిల్ సీనియర్ ఉపాధ్యక్షుడు అశీష్ బిర్లా(39), డిజిటల్ కరెన్సీ వాలెట్ అండ్ కాయిన్‌బేస్ సిటిఒ(ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్) బాలాజీ శ్రీనివాసన్, డిజిటల్ కరెన్సీ సంస్థ ఎంఐటి డైరెక్టర్ నేహా నారుల, అలాగే కాయిన్‌బేస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ టినా భట్నాగర్‌లు ఉన్నారు.