Home రంగారెడ్డి ఎవరి దారి వారిదే

ఎవరి దారి వారిదే

Four Leaders Try for Party Ticket In Rangareddy District

మన తెలంగాణ/మొయినాబాద్ :
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న మొయినాబాద్ మండలంలో నేతలు ఎవరి దారి వారిదే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. మండలంలో బడా బడా నేతలున్న పార్టీ పరిస్థీతి మాత్రం రోజు రోజుకు కుదేలవుతుంది. మొయినాబాద్ మండలం నుంచి నలుగురు నేతలు తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని పార్టీ పెద్దల చుట్టు తిరుగుతున్నారు తప్ప మండలంలో పార్టీ ముక్కలు చెక్కలు అవుతున్న కాయకల్ప చికిత్స చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. మొయినాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉండటంతో పాటు గ్రామ స్థాయిలో పటిష్టమైన కార్యకర్తల యంత్రాంగం ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలు పట్టించుకోకపోవడం…మండల నేతల మద్య సమన్వయ లోపం పుణ్యమా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కాలే యాదయ్య విజయం సాధించడంలో మొయినాబాద్ మండలం కీలకంగా వ్యవహరించింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలలో సైతం మండలంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి జడ్పీటిసి, ఎంపిపిలను కైవసం చేసుకోవడంతో పాటు మెజారీటి సర్పంచ్‌లను సైతం తమ ఖాతాలో వేసుకుంది. సురంగల్ సహకార సంఘ చైర్మెన్ పదవిని సైతం నాటకీయ పరిణామాల మద్య కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు మొయినాబాద్ మండలంలో దారుణంగా తయారయింది. కాంగ్రెస్ తరపున విజయం సాధించిన కాలే యాదయ్య హస్తంను వదిలి కారు పార్టీలో చేరిపోవడం అనంతరం ఎంపిపి, జడ్పీటిసిలు సైతం అధికార పార్టీలోకి వలసపోయారు. పిఎసియస్ చైర్మెన్‌పై ఆవిశ్వాసం పెట్టి టిఆర్‌యస్ నేతలు కైవసం చేసుకున్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపిటిసి బలం ఉండటంతో టిఆర్‌యస్‌లో చేరిన యంపిపిపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి రోజుల తరబడి ప్రణాళికలు రచించడం తప్ప ఆచరణలో అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను గమనించిన టిఆర్‌యస్ మండల నేతలు ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దమంగళారం ఎంపిటిసి సభ్యుడితో పాటు ఆదే గ్రామానికి చెందిన టిడిపి ఎంపిటిసి సభ్యుడిని మంత్రి సమక్షంలో టిఆర్‌యస్‌లో చేర్చుకుని సత్తాచాటారు.
చేతులారా నాశనం…
మొయినాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీని అధికార పక్షం దెబ్బతీసిందని చెప్పడం కన్న స్వంత పార్టీ నేతలే కుకటి వేళ్లతో సహ పెకిలించడానికి కుట్రపన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు టిఆర్‌యస్ పార్టీ వారికి పూర్తి సహయ సహకారాలు అందచేస్తున్నట్లు విమర్శలున్నాయి. ప్రజా ప్రతినిధులు వలస పోతున్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పక్క పార్టీలలో చేరుతున్న వాటిని నిలువరించి క్యాడర్‌లో విశ్వాసం కల్పించడంలో నియోజకవర్గ, మండల నాయకత్వం పూర్తిగా విఫలమవుతుంది. మండల కాంగ్రెస్ ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయింది. మండల పార్టీ అధ్యక్షుడితో పాటు కొంత మంది నేతలు ఒక వర్గంగా మాజీ యంపిపితో పాటు మరికొంత మంది సీనియర్‌లు మరో వర్గంగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి, కార్తీక్ రెడ్డిలు మండలంకు వచ్చిన సమయంలో ఐక్యత కనిపించిన వారు తిరిగి వెళ్లిన మరు క్షణం నుంచి ఎవరి దారి వారిదే తప్ప ఐక్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన పాపాన పోవడం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. చెవెళ్ల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో ఎవరు బరిలోకి దిగుతారు అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం సైతం క్యాడర్‌ను డీలాపడేలా చేస్తుంది. అధికార పార్టీ తరపున ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.యస్.రత్నంలు మండలంతో చక్కర్లు కొడుతుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అభ్యర్ది ఎవరు వస్తారో..ఎవరి కోసం పనిచేయాలో తెలియని పరిస్థీతులు ఉండగా కొంత మంది నేతలు మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటు ఎమ్మెల్యే కాలే యాదయ్యకు, మరికొంత మంది రత్నంకు పనిచేస్తామని హమీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంకు కాయకల్ప చికిత్స చేసి ముందుకు తీసుకుపోకపోతే మరికొన్ని రోజులలో మండలంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినడం ఖాయం అన్న భావన స్వంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతుంది.