Home ఆఫ్ బీట్ దేశానికే ఆదర్శం నాలుగేళ్ల తెలంగాణ ప్రస్థానం

దేశానికే ఆదర్శం నాలుగేళ్ల తెలంగాణ ప్రస్థానం

నెంబర్ వన్… వన్ అంటే ఓన్లీ… ఇది ఏ కార్పొరేట్ కళాశాల నినాదమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఐదున్నర దశాబ్ధాలకు పైగా సాగిన సమైక్య రాష్ట్ర పాలనలో కనిపించని ప్రగతి, సంక్షేమ, సకలజన హితాన్ని నాలుగేళ్లలోనే సాధించి నవ తెలంగాణను హరిత తెలంగాణ, బంగారు తెలంగాణగా మారుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుది.  వ్యవసాయం, నీటిపారుదల, ఐటి, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక, సామాజిక ఇలా అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా మార్చిన వన్ అండ్ ఓన్లీ సిఎం చంద్రశేఖర్‌రావు అనడంలో అతిశయోక్తి కాదు. ఆయన పాలనలో నాలుగేళ్ల ప్రస్థానంలో తెలంగాణ బహుముఖ అభివృద్ధికి అద్ధం పట్టే వ్యాసాల సమాహారమే ఈ సంచిక.

KCR

సమైక్య రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయానికి, అవమానానికి గురైన తెలంగాణ ప్రజలు దశాబ్దకాలానికి పైగా ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని 2014లో సాధించుకున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా సాగిన ఈ ఉద్యమం ద్వారా రాష్ట్రం ఏర్పడడంతో ఇకపైన ఆత్మగౌరవంతో బతకొచ్చని, ఇంతకాలం జరిగిన అన్యాయం స్థానే న్యాయమైన వాటాతో బతుకులు బాగుపడతాయని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉంది. ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావడం ద్వారా వచ్చిన రాష్ట్రంలో అంతే స్థాయిలో ఆకాంక్షలను నెరవేర్చడం ఒక బాధ్యతగా ముందుకొచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం, పవర్ హాలిడే, విద్యుత్ కోతలు, నదీ జలాల లభ్యతకు అనుగుణంగా వినియోగం లేకపోవడం, కుదేలైన వ్యవసాయ రంగం, రైతుల ఆత్మహత్యలు, మొత్తం పది జిల్లాల్లో తొమ్మిది వెనకబడినవిగానే ఉండిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు, నిరుద్యోగుల్లో నిరుత్సాహం… ఇలా ఎన్నో సమస్యలు కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికాయి. ఒకవైపు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఇంతకాలం అనేక రకాలుగా వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి ఒక కొత్త రూపాన్ని ఇవ్వడం కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్‌కు ఒక సవాలుగానే నిలిచింది. ఏ డిమాండ్‌తోనైతే పద్నాలుగేళ్ళ పాటు పార్టీని నడిపి ‘తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో’, ‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతాను’… లాంటి ఎన్నో శపథాలు చేశారో దానికి తగిన కార్యాచరణతో ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించి లక్ష్యాన్ని సాధించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు అవసరమో వివిధ రంగాల్లో సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని వివరంగా ప్రజల ముందు, ఢిల్లీ పెద్దలముందు ఉంచిన కెసిఆర్ కొత్త రాష్ట్రంలో ఆ అన్యాయాన్ని చక్కదిద్దడంపై తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సమస్యలన్నింటిలో ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించడంపై ఒక నిర్దిష్ట ఆలోచనకు వచ్చారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలు అనుభవించిన బాధలు ఇంకెంతమాత్రం స్వరాష్ట్రంలో ఉండరాదన్న ఏకైక లక్షంతో రాష్ట్ర పునర్ నిర్మాణంపై దృష్టి సారించారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, వెనకబాటుతనం, ఆదాయ వనరులు..

ఇలా ఒక్కో రంగంపై ఉద్యమకాలంలోనే లోతైన అవగాహన ఉండడంతో పరిష్కారమే తక్షణ కార్యాచరణగా ప్రారంభమైంది. ఆరు నెలల వ్యవధిలోనే విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రం గట్టెక్కింది. తలాపున గోదారి ఉన్నా భూములన్నీ ఎడారిగా ఉండరాదన్న ఉద్దేశంతో ఏటా పాతిక వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సాగునీటిపారుదల రంగంలో సమూలంగా ప్రక్షాళన మొదలైంది.

నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పద్నాలుగేళ్ళ ముందే ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలు ఏర్పడినా ఈ నాలుగేళ్ళలో జాతీయ, అంతర్జాతీ స్థాయిలో తెలంగాణకు వచ్చిన గుర్తింపు ఆ మూడు రాష్ట్రాలకూ రాలేదు. రాష్ట్రం ఎందుకు అవసరమో తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించాలో స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయాణానికి ఉన్న అవరోధాలు, ఆటంకాలను అధిగమిస్తూ గమ్యాన్ని చేరడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తూ నాలుగేళ్ళలోనే ఎన్నో అంశాల్లో యావత్తు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర స్వంత ఆర్థిక వనరుల సమీకరణలో మూడేళ్ళలోనే 21% వృద్ధి సాధించింది. కాగ్ సైతం తన నివేదికలో ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని 2017-18 నివేదికలో వ్యాఖ్యానించింది.

పన్నుల రూపేణా కేంద్రానికి అందిస్తున్న ఆదాయంలో సైతం 21% వృద్ధిని నమోదుచేసింది. సమైక్య పాలనలో 2004 నుంచి 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 1.29 లక్షల కోట్లను కాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ఖర్చుచేస్తే తెలంగాణ ఈ నాలుగేళ్ళలోనే రూ. 1.16 లక్షల కోట్లను ఖర్చుచేసింది. తగినంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సివిల్ అధికారులు లేకపోయినప్పటికీ పరిపాలనాపరమైన సంస్కరణలతో దేశమే గర్వించే ప్రగతిని సాధించగలిగింది. సమైక్య పాలనలో జరిగిన ప్రాంతీయ అసమానతలను దృష్టిలో పెట్టుకుని స్వరాష్ట్రంలో ఇది ఎంతమాత్రం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జోన్ల వ్యవస్థను ఏర్పాటుచేయడం, ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటి, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం తదితరాలపై దృష్టి పెట్టింది. సులభ వాణిజ్య విధానంలో సైతం ఊహకు అందని తీరులో ఏదాడి వ్యవధిలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగడం మాత్రమే కాక వరుసగా రెండో ఏడాది అదే స్థానంలో నిలిచింది.

ఇక రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, టిఎస్ ఐపాస్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు ఇలా దాదాపు 65 పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా కనిపించని తీరులో అమలవుతున్నాయి. ఈ నాలుగేళ్ళ ప్రయాణంలో సుమారు 425 అభివృద్ది, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. సామాన్యులకు భారంగా ఉన్న విద్య, వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్‌కెజి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించడం, త్వరలో ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగానే అద్దాలను ఇవ్వడం, ఆపరేషన్లు చేయించడంతో పాటు త్వరలో ‘హెల్త్ ప్రొఫైల్’ పేరుతో అందరికీ ఉచిత వైద్య సేవలను అందించే ప్రణాళికను రూపొందించింది. నాణ్యమైన విద్య అందుతుండడంతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థులే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. సుస్థిర ప్రభుత్వం, సమర్ధవంతమైన నాయకత్వంతో ఈ దేశ చిత్రపటంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానం సాధ్యమైంది.

సవాళ్ళతోనే ప్రయాణం

రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటు చూసినా సవాళ్ళే. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమైపోతుందని ఒకరు, చిన్న రాష్ట్రంగా మనుగడ సాగించలేదని మరొకరు, పరాయి రాష్ట్రాల ప్రజలకు భద్రత ఉండదని ఇంకొకరు, పరిశ్రమలన్నీ మూసేసుకుని మరో చోటు వెతుక్కోవడమే నయమని మరొకరు.. ఇలా ప్రజల్లో విష ప్రచారం గణనీయ స్థాయిలోనే జరిగింది. రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సంతోషం ఒకవైపు ఉం, రాష్ట్రంలో నివసిస్తున్న పొరుగు రాష్ట్రాల ప్రజల్లో అంతే స్థాయిలో ఆందోళన, అభద్రతాభావం నెలకొనింది. మనసుం మార్గాలు అనేకం అనే తరహాలో ఈ భయాందోళనలన్నింటినీ సమగ్ర కార్యాచరణతో ప్రభుత్వం పటాపంచలుచేసింది. ఇంకెంతమాత్రం తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురికారాదన్న ఏకైక లక్షం పరిమితమైన ఆర్థిక వనరులతోనే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ఆలోచనతో ప్రయాణం సాగింది. ప్రతీ ఒక్కరూ సుఖంగా, సంతోషంగా ఉంనే ‘బంగారు తెలంగాణ’ సాకారమవుతుంది భావించిన ప్రభుత్వం ఆయా రంగాల ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గుర్తెరిగి దానికి తగిన కార్యరూపం ఇచ్చింది. తెలంగాణకున్న సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు, బలం, బలహీనత… ఇలా అన్ని కోణాల నుంచి కసరత్తు జరిగి ఒక్కో రంగాన్ని గాడిలో ప్టె ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా సత్ఫలితాలిస్తున్నాయి. ఉద్యమకాలంలోనే ఈ సమైక్య పాలనలోని అన్యాయాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో స్పష్టమైన అవగాహన ఉండడం, అలాంటి నాయకత్వమే అధికారంలోకి రావడంతో అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రయాణం సాఫీగా జరుగుతోంది.

తొలి విజయం విద్యుత్ రంగంతోనే 

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల సామర్థం ఉన్న విద్యుత్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం 6,574 మెగావాట్లుగా మాత్రమే. అప్పటికే 2,700 మెగావాట్ల కొరత ఉండేది. చత్తీస్‌ఘడ్ నుంచి ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్‌ను సమకూర్చుకోవడంతో ఆరు నెలల్లోనే కోత లేని విద్యుత్ సరఫరా సాకారమైంది. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు, గృహ వినియోగం..
ఇలా అన్ని అవసరాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను ఈ ఏడాది జనవరి నుంచి ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 15,380 మెగావాట్ల విద్యుత్ లక్ష్యానికి చేరుకోగా రానున్న మూడేళ్ళలో మరో 14 వేల మెగావాట్లను అందుకుని మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించే దిశగా ప్రయాణం సాగుతోంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో 3320 మెగావాట్లతో దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ నిలిచింది. విద్యుత్ అధికారులకే ఈ రంగం నిర్వహణ బాధ్యతను అప్పజెప్పడంతో అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయి.

సాగునీటిపారుదలలో సరికొత్త రికార్డు 

కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా జలాలను సక్రమంగా వినియోగించుకోవడంలో సమైక్య రాష్ట్రంలో తగిన చిత్తశుద్ధి కరువైంది. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కిన వాటాను సైతం పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయింది. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులతో తెలంగాణలో వ్యవసాయ రంగం ఎంతో బాగుండేది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురిపుష్టంగా ఉండేది. సమైక్య పాలనలో కుట్రపూరిత నిర్లక్షం కారణంగా చెరువులు శిధిలమయ్యాయి. మళ్ళీ పూర్వ కళ తీసుకురావడానికి చెరువుల సర్వే చేపట్టి మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టింది. మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించడం ద్వారా సుమారు పాతిక లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూర్చవచ్చునని భావించింది. మొదటి రెండు దశల్లోనే సుమారు 10.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అదనంగా 58 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 6.443 టిఎంసిల నీటిని నిల్వ చేసుకోగలిగాం. సాగు విస్తీర్ణం ఖరీఫ్, రబీలలో కలుపుకుని 43.6% మేర పెరిగింది. మరోవైపు జలాల సమగ్ర వినియోగం కోసం పటిష్టమైన విధానాన్ని రూపొందించుకుని ఏటా రూ. 25 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తూ ఇప్పటికి రూ. 81 వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. సమైక్య పాలనలో పదేళ్ళ కాలంలో 23 జిల్లాలకు కలిపి రూ. 94 వేల కోట్ల మేర సాగునీటిరంగానికి ఖర్చుచేస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత (పది జిల్లాలకు) 45 నెలల వ్యవధిలోనే రూ. 50 వేల కోట్ల మేర ఖర్చయింది. సమగ్ర విధానం కోసం మూడంచెల విధానాన్ని అవలంబిస్తోంది. గత ప్రభుత్వాలు ప్రారంభించినా పూర్తికాకుండా పెండింగ్‌లో పడిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటికి రీడిజైనింగ్ చేయడం; గత ప్రభుత్వాల్లో అటకెక్కించినవాటిని పునరుద్ధరించడం; గత ప్రభుత్వాల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు శిధిలమైపోవడంతో వాటిని ఆధునికీకరించి ఆయకట్టుకు సాగునీరు అందించడం. అలాంటి 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్య తరహా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. యావత్తు దేశమే గర్వించే తీరులో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకుని పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో సంయుక్త అవగాహనతో ఒప్పందం కుదుర్చుకుని గోదావరి నదిపై పలు ప్రాజెక్టుల పనులు చేపట్టింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్షంతో మొదటి దశ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరు నాటికి తయారుకానుంది. ‘వాటర్‌మాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్, నీతి ఆయోగ్ ప్రతినిధులు, కేంద్ర జల సంఘం ఛైర్మన వివిధ రాష్ట్రాల సాగునీటిపారుదల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి 24 గంటలూ జరుగుతున్న పనులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంక్షేమంలో దేశానికే ఆదర్శం

సంక్షేమరంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన విధానం, వారి అవసరాలు.. ఇలా అనేక కోణాల్లో అధ్యయనం చేసిన ప్రభుత్వం ఏటా రూ. 45 వేల కోట్లను సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 200గా ఉన్న వివిధ రకాల పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచింది. కేవలం ఆసరా పింఛన్లకే బడ్జెట్‌లో రూ. 5366 కోట్లను ఖర్చు చేస్తూ 39 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తోంది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అల్పాదాయ వర్గాల ఆదాయ పరిమితిని సైతం రూ. 60 వేల నుంచి రూ. 1.50 లక్షలకు (గ్రామాల్లో), రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు (పట్టణాల్లో) పెంచింది. సమైక్య రాష్ట్రంలో (2013లో) రూ. 964 కోట్లు, 2014లో రూ. 2085 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తే తెలంగాణ మాత్రం తొలి ఏడాదే రూ. 4514 కోట్లతో ప్రారంభించి ఇప్పుడు రూ. 5366 కోట్లకు కేటాయింపులు పెంచింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 5.30 లక్షల మంది మహిళలకు పింఛన్లు అందిస్తోంది. వికలాంగులకు పింఛన్‌ను రూ. 1500కు పెంచడంతో పాటు బోదకాలు వ్యాధిగ్రస్తులకూ ప్రతీ నెలా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్‌ను అందిస్తోంది. దేశంలో ఎక్కడా అమలుకు నోచుకోని కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్ళికి ప్రభుత్వం లక్ష నూట పదహారు రూపాయలను, ముస్లిం మైనారిటీ యువతులకు షాదీ ముబారక్ పేరుతో ఇంతే మొత్తంలో సాయాన్ని అందిస్తోంది. ఈ పథకాల కింద 45 నెలల వ్యవధిలో 3.20 లక్షల మంది లబ్ధిపొందారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికోసం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, కులవృత్తిదార్లకు లాండ్రీలు, సెలూన్‌లు పెట్టుకోడానికి ఆర్థికసాయం.. ఇవన్నీ తెలంగాణ ప్రత్యేకత.

ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల రేషను బియ్యం

సమైక్య రాష్ట్రంలో తలా నాలుగు కిలోల చొప్పున కుటుంబానికి పరిమితంగా ఇరవై కిలోల చొప్పున మాత్రమే అందితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తలా ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉన్నా వారందరికీ అందించే విధానాన్ని అమలుచేస్తోంది. ప్రతీ ఏటా సగటున 2.75 కోట్ల మందికి 1.74 లక్షల టన్నుల మేర బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 5413 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని రేషనుకార్డు ద్వారా ఏ చౌకధరల దుకాణంనుంచైనా నిత్యావసరాలను అందుకునే పోర్టబిలిటీ విధానాన్ని అమలుచేస్తోంది. అంగన్‌వాడీ, హాస్టళ్ళ విద్యార్థులకు సన్నబియ్యం అందించే ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ప్రతీ ఏటా 32 వేల పైచిలుకు విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 47.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఇక స్వయం ఉపాధితో బతకాలనుకుంటున్న నిరుద్యోగులకు సమైక్య పాలనలో గరిష్టంగా రూ. 30 వేల సబ్సిడీ మాత్రమే లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర లక్షల రూపాయల వరకు సబ్సిడీని ఇస్తోంది. ఇక గర్భిణీలకు పౌష్ఠికాహారాన్ని అందించడం మొదలు ‘అమ్మ ఒడి’ పేరుతో ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం, కాన్పుకాగానే కెసిఆర్ కిట్‌ను ఇవ్వడం, ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పడం.. ఇలా అనేక విప్లవాత్మక మార్పులు తెలంగాణలో చోటుచేసుకున్నాయి.

పారిశ్రామికరంగంలో వినూత్న విప్లవం

దేశంలోనే వినూత్నమైన పారిశ్రామిక పాలసీ (టిఎస్ ఐపాస్)ను రూపొందించడం ద్వారా దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నందున 2015 జూన్ మొదలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1.27 లక్షల కోట్ల మేర పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 6818 పరిశ్రమలకు అనుమతులుమంజూరుకాగా అందులో 4382 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇప్పటికే సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించగా మరో 684 పరిశ్రమలు కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తే 5.38 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సులభ వాణిజ్య విభాగంలో సైతం రెండేళ్ళ క్రితం దేశంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణ గతేడాది మొదటి స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం కూడా నెంబర్ వన్‌లోనే నిలిచింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధి రేటు 20% ఉం తెలంగాణ మాత్రం 79% వృద్ధి సాధించింది. ఎక్కువగా విద్యుత్, నీటిపారుదల, ఉత్పత్తి, సేవా రంగాలకు చెందిన పరిశ్రమలే ఉన్నాయి. అనేక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇక ‘నిమ్స్’, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, ‘టి హబ్’, అపాచీ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ యూనిట్, హెలికాప్టర్ తయారీ యూనిట్, లెదర్ పార్కు, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు తదితర ఎన్నో రంగాల ఉత్పత్తి యూనిట్లకు తెలంగాణ కేంద్రంగా మారింది. ఐటీ రంగంలో గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్ లాంటి ఎన్నో సంస్థలు హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్నాయి. సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రత్యక్షంగానూ, ఏడున్నర లక్షల మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న ఐటి రంగం గతేడాది రూ. 87 వేల కోట్ల మేర సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేసింది. దేశ స్థాయిలో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల వృద్ధిరేటు పదిశాతంగా ఉం తెలంగాణలో మాత్రం 14%గా నమోదైంది. ‘టి ఫైబర్’ పేరుతో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే పథకం పనులు ముగింపు దశకు  చేరుకున్నాయి.

ప్రాధాన్యత రంగంగా వ్యవసాయం

మొత్తం బడ్జెట్‌లో ఏకంగా 26% నిధుల్ని వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలకు రూ. 15,780 కోట్లను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో తెలంగాణ ప్రాంతానికి వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ రూ. 1697 కోట్లు మాత్రమే. తెలంగాణ మాత్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రూ. 37,968 కోట్లను కేటాయించింది. 2016-17లో తెలంగాణలో గరిష్టంగా 101 లక్షల టన్నుల మేర ఆహారధాన్యాల ఉత్పత్తి జరగ్గా గతేడాది లక్ష టన్నుల మేర ఉత్పత్తయింది. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు సుమారు రూ. 17 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేసింది. ఇకపైన అప్పులబారిన పడరాదన్న ఉద్దేశంతో రైతులకు సంవత్సరానికి ఒక్కో ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున ‘రైతుబంధు’ పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. మరోవైపు రైతుల జీవిత భద్రత కోసం ప్రభుత్వమే మొత్తం ప్రీమియంను చెల్లించేలా ఉచిత జీవితబీమా విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనుంది. ఒకవైపు పంట పొలాలకు సాగునీరు, మరోవైపు కొరత లేకుండా సబ్సిడీపై ఎరువులు, విత్తనాల సరఫరా, ఇప్పుడు రైతు బంధు సాయం, త్వరలో జీవిత బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పంట నిల్వలకు అదనపు గోదాముల నిర్మాణం… ఇలా అన్ని విధాలుగా రైతుల్ని, వ్యవసాయరంగానికి ఊతమందుతోంది. వ్యవసాయ రంగంలో 14.9% వృద్ధిరేటు నమోదైంది. భూ రికార్డులను పటిష్టంగా రూపొందిస్తే వివాదాలకు ఆస్కారమే ఉండదని భావించి వంద రోజుల వ్యవధిలోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రక్రియను పూర్తి చేసింది. ఏ భూమికి ఎవరు యజమానులో తేల్చింది. నకిలీలకు ఆస్కారం లేకుండా పక్కా పట్టాదారు పాస్ బుక్కులను రూపొందించింది.

ఆర్థిక రంగంలో ఆదర్శం

నోట్లరద్దు, జిఎస్‌టి లాంటి కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా అనేక రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోయినా తెలంగాణ మాత్రం తనదైన వ్యూహంతో ఆ ఇబ్బందుల నుంచి బైటపడింది. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు ఆలస్యమైనా రాష్ట్రమే తన స్వంత ఆర్థిక వనరులను మెరుగుపర్చుకుంటూ ఒక్క పైసా పన్ను పెంచకుండా తన కాళ్ళమీద తాను నిలబడి పలు రాష్ట్రాల చేత ప్రశంసలు పొందింది. రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 1.12 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 1.75 లక్షలకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడేనాటికి 12%గా ఉన్న జిఎస్‌డిపి ఇప్పుడు 14.4%కి పెరిగింది. రాష్ట్రం ఏర్పడేనాటికి మైనస్‌లో ఉన్న పారిశ్రామిక వృద్ధిరేటు ఇప్పుడు 14%కి చేరుకుంది. వారం రోజుల వ్యవధిలోనే రైతుబంధు చెక్కుల పంపిణీ ద్వారా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలను ప్రజలకు ఇవ్వడమే కాకుండా బ్యాంకుల్లో, ఏటిఎంలలో నగదు కొరత ఉన్నా రైతులకు ఆ బాధ లేకుండా చూడగలిగింది. తెలంగాణ దృక్పథంలో పరిపాలన సాగడంతో పాటు పకడ్బందీ ఆర్థిక ప్రణాళిక రూపొందించడం ద్వారా సాధ్యమైంది. రాష్ట్రం సంపద సృష్టించాలి. ఆ సంపద అట్టడుగువర్గాలవారికి చేరాలి. రాష్ట్ర అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలి& ఇలాంటి లక్షంతో జరుగుతున్న పరిపాలన యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచింది.

వినూత్న పథకాలకు కేంద్రంగా తెలంగాణ 

దేశంలో మరే రాష్ట్రంలో లేని అనేక వినూత్న పథకాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారింది. ఈ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో స్వయంగా అధ్యయనం చేయడానికి అనేక రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, కేంద్ర జల సంఘం ఛైర్మన్, వివిధ రాష్ట్రాల మంత్రులు ప్రశంసలు కురిపించారు.

* వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్
* ఇంటింటికీ రక్షిత త్రాగునీరు అందించడం కోసం నాబార్డు, హడ్కోలతో సహా 18 జాతీయ బ్యాంకుల రుణాలతో మిషన్ భగీరధ పథకం. రాష్ట్రంలోని పాతికవేల ఆవాసాలకు ఈ ఏడాది దసరాకల్లా త్రాగునీరు అందనుంది.
* రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 33% మేర అటవీ భాగం ఉండేలా ‘హరితహారం’ పథకంతో ఐదేళ్ళలో 230 కోట్ల మొక్కలను నా కార్యక్రమం.
* రాష్ట్రంలో ఒకే రోజున ‘సమగ్ర కుటుంబ సర్వే’ నిర్వహించి అందరి వివరాలను నమోదు చేసిన వినూత్న కార్యక్రమం.
* ‘రైతుబంధు’ పేరుతో ప్రతీ రైతుకు ఎకరానికి ఏటా రూ. 8000 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం
* రైతులను సంఘటితపర్చడానికి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు. ఏ నేల స్వభావానికి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్ల ఏ తరహా పంటలు వేయాలో రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు పంటలు చేతికొచ్చిన తర్వాత మార్కెట్లకు పద్ధతి ప్రకారం పంపించడం, గిట్టుబాటుధర కల్పించడం, గోదాముల్లో నిల్వ చేసుకోడానికి ఈ సమితులు సహాయపడతాయి.
* డ్రిప్ ఇరిగేషన్‌కు వంద శాతం సబ్సిడీతో పాటు పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్ సేద్యానికి 75% వరకు సబ్సిడీ
* కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్షంతో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్‌లో పాతికవేల కోట్ల రూపాయల కేటాయింపు
* వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీలలో మహిళలకు, బిసిలకు, ఎస్‌సిలకు, ఎస్‌టిలకు రిజర్వేషన్లు.
* సంప్రదాయ చెరువుల పునరుద్ధరణ చేపట్టి భూగర్భజల మట్టాన్ని పెంచడంతో పాటు నీటి నిల్వకు, సాగునీటి సౌకర్యానికి చేపట్టిన మిషన్ కాకతీయ పథకం.
* నిజాం కాలంలో రూపుదిద్దుకున్న భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి ప్రత్యేక కార్యక్రమం. వంద రోజుల్లోనే 10,800 గ్రామాల్లో సుమారు 72 లక్షల మంది రైతులకు చెందిన 1.42 లక్షల ఎకరాల సాగుభూమి ప్రక్షాళన.
* ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం.
* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం
* ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికులకు ఆరు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా
* రైతులందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత జీవిత బీమా
* పేదరికంలో ఉన్న యువతుల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం.
* స్వంత ఇల్లులేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ పథకం.

* బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులు.. ఇలా వివిధ సెక్షన్ల ప్రజలకు ప్రతీ నెలా వెయ్యి మొదలు రూ. 1500 వరకు పింఛను
* నిరుపేద కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు
* మసీదుల్లో పనిచేస్తున్న తొమ్మిది వేల మంది ఇమామ్, మౌజమ్‌లకు ప్రతీ నెలా రూ. 1500 చొప్పున పింఛన్లు
* ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆలయ అర్చకులకు వేతనాలు
* నాలుగేళ్ళలో 542 గురుకుల విద్యా సంస్థల ఏర్పాటు
* విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ళే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ‘విద్యానిధి’ పథకం కింద ఆర్థిక సాయం
* తండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడేషన్
* అత్యంత వెనకబడివర్గాలకు ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు వెయ్యి కోట్ల రూపాయల మూలనిధి.
* యాదవ, కుర్మలకు 75% సబ్సిడీతో గొర్రెల పంపిణీ ఒక్కో యూనిట్‌కు రూ. 1.25 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ
* మత్సకార్మికులకు చేపల పెంపకం కోసం వందశాతం సబ్సిడీ
* చేనేత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 1200 కోట్ల నిధి. వస్త్రాల విక్రయానికి మార్కెటింగ్ ప్రోత్సాహకం.
* కులవృత్తిదారులకు సెలూన్‌లు, లాండ్రీలను సమకూర్చుకోడానికి ప్రత్యేక నిధి
* ఆటోరిక్షాలు, ట్రాక్టర్లకు రవాణా పన్ను నుంచి మినహాయింపు
* ట్రాఫిక్ పోలీసులకు మూలవేతనంపైన 30% అదనపు అలవెన్స్
* ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్, వెల్‌నెస్ కేంద్రాలు. * సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో 25% వాటా
* సైనిక సంక్షేమం కోసం ఏటా రూ. 80 కోట్ల సాయం. ప్రతీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపి సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున విరాళం.
* గర్భిణీలకు రూ. 15 వేల విలువైన పన్నెండు వస్తువులతో కెసిఆర్ కిట్.
* వివిధ కారణాలతో మృతిచెందిన సామాన్య ప్రజానీకాన్ని స్వస్థలాలకు ఉచితంగా తరలించడానికి ప్రత్యేకంగా ‘పరమపద’ వాహనాలు
* పదిహేను రోజుల్లోనే 53 రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారానే మంజూరు చేసే టిఎస్ ఐపాస్ విధానం.
* శాంతిభద్రతల నిర్వహణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.