Saturday, April 20, 2024

ఐపిఎల్‌పై చిగురిస్తున్న ఆశలు!

- Advertisement -
- Advertisement -

Franchise ownership ready to IPL managed

 

ఖాళీ స్టేడియాల్లో టోర్నీకి ఫ్రాంచైజీల అంగీకారం!

ముంబై: కరోనా దెబ్బకు ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఖాళీ స్టేడియాల్లో క్రీడలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఐపిఎల్ నిర్వహణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభిమానులు లేకుండా ఖాళీ మైదానాల్లో ఐపిఎల్ నిర్వహించేందుకు ఇటు క్రికెటర్లు అటు ఫ్రాంచైజీల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ నెలలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్టేడియాల్లో అభిమానులు రాకున్న టివిల్లో లక్షలాది మంది ఐపిఎల్‌ను వీక్షించే అవకాశాలున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఫ్రాంచైజీల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి.

పూర్తిగా రద్దు చేసే బదులు ఖాళీ స్టేడియాల్లో టోర్నీని నిర్వహించడమే మంచిదనే ఉద్దేశంతో బిసిసిఐ కూడా ఉంది. అంత అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నెలలో ఐపిఎల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఖాళీ స్టేడియాల్లో ఐపిఎల్ నిర్వహించడంపై ఫ్రాంచైజీల మధ్య సదాభిప్రాయం లేనట్టు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు అభిమానులు లేకుండా టోర్నీని నిర్వహించేందుకు ముందుకు వస్తుండగా, మరికొందరూ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐపిఎల్‌కు స్టేడియాలకు వచ్చే అభిమానులే బలమని, వారు లేకుండా టోర్నీ నిర్వహించినా ఫలితం ఉండదని పేర్కొంటున్నారు.

క్రికెటర్లు రెడీ

మరోవైపు ఐపిఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా ఆడేందుకు క్రికెటర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు దీనికి బహిరంగంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. టోర్నీని పూర్తిగా రద్దు చేసే బదులు ప్రేక్షకులు లేకుండానే ఖాళీ మైదానాల్లో ఐపిఎల్‌ను నిర్వహించడమే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. వీరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్స్ ఎలెవన్ సారధి కెఎల్ రాహుల్, రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తదితరులు ఉన్నారు. ఇక, హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెంగళూరు సారధి విరాట్ కోహ్లిలు కూడా దీనికి మద్దతు తెలిపారు.

దాదాపు అన్ని జట్ల కెప్టెన్లు ఈ విధానానికి మద్దతుగా ఉండడంతో ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయినట్టేనని చెప్పాలి. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇస్తాయా అనేది సందేహమే. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఖాళీ స్టేడియాల్లోనైనా ఐపిఎల్ నిర్వహణ కష్టంగానే కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News