Thursday, April 25, 2024

అత్యాశకు పోతే… అంతే

- Advertisement -
- Advertisement -

fraud in the name of investment in hyderabad

పెట్టుబడి పేరుతో మోసం
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్: తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పి అత్యాశపెట్టి మోసం చేస్తారని, అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తారని, తీరా డబ్బులు డిపాజిట్ చేశాక ముఖం చాటేస్తారు, వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇది సైబర్ నేరగాళ్ల ప్లాన్, ఫలానా కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని, ఈ షేర్లు కొంటే పది రేట్ల లాభం వస్తుందని, ల్యాండ్స్, బిట్‌కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి ఆకర్షణీయ ప్రకటనలు చూసి మోసపోవద్దని చెబుతున్నారు. ఈజీ మనీ కోసం పాకులాడితే అసలుకే మోసం వస్తుంది. ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు లేదా షేర్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి.

షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి, ఎవరూ ఉచితంగా లాభాలు ఇవ్వరు. ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులని ఫోన్ చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేసుకుని మోసం చేస్తారు. సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుగా డబ్బులు తీసుకుంటారు, టవర్లు ఏర్పాటు చేస్తే నెలకు రూ.20,000 వస్తాయని చెప్పి మోసం చేస్తారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి ఫోన్ చేయడం, ఎస్‌ఎంస్, ఈ మెయిల్ పంపిస్తూ మోసం చేస్తున్నారు. ఫోన్ చేసి మీకు ఫలానా లాటరీలో కోట్లు వచ్చాయని చెప్పి మోసం చేస్తారు, నేరస్థుల మాటలను నమ్మి ముందుగా డబ్బులు ఇస్తే మోసం చేస్తారు. లాటరీ వచ్చిందని చెప్పగానే నమ్మవద్దు అసలు లాటరీ టికెట్ మనం కొనుగోలు చేశామా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అసలు లాటరీ టికెట్ కొనుగోలు చేయకముందే డబ్బులు ఎలా వస్తాయనేది ఆలోచించాలి. అపరిచితులు ఫోన్ చేస్తే ముందుగా వారు అడిగే వివరాలు చెప్పవద్దు, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు తదితరాలను చెప్పవద్దు. బ్యాంక్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను ఎందుకు అడుగుతున్నారు, వారి వివరాలు, బ్యాంక్‌లో పనిచేస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలి. వారు చెప్పిన సమాధానాలు సరిగా లేకుంటే వెంటనే ఫోన్‌ను కట్ చేయాలి. షేర్ మార్కెట్‌లో మీ తరఫున కొనుగోలు, విక్రయాలు చేస్తామని చెప్పిన వారికి డబ్బులు ఇచ్చి మోస పోవద్దు. ఇలా నమ్మి డబ్బులు ఇచ్చిన చాలామంది మోసపోయారు. అమెరికా ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతి రోజూ డాలర్లతో పాటు ఏడాది తర్వాత పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందని చెప్పి అమాయకులను ముంచుతారు.

మోసపూరిత ప్రకటనలపై ఫిర్యాదు చేయండిః విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

మోసపూరిత ప్రకటనలు చేస్తున్నవారి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. డబ్బులు ఊరికే రావు, కష్టపడాలి, ఈజీ మనీ కోసం ఆశపడి మోసపోద్దని కోరారు. తాజాగా బిట్‌కాయిన్ల పేరుతో మోసం చేస్తున్నారని, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ మంచి పెట్టుబడి అని, రానున్న రోజుల్లో భారీగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారు ఫోన్ చేస్తే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 9490617310, 9490617444కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News