Thursday, April 25, 2024

వాట్సాప్‌లో చాటింగ్… నమ్మకం కుదిరాక చీటింగ్

- Advertisement -
- Advertisement -

బహుమతుల పేరుతో మోసం
నమ్మించి ముంచుతున్న సైబర్ నేరస్థులు
నకిలీ కస్టమ్స్ అధికారుల ఫోన్
ఖరీదైన వస్తువులు వచ్చాయని ఆశతో డబ్బులు కడుతున్న బాధితులు

హైదరాబాద్: బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్‌లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకుని మోసం చేసేవారు. ఇలాంటి నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తుండడంతో సైబర్ నేరస్థులు రూట్‌మార్చారు. వర్చువల్ నంబర్ల ద్వారా బాధితులకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. తాము అమెరికా, ఇంగ్లండ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నామని చెప్పి నమ్మిస్తున్నారు.

కొద్ది రోజులు బాధితులకు నమ్మకం కుదరాలని ఛాటింగ్ చేస్తున్నారు. తర్వాత వెకేషన్‌కు ఇండియాకు రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్లాన్‌లో భాగంగా మీరు నాకు నమ్మకమైన స్నేహితులని, మీకు ఖరీదైన ల్యాప్‌టాప్, యాపిల్ ఫోన్లు, డాలర్లు, పౌండ్లు పంపిస్తున్నామని చెబుతున్నారు. పార్సిల్ వస్తుందని తీసుకోవాలని చెప్పడంతో అమాయకులు నమ్ముతున్నారు. ఈ సమయంలో ప్రధాన నేరస్థులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేరాల వెనుక ఇండియాకు స్టడీ కోసం వచ్చిన నైజీరియన్లు ఉంటున్నారు. వారు వెంటనే బాధితులకు ఫోన్లు చేసి మీ స్నేహితుడిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుకున్నామని చెబుతున్నారు. మీకు వచ్చిన గిఫ్ట్‌లు ఇవ్వలంటే వెంటనే వివిధ ట్యాక్సుల కింద డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు. ఇది నిజమని భయపడిన బాధితులు దశల వారీగా నిందితుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు.

వాటిని తీసుకున్న తర్వాత నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తోంది. అప్పడుగాని బాధితులు తాము మోస పోయామని గ్రహించడంలేదు. ఇలాంటి సంఘటనలో నగరంలోని బేగం పేటకు చెందిన బాధితురాలు రూ.9,19,400 పోగొట్టుకుంది. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాధితురాలికి సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు, కొద్ది రోజులు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చేది ఉందని ప్రార్థన చేయాలని కోరాడు. దానికి బాధితురాలు అంగీకరించింది. కొద్ది రోజుల తర్వాత సైబర్ నేరస్థులు బాధితురాలికి ఫోన్ చేసి మీరు ప్రార్థనలు చేయడం వల్లే తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. దీనికి మీకు ఖరీదైన గిఫ్టులు, డాలర్లు పంపిస్తున్నానని చెప్పాడు. తర్వాత నకిలీ కొరియర్ పంపిస్తున్నట్లు ఇన్‌వాయిస్ తదితరాలను పంపించాడు. ఇది నిజమని బాధితురాలు నమ్మింది. కొరియర్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆగిందని కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని నిందితుడు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పిన మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారిని ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, కస్టమ్స్, జిఎస్‌టి, క్లియరెన్స్ తదితర ఛారీజలను వెంటనే చెల్లించాలని చెప్పాడు.

దీనిని నమ్మిన బాధితురాలు వారు చెప్పినట్లు దశలవారీగా రూ.12లక్షలు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయినా కూడా సైబర్ నేరస్థులు మళ్లీ ఫోన్ చేసి డబ్బులు పంపించాల్సిందిగా కోరడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిరాదు చేసింది. బహుమతుల పేరుతో మోసం చేశారని గ్రహించింది. మరో కేసులో చింతల్‌కు చెందిన గాయత్రి అనే బాధితురాలి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లికి చికిత్స చేయించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరస్థులు ఫోన్ చేసి నీకు కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.25లక్షలు బహుమతి వచ్చిందని చెప్పారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన బాధితురాలు తన తల్లి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు పనిచేస్తాయని అనుకుంది. బహుమతిగా వచ్చిన డబ్బులను పంపించాలంటే ముందుగా వివిధ రకాల ట్యాక్స్‌లు చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితురాలు సైబర్ నేరస్థులు చెప్పిన విధంగా దశలవారీగా రూ.8లక్షలు పంపించింది. అయినా కూడా మళ్లీ డబ్బులు పంపించాల్సిందిగా అడుగుతుండడంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితురాలు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తార్నాకకు చెందిన బాధితురాలికి సోషల్ మీడియాలో పరిచయం అయిన నిందితుడు తాను యూకేలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరు తరచూ ఆన్‌లైన్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. వివాహం అనంతరం బెంగళూరులో స్థిరపడుదామని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించాడు. యూకే నుంచి ఖరీదైన పార్సిల్‌ను పంపిస్తున్నానని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులము మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.

మీకు పార్సిల్ వచ్చిందని జిఎస్‌టి తదితర ఛార్జీల కింద రూ.10,69,000 వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలిని మోసం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండి హసి ం అలియాస్ పప్పును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఇండియాలోనే ఉంటూ యూకేలో ఉంటున్నానని చెప్పి మోసం చేశాడు.ఇలాగే సామాజిక మాద్యమాల్లో ఉంటే అమాయకులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్నారు.

కమీషన్‌తో ఎర….
ఢిల్లీ కేంద్రంగా ఉండే నైజీరియాకు చెందిన ముఠాలు ఇలాంటి ఆగడాలు ఎక్కువగా చేస్తున్నాయి. గతంలో వారి బ్యాంక్ ఖాతాలను బాధితులకు ఇచ్చి వాటిలో డబ్బులు డిపాజిట్ కాగానే డ్రా చేసేవారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుంటుండడంతో ప్లాన్ మార్చి వేశారు. స్థానికంగా ఉంటున్న వారికి 10శాతం కమిషన్ ఆశ చూపి దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా వందలాది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయిస్తున్న నైజీరియాకు చెందిన ముఠాలు వాటిని బాధితులకు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నారు. కమీషన్‌కు ఆశపడిన ఇండియాకు చెందిన వారు డబ్బులు డ్రా చేసి నైజీరియన్ల బ్యాంక్ ఖాతాలకు మళ్లీ పంపిస్తున్నారు.

గతంలో పోలీసులు బ్యాంక్ ఖాతాలను ఇచ్చే వారిని వదిలేసేవారు. కానీ సైబర్ నేరస్థులు చేస్తున్న నేరాలు వీరికి తెలిసినా కూడా కమీషన్‌కు ఆశపడి సహకరిస్తుండడంతో వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. సైబర్ నేరస్థులకు బ్యాంక్ ఖాతాలు ఇస్తున్న వారికి అరెస్టు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News