Home తాజా వార్తలు వలస కూలీలకు అండగా నిలిచిన ప్రభుత్వం

వలస కూలీలకు అండగా నిలిచిన ప్రభుత్వం

TS Govt

 

హైదరాబాద్ : వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తోంది. సిఎం కెసిఆర్ చెప్పినట్లుగానే వారిని అధికారులు కడుపులో పెట్టుకుని పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా వలస కూలీలకు రోజువారి పని లేకపోవడంతో పరిస్థితి దుర్భరంగా మారింది. బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి విషయంలో సిఎం కెసిఆర్ పెద్ద మనస్సుతో నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వారందరిని గుర్తించి లాక్‌డౌన్ ముగిసేంత వరకు వసతి సౌకర్యంతో పాటు భోజన, వైద్య సదుపాయాలకు కూడా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11మున్సిపల్ కార్పోరేషన్‌లలో మంత్రి కెటిఆర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులకు వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

అలాగే వారికి ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి రెండు పూటల ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పోరేషన్‌లలో ఇప్పటివరకు 26,526 మంది నిరుపేదలకు,వలస కూలీలను ఆదుకుంటున్నారు. కాగా నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 2,000మంది, బండ్ల గూడ జాగీర్‌లో 800 మంది, బోడుప్పల్‌లో 800 మంది, ఫిర్జాదిగూడలో 1,800మంది, మీర్‌పేట్‌లో 360 మంది బడంగ్‌పేట్‌లో 600 మంది, జవహార్‌నగర్ లో 1,200 మంది, నిజామాబాద్‌లో 766 మంది, వరంగల్‌లో 3,870 మంది, కరీంనగర్ 1,000 మంది, ఖమ్మంలో 13,330 మందికి భోజనాలను మున్సిపల్ అధికారులు కల్పిస్తున్నారు.

Free accommodation, dining for migrant workers