Thursday, April 25, 2024

కరోనా పరీక్షలు ఫ్రీ

- Advertisement -
- Advertisement -

supreme court

 

ప్రైవేటు ల్యాబ్స్‌లో వసూళ్లు వద్దు
వీలయితే సర్కారే చెల్లించాలి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశ పౌరులకు కరోనా వైరస్ పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా నిర్థారణ పరీక్షల సౌకర్యానికి ప్రజలు ఎటువంటి ఖర్చు పెట్టకుండా చూడాల్సి ఉందని తెలిపారు. ఇదే సమయంలో ప్రైవేటు ల్యాబ్‌లు కూడా ఈ పరీక్షలకు ఫీజులు వసూలు చేయవద్దని కూడా ఆదేశించింది. ఈ విధం గా ప్రైవేటు లాబ్స్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వం తరువాత భర్తీ చేసే విషయాన్ని పరిశీలించవచ్చునని తెలిపింది. పెనుసవాలుగా మారిన కోవిడ్ 19 కట్టడిలో అందరి బాధ్యతా ఉంది. ప్రభుత్వాలు తగు విధంగా స్పందించాలి. ప్రజలకు సరైన ఉచిత వైద్య పరీక్ష లు నిర్వహించాలి. మరో వైపు రోగ నిర్థారణలో ప్రైవేటు హాస్పిటల్స్, అనుబంధ లాబ్‌లు, పరీక్షా కేంద్రాలపై కూడా బాధ్యత ఉందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ప్రైవేటు లాబ్‌లలో కరోనా పరీక్షలకు ప్రజల వద్ద నుంచి ఫీజులు వసూళ్లకు ప్రభుత్వ పరంగా అనుమతి ఉంది. అయితే ఇది రూ 4500 మించరాదని పరిమితి విధించారు.

న్యాయవాది శశాంక్ దియో సుద్ధి కరోనా పరీక్షలు సామాన్యునికి భారం అవుతున్న విషయాన్ని తెలియచేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు వెలువరించింది. కరోనా వైద్య పరీక్షలన్నింటినీ ప్రజలకు ఉచితంగా జరిపేలా కేంద్రం చూడాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ల్యాబ్స్ ఫీజుల భారం పౌరులపై పడరాదని, ఈ క్రమంలో ఆయా లాబ్‌లకు ఈ రుసుం రీయింబర్స్ అయ్యేలా చూడాలని, ఈ మేరకు తగు మార్గాలు అన్వేషించాలని సూచించింది.

అత్యధిక ఫీజులు వసూలు చేయకుండా చూడటమే కాదు, పూర్తిగా రుసుం వసూళ్లకు దిగకుండా ్రప్రైవేటు ల్యాబ్స్‌కు తగు కట్టడి చేయాల్సి ఉందని జస్టిస్ భూషణ్ తెలిపారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. కేంద్రం నుంచి దీనిపై తాను తగు వివరణ తీసుకుని న్యాయస్థానానికి తెలియచేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపొయ్యే విధంగా కరోనా పరీక్షల సౌకర్యాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రైవేటు ల్యాబ్స్‌లలో వైరస్ నిర్థారణ పరీక్షలకు అనుమతిని ఇస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు వెలువరించింది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా తగు ల్యాబ్‌లు లేకపోవడం ప్రభుత్వానికి చిక్కుగా మారింది.

వైరస్ నిర్ధారణపై దిక్కుతోచని స్థితి..
వైరస్ వ్యాప్తి దశలో ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని, సామాన్యుడు సర్కారు ఆసుపత్రులలో పరీక్షలకు వెళ్లలేకపోతున్నాడు. మరో వైపు ప్రైవేటు ఆసుపత్రులలో ఫీజుల భారం తట్టుకోలేకపోతున్నాడని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు దిక్కుతోచనిస్థితిలో ప్రైవేటు లాబ్‌లలో పరీక్షలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విధంగా వారిపై ఈ గడ్డు స్థితిలో మరింత ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అయితే ఇప్పుడు వారికి ఇవి అందుబాటులో లేకపోవడం రాజ్యాంగంలోని 21వ అధికరణలో పేర్కొన్న జీవించే హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని, దీనికి ఎవరు బాధ్యత వహించాల్సి ఉందని పిటిషనర్ ప్రశ్నించారు. దీనిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. జాతీయ విపత్తు దశలో ప్రైవేటు ల్యాబ్స్ పేదలకు ఉచిత సేవలు అందించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఇది ధార్మిక సేవగా ఉంటుందని పేర్కొన్నారు.

Free medical tests conducted for Public
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News