Friday, March 29, 2024

పేదలకు ఏడాది పాటు ఉచిత రేషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని పేద ప్రజలకు సంవత్సరం పాటు ఉచిత రేషన్‌ను అందిస్తారు. ఆహార చట్టం పరిధిలో ఈ మేరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశం తరువాత మంత్రివర్గ కీలక నిర్ణయాలను కేంద్ర ఆహార మంత్రి పియూష్ గోయల్ విలేకరులకు వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ఏడాది పాటు దేశంలోని 81.35 కోట్ల మందికి రేషన్ పంపిణీ పథకంలో భాగంగా ఆహార ధాన్యాలను అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోయల్ తెలిపారు. ఇప్పుడు ఈ పథకం పరిధిలో నిరుపేదలకు కేంద్రం రూ 2 నుంచి 3 కిలో చొప్పున 5 కిలోల ఆహారధాన్యాలను అందిస్తోంది.

ఇందులో భాగంగా గోధుమలు, బియ్యం ఇస్తున్నారు. ఇక అంత్యోదయ అన్న యోజన ( ఎఎవై) పరిధిలోకి వచ్చే పేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ధాన్యాలను ఇస్తున్నారు. ఈ పరిధిలో బియ్యం కిలోకు రూ 3, గోధుమలు రూ 2 చొప్పున అందిస్తున్నారు. అయితే ఏడాది పాటు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పరిధిలో ఉచిత ఆహారధాన్యాల సరఫరాకు అయ్యే వ్యయ భారాన్ని కేంద్రం భరిస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీని వల్ల కేంద్రానికి ఏటా అదనంగా రూ 2 లక్షల కోట్ల భారం పడుతుంది. అయితే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ పరిధిలో జరిగే ఉచిత రేషన్ పంపిణీని కొనసాగించరాదని , గడువును పెంచరాదని నిర్ణయించారు. ఇప్పుడు పేదలకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ నిర్ణయం నూతన సంవత్సర కానుక అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 80 కోట్ల మంది వరకూ ఒక్కపైసా ఇవ్వకుండానే ఏడాది పాటు ఈ ఆహారధాన్యాలను ఉచితంగా పొందవచ్చునని పేర్కొన్నారు.

ఒఆర్‌ఒపి పునరుద్ధరణకు నిర్ణయం

దేశంలోని రక్షణ సిబ్బంది, ఫ్యామిలీ పెన్షనర్లకు ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ (ఒఆర్‌ఒపి)ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి మండలి శుక్రవారం నాటి భేటీలో నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దీని వల్ల ఒఆర్‌ఓపి ప్రతిపాదనల మేరకు పెరిగే పింఛన్లను ఫించన్‌దార్లు అందుకుంటారు. ఈ ప్రయోజనం ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. యుద్ధ వితంతువులు, వికలాంగులకు కూడా ఇది వర్తిస్తుందని ఠాగూర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News