Friday, April 19, 2024

దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’

- Advertisement -
- Advertisement -

Free ration till Diwali festival

 

ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్‌డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడుకోగలిగాం
అన్‌లాక్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష ధోరణి పెరిగింది
సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎవరూ చట్టానికి అతీతం కాదు
జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ: దేశంలో సరయిన సమయంలో విధించిన లాక్‌డౌన్, ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న తరుణంలో మంగళవారం ప్రధాని దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మరో వైపు ఫ్లూ సీజన్ కూడా రాబోతోందని… అందువల్ల ప్రజలు మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని, దీని కోసం రూ.90 వేలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా మృతుల విషయంలో ప్రపంచంలోని అనేక దేశాలకన్నా మెరుగ్గానే ఉన్నామని చెప్పిన ప్రధాని అన్‌లాక్ 1 తర్వాత ప్రజల వ్యవహార శైలిలో నిర్లక్ష ధోరణి కనిపించిందన్నారు.

బయటికి వెళ్తే మాస్క్ తప్పనిసరి

‘వర్షాకాలంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కాలంలోనే వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జూలై నెలనుంచి పండగలు ఉంటాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. అయిదు నెలల పాటు 80 కోట్ల మందదికి ప్రతి నెలా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేస్తాం. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తం కలిపితే ఈ పథకం కోసం 1.5 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్ 2.0లోకి ప్రవేశించాం. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. జలుబు, జ్వరం లాంటి రోగాలు చుట్టుముడుతుంటాయి. అందువల్ల మరింత జాగ్రత్త్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చట్టానికి ఎవరూ అతీతులు కారు.. ప్రధానికే జరిమానా విధించారు

లాక్‌డౌన్‌తో లక్షలాది ప్రాణాలను కాపాడగలిగాం. కంటైన్‌మెంట్ జోన్లపై మరింతగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం కూడా ఉంది. మాస్క్ ధరించకుండా బైటికి వెళ్లినందుకు ఒక దేశ ప్రధానికే (బల్గేరియా ప్రధాని బోయ్కో బొరిస్సోప్ ) రూ.13 వేలు జరిమానా విధించారు. అలాగే మన దేశంలో కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారు. దేశ ప్రజల సహకారం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా చేసింది. దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. అన్ని రాష్ట్రాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే రకమైన అప్రమత్తతను ప్రదర్శించాలి. మన ఈ పోరాటం 130 కోట్ల మంది భారతీయులను కాపాడుకునేందుకే’ అని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News