Thursday, March 28, 2024

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

డిమాండ్ ఉన్న సుమారు 3,800 నైపుణ్యత కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు అవకాశం
ఆన్‌లైన్ ఎడ్‌టెక్ సంస్థ కోర్స్‌ఎరాతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. సుమారు 50వేల మంది నిరుద్యోగులకు పలు అంశాలలో నైపుణ్యం పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ఎడ్‌టెక్ సంస్థ కోర్స్‌ఎరాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), కోర్స్‌ఎరా సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి డిమాండ్ ఉన్న 3,800 కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రొత్సహిస్తోంది. ప్రధానంగా టాస్క్‌ద్వారా యువత ఉపాధిని మెరుగుపరిచేందుకు యత్నిస్తోంది. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం కోర్స్‌ఎరాతో ఈ భాగస్వామ్యం చేసుకుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మార్కెట్‌లో డిమాండ్‌లో ఉన్న కోర్సులను అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ల మంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశంలో మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాంకేతిక నేపథ్యం లేని వ్యక్తులకు శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన గూగుల్ ఐటి సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ వంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల కోర్సులు కూడా ఇందులో ఉంటాయి. రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఆకర్శిస్తోంది. ఇందులో భాగంగా నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించడానికి సాహసోపేతమైన చర్యలు, విధాన చర్యలు తీసుకుంటున్నది.

అయితే కోరనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కోర్స్‌ఎరా ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ఫోర్స్ రికవరీ ఇన్షియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వాలు, సంస్థలతో కలిసి 3800 కోర్సులను ఉచితంగా అందిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కోర్స్‌ఎరాతో ఒప్పదం చేసుకుంది. దీంతో రాష్ట్రంలోని సుమారు 50వేల మంది నిరుద్యోగులు కోర్స్‌ఎరా అందించే 3800 కోర్సులను నేర్చుకోవచ్చు. కోర్సులు నేర్చుకోవడం మాత్రమే కాకుండా గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చు. నైపుణ్యాలు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ సందర్భంగా టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రేరిత మందగమనాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు బోధించే సరికొత్త డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేయడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. అనంతరం కోర్స్‌ఎరా సిఇఒ జెప్‌మాగ్గియోన్కల్డా మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ప్రస్తుతం ప్రపంచానికే ఒక పెద్ద సవాలుగా మారిందన్నారు. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి ఉన్న పరిస్థితులను మరింత దిగజార్చిందన్నారు. భారతదేశంలో తమ మొట్టమొదటి ప్రభుత్వ భాగస్వామిగా, స్పూర్తినిచ్చే వినూత్న విధానాలు,భవిష్యత్తులో శ్రామిక శక్తిని సృష్టించే నిబద్ధతకు పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేసే అవకాశం లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Free training for Unemployed youth in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News