Tuesday, April 23, 2024

స్నేహితుల విలువ

- Advertisement -
- Advertisement -

 

నాగవరం పాఠశాలలో శరత్ అనే విద్యార్థి 9వ తరగతికి కొత్తగా ప్రవేశించాడు. ఆ పాఠశాలలో ప్రవేశించి 3 నెలలు దాటినా ఏ విద్యార్థితోనూ కలవడం లేదు. ఎవరు మాట్లాడాలని ప్రయత్నించినా వారితో సరిగా మాట్లాడక ముభావంగా ఉండేవాడు. ఆ తరగతిలో మొదటి ర్యాంకు సతీష్ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆటపాటల్లో అందరినీ ఉత్సాహపరచేవాడు. చదువులోనూ అందరినీ ప్రోత్సహించేవాడు. వెనుకబడిన వారిని చులకన చేయకుండా వారికి చదువు నేర్పేవాడు. ఆ సతీష్ ఓరోజు శరత్‌ని కలిసి ‘ఏం శరత్! ఎప్పుడూ ఒంటరిగా ఉంటావు. ఎవరితోనూ స్నేహం చేయవు. స్నేహబంధం ఎంతో విలువైనది. సంతోషాలను పంచుకోవచ్చు. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవచ్చు.

మనకేదైనా ఆపద వస్తే స్నేహితులు ఆదుకుంటారు. మనం ఎంతమంది స్నేహితులను సంపాదిస్తే అంత గొప్ప” అన్నాడు. అప్పుడు శరత్ ఎంతో పొగరుగా ఇలా అన్నాడు “మీలాంటి వాళ్ళు స్నేహితులుగా నాకు అవసరం లేదు. మాకు బోలెడంత డబ్బు ఉంది. ఇక ఆపదలు ఎలా వస్తాయి? ఇక స్నేహితులు అంటావా? నాకు వాట్సప్ లోనూ, ఫేస్ బుక్‌లోనూ వేలాది మంది స్నేహితులు ఉన్నారు. అంతగా ఆపద వస్తే వారు నన్ను ఆదుకుంటారులే.” అని. అతని గర్వపు మాటలకు సతీష్‌కు కోపం వచ్చింది. మూర్ఖునికి హితబోధ చేయడం వృథా అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హఠాత్తుగా శరత్ పాఠశాలకు రావడం మానేశాడు. వారం రోజులు దాటింది. అతడు అంత చురుకైన విద్యార్థి కాడు. ఎవరితోనూ కలవడు. కాబట్టి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏమైందా అని సతీష్ ఆలోచించసాగాడు.

సతీష్ తన స్నేహితులను తీసుకొని, శరత్ ఇల్లు కనిపెట్టి అక్కడికి వెళ్ళాడు. శరత్‌కు వారం రోజులుగా తీవ్రమైన విష జ్వరం. బాగా బక్కచిక్కి పోయాడు. మాట్లాడలేకపోయాడు. ఇద్దరు ముగ్గురు డాక్టర్లకు చూపించినా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదట. అప్పుడు రాము ఇలా అన్నాడు. ’‘మా కాలనీలో మంచి డాక్టర్ ఉన్నాడు. ఎంత మొండి జబ్బునైనా తక్కువ మందులతో చిటికెలో నయం చేస్తాడు.” అని. ఆ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు ఆ మిత్ర బృందం. మూడు రోజులు బడి మానేసి శరత్‌కు సేవలు చేశారు. అతనికి ధైర్యం చెప్పారు.

అతనితో సరదాగా ముచ్చట్లు చెప్పారు. దాంతో శరత్‌కు ప్రాణం లేచి వచ్చింది. తొందరగా కోలుకున్నాడు. స్నేహితుల విలువ అతనికి తెలిసివచ్చింది. వాసు ఇలా అన్నాడు. ‘నీ ఫేస్ బుక్, వాట్సాప్ స్నేహితులు ఎక్కడున్నారు? నిన్ను చూడటానికి ఎంతమంది వచ్చారు?’ అని అడిగాడు. శరత్ సిగ్గు పడ్డాడు. అప్పుడు సతీష్ ఇలా అన్నాడు. ‘ఈ వయసులో మనకు ఫేస్ బుక్, వాట్సాప్ ఛాటింగులు వద్దే వద్దు. అసలు సెల్ ఫోన్లతో మనకు పనే లేదు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవాలి. పుస్తకాలతో చెలిమి చేయాలి. మంచి స్నేహితులను సంపాదించుకొని వారితో కలిసి ఆడుకోవాలి, చదువుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి” అని.  శరత్ స్నేహితుల విలువ తెలుసుకున్నాడు. అందరితో కలిసిపోయాడు. మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టాడు. చదువుపై శ్రద్ధ చూపించాడు.

 

Friendship story in telugu with moral
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News