Friday, April 19, 2024

విద్యాలయాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Full arrangements for Reopening of schools

బడిబాట పేరుతో ర్యాలీలు… ఆంగ్ల మాధ్యమంపై అవగాహన
అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం

హైదరాబాద్ : విద్యాసంస్థలు ప్రారంభించడానికి ముందు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఆదివాసి ప్రాంతాల్లో విద్యాలయాల ప్రారంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, డిడిలు (గిరిజన సంక్షేమం), డిటిడిఓల తో శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల పునఃప్రారంభం దృష్టా కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు సూచనలు చేశారు. బడికి వెళ్లే వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బడిబాట పేరుతో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీలను ఇందులో భాగస్వాములు చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని, ఆశ్రమ పాఠశాలలు అన్నీ ఆంగ్ల మాధ్యమంలో మార్చినందుకు పిల్లల్లో ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ విద్యా సంస్థల్లో మైనర్ రిపేర్స్‌ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ అన్నీ నీటితో, బ్లీచింగ్‌తో శుభ్రపరచాలని, నిత్యావసరాలు ముందే అందేలా సమకూర్చుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులు సిద్దం చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన వస్తువులు, బుక్స్ తో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించి పిల్లలకు అందించాలన్నారు. వర్షాకాలం దృష్టా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వహించకూడదని, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఎఎన్‌ఎమ్‌ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.

సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం కోవిడ్ టీకాకరణ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల చదువుతో పాటు వారి ప్రవర్తనపై ప్రోగ్రెస్ రెడి చేసి తల్లిదండ్రులకు పంపాలని కోరారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గిరిజన బిడ్డలు సీట్లు సాధిస్తున్నారని మంత్రి చెప్పారు. సంక్షేమ హాస్టళ్ళ అభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతోందని అంతే స్థాయిలో విద్యార్థుల చేరికలు పెరిగే విధంగా చూడాలని కోరారు. గిరివికాసం రూరల్ రోడ్డు, ట్రాన్స్‌పోర్టేషన్ ప్రోగ్రామ్, ఇతర ట్రైకార్ కింద చేపట్టిన అన్ని స్కీమ్‌లు వెంటనే పూర్తి అయ్యేట్టు చూడాలన్నారు. గిరిజన గూడాల్లో , తండాల్లో జిసిసి ద్వారా సరకుల సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చూడాలని మంత్రి సూచించారు. గిరిజన ఆవాసాల్లో 3 ఫేస్ విద్యుద్ధీకరణ పనులు ఇంకా ఎక్కడైన అవసరమైతే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సహకారంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ అందించలేని ప్రాంతాలను గుర్తించి అవసరమైతే సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, స్పెషల్ సెక్రటరి శ్రీధర్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News