Home తాజా వార్తలు 105 మంది అభ్యర్థుల జాబితా

105 మంది అభ్యర్థుల జాబితా

list of TRS candidates for Telangana assembly elections

శాసనసభ రద్దు వెంటనే ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్

100 సీట్లలో గెలుపు తథ్యం
సర్వేలన్నీ మాకే అనుకూలం
ప్రతిపక్షాలు ప్రగతి నిరోధకంగా మారాయి
నాలుగున్నరేళ్లల్లో 40 ఏళ్ల అభివృద్ధి
తెలంగాణకు ఎప్పటికీ శత్రువు కాంగ్రెస్సే
అది దరిద్రానికి రిజర్వు బ్యాంకు
కెసిఆర్ భయపడేది ప్రజలకే
మీడియాతో సిఎం

దేశంలోనే పెద్ద బఫూన్ రాహుల్

మనతెలంగాణ / హైదరాబాద్ : ఆరు దశాబ్దాల సమైక్య పాలన తర్వాత అనేక త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామని, ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసి టిఆర్‌ఎస్‌ను ఎన్నుకున్నారని, నాలుగున్న దశాబ్దాల పాలనలో సాధ్యం కాని అభివృద్ధిని తాము నాలుగున్నరేళ్ళలోనే సాధించామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలనూ వంద శాతం అమలుచేశామని, అదనంగా 76 పథకాలను కూడా అమలు చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశా రు. ఇప్పటివరకు తాను చేయించిన 18 సర్వేల్లో వందకంటే ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని తేలిందని వ్యాఖ్యానించారు. ప్రగతి నిరోధకులుగా మారిన విపక్షాలు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయని, అర్థంలేని విమర్శలు చేస్తూ అవాకులు చెవాకులు పే లుతున్నారని, ప్రజాక్షేత్రంలోనే వాటికి సమాధానం చెప్తామని అన్నారు. ప్రగతి చక్రం ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం గవర్నర్‌ను కలిసి వచ్చిన కెసిఆర్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

బాలారిష్టాల నుంచి ప్రగతి వైపు
తెలంగాణను సాధించిన పార్టీగా టిఆర్‌ఎస్‌ను గుర్తించి ప్రజలు 2014 ఎన్నికల్లో ఎన్నుకున్నారని, ప్రజలు దీవిస్తారన్న ధీమాతోనే ఒంటరిగా బలిలోకి దిగామని, రాష్ట్ర అభివృద్ధికి పటిష్ట పునాది ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని కెసిఆర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నామని, ఆరు నెలల పాటు అధికారులే లేరని, అయినా పాలనను గాడిలో పెట్టామన్నారు. ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రులెంతో మంది ప్రశంసించారని, తాజాగా తనకు ‘ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్’ అవార్డు కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ళ పాలనలో నలభైకి పైగా అవార్డులు, గుర్తింపులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గడచిన నాలుగేళ్ళుగా సగటున 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లోనే 21.96 శాతం ఆర్థిక వృద్ధి నమోదైందని తెలిపారు. అనేక వ్యయ ప్రయాసల ప్రయాణంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళుతూ ఉంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని, నీటి పారుదల ప్రాజెక్టుల మీద, దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఏ ఒక్క ఆరోపణలోనూ వాస్తవం లేదని, ఆధారరహితమైన, అర్థరహితమైన, దురుద్దేశపూర్వక విమర్శలు చేస్తూ ప్రగతి నిరోధకులుగా మారాయని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయని కెసిఆర్ ఆరోపించారు. నీటి పారుదల రంగంపై ప్రభుత్వం ఇప్పటికే రూ.25 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి మరే రాష్ట్రమూ కనీసంగా దగ్గర్లో లేవని, పోటీపడే స్థాయిలో లేవని అన్నారు. సాగునీటిరంగంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ఆటంకపర్చడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు పేరుతో రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించారు.

క్రమశిక్షణతోనే ఆర్థిక ప్రగతి
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పటిష్ట పునాదిని వేయాలన్న ఉద్దేశంతో, భవిష్యత్ తరాలకు అభివృద్ధిని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కృషి మొదలుపెట్టిందని, నాలుగేళ్ళళోనే వృద్ధి సాధించడానికి కారణం ప్రభుత్వ నిబద్ధత, క్రమశిక్షణ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న విపక్ష పార్టీ కాంగ్రెస్ దద్దమ్మ అని వ్యాఖ్యానించిన కెసిఆర్ సమైక్య పాలనలో సంప్రదాయ చెరువు లనుధ్వంసం చేశారని అన్నారు. కాకతీయుల కాలంలో అనేక మైనర్ చెరువు లతో సాగునీటి వ్యవస్థ వర్ధిల్లిందని, చెరువులు నాశనమైపోతూ ఉంటే నోరు మెదపదలేదని ఆరోపించారు. ఇప్పుడు సాగునీటిరంగంపై చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగ అభివృద్ధి కోసం చేస్తున్న తపనలో అధికారులు సైతం మనస్ఫూర్తిగా పాల్గొన్నారని, అర్ధరాత్రి వరకూ జరిగే చర్చల్లో లీనమయ్యారని, బాధ్యతాయుతంగా పనిచేశారని ప్రశంసించారు. కొన్ని వేల గంటల పాటు సాగునీటిరంగంపై చర్చలు జరిగాయని, దేశ చరిత్రలోనే అద్భుమైన ప్రాజెక్టుగా ఉన్న కాళేళ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా కేంద్ర జల సంఘం ఛైర్మన్, ఇంజనీర్లు వచ్చి చూశారని, కేంద్ర ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారని గుర్తుచేశారు.

ఏది చేసినా రాష్ట్రం, ప్రజల మేలు కోసమే
ఇరవై ఏళ్ళుగా తన చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసునని, తాను ఏది చేసినా రాష్ట్రం కోసం, ప్రజల మేలు కోసమే చేస్తాననే నమ్మకం ప్రజల్లో ఉందని కెసిఆర్ వ్యాఖ్యానిం చారు. ఎప్పుడూ తాను రాష్ట్రానికి చెడు కోరుకోనని, వంద శాతం తెలంగాణ ఉజ్జల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకుంటానన్న సంగతి ప్రజలకు తెలుసని అన్నారు. రైతే కేంద్ర బిందువుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నానని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ప్రజలు ఏనాడూ డిమాండ్ చేయలేదని, ఎలాంటి ధర్నాలు చేయలేదని, కానీ సంక్షేమం కోసం తాను చేపట్టినవేనని గుర్తుచేశారు.

సమైక్య రాష్ట్రంలో బాధలు ఇప్పుడు లేవు
సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోసం ఆందోళనల మొదలు యూరియా, విత్తనా లు, ఎరువులు అన్నింటికీ ధర్నాలు, క్యూలు, యుద్ధాలు, లాఠీఛార్జిలు జరిగాయని, కానీ తెలంగాణ ఏర్పడిన ఈ నాలుగున్నరేళ్ళలో అవి మచ్చుకు కూడా లేవన్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తెలంగాణ ప్ర జలు మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా నిద్రపోతున్నారని, కర్ఫూలూ మ చ్చుకు కూడా లేవన్నారు. మత ఘర్షణలు, శాంతిభద్రతల సమస్య లాంటివేవీ లేవన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత ఉందని అన్నారు.

సందర్భోచితంగా ప్రసంగాలు
ప్రగతి నివేదన సభలో తాను చేసిన ప్రసంగంలో పస లేదని తరచూ విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయని, సందర్భానికి తగినట్లుగా ప్రసంగించడం తన అలవాటని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రగతిని నివేదించడం వరకే ఆ సభలో పరిమితమయ్యానని, తాను ఏ సందేశం ఇవ్వదల్చుకున్నానో దానికే కట్టుబడి ఉన్నానని, అసందర్భంగా ప్రసంగించడం సముచితం కాదని వివరణ ఇచ్చారు. అసెంబ్లీ రద్దు తర్వాత ‘కెసిఆర్ పీడ విరగడైపోయింది’ అంటూ విమర్శలు చేస్తున్న విపక్ష నేతల చరిత్ర ప్రజలకు తెలుసునని, ఎవరి పీడ విరగడ అవుతుందో ప్రజలు రానున్న ఎన్నికల్లో తేలుస్తారని అన్నారు.

కాంగ్రెస్ నేతల నోళ్ళను ఫినాయిల్‌తో కడగాలి
ప్రభుత్వం చేస్తున్న పనులను జీర్ణించుకోలేక, ఓర్చుకోలేక దురుద్దేశపూ ర్వ కంగా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని, అవాకులు చెవాకులు పేలుతున్నారని కాంగ్రెస్‌పై కెసిఆర్ ధ్వజమెత్తారు. అర్థంలేని విమ ర్శలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఆ పార్టీ నేతల నోళ్ళను ఫినా యిల్‌తో కడగాలని అన్నారు. ప్రజల్లో తేల్చుకునేందుకే తాము సిద్ధమయ్యాని అన్నారు. ప్రతీ నియోజకర్గానికి వెళ్తానని, యాభై రోజుల్లో వంద బహి రంగసభల్లో మాట్లాడానని అన్నారు.

వంద సీట్లలో 50% ఓట్లు మాకే
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ళ అభివృద్ధి పట్ల ప్రజల స్పందనను తెలుసుకోడానికి 18 సర్వేలు చేయించానని, ఇందులో 82 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీకి 60% పైగా ప్రజల మద్దతు లభించిందని, వంద నియోజకవర్గాల్లో 50% పైగా మద్దతు ఉన్నట్లు తేలిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమకు దగ్గర్లో కూడా లేవని అన్నారు. తప్పకుండా వంద కంటే ఎక్కువ స్థానాల్లోనే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అమలవుతున్న పథకాల్లో చాలా వరకు ముగింపు దశలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని, ఆ పని కొనసాగుతూనే ఉంటుందన్నారు.

రాహుల్‌గాంధీ ఓ బఫూన్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశంలోనే ఒక పెద్ద బఫూన్ అని కెసిఆర్ అభివర్ణించారు. ప్రధాని మోడీని ఆలింగనం చేసుకోవడంపై వచ్చిన విమర్శలు దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ‘గాంధీ’ కుటుంబం నుంచి వచ్చిన ఒక వారసుడేనని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఢిల్లీకి బానిసలుగా ఉండరని, స్వరాష్ట్రంలోనే నిర్ణయాలు జరగాలన్న ఉద్దేశంతో ఎప్పటికీ తెలంగాణవాదులుగానే ఉంటారని అన్నారు.

ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ
మజ్లిస్ పార్టీ గురించి కెసిఆర్ వ్యాఖ్యానిస్తూ, టిఆర్‌ఎస్‌కు అది ఎప్పటికీ ఫ్రెండ్లీ పార్టీగానే ఉంటుందన్నారు. ఆ పార్టీ పోటీచేసే స్థానాల్లో తమ అభ్యర్థులు ఫ్రెండ్లీగానే ఉంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ళకే అస్థిరం చేయ డానికి జరిగిన కుట్రను ఆ పార్టీకి చెందిన ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తనకు ఫోన్ ద్వారా సమాచారం అందించి తెలంగాణను కాపాడారని అన్నారు. స్వచ్ఛందంగానే ఆ పార్టీ నుంచి తమకు మద్దతు ఉందని అన్నారు. అన్ని సెక్షన్ల ప్రజలను అక్కున చేర్చుకునే వంద శాతం సెక్యులర్ పార్టీ తమది అని వ్యాఖ్యానించారు.

హామీలు ఇవ్వకూదనే…
ప్రగతి నివేదన సభలో తన ప్రసంగం చప్పగా, పేలవంగా ఉందని విమర్శలు వచ్చాయని, కానీ ఆ వేదిక సందర్భానికి అనుగుణంగానే తాను మాట్లాడాల్సి వచ్చిందని కెసిఆర్ వివరణ ఇచ్చారు. ఆ వేదిక మీద నుంచి తాను ఎన్నికలు హామీలను ఇవ్వవచ్చుగానీ, అప్పుడు తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని, ఇచ్చిన హామీలకు వెంటనే చట్టబద్ధత ఏర్పడి ఈ హయాంలోనే అమలుచేయాల్సిన పవిత్రత ఉంటుందని అన్నారు. కానీ తదుపరి ప్రభుత్వంలో అమలుచేయాల్సిన హామీలను ముఖ్యమంత్రి హోదాలో ఆ వేదిక మీద నుంచి ఇవ్వలేనని, అందువల్లనే వాటి ప్రస్తావనే చేయలేదని స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్ళపైన తనకు పూర్తి అవగాహన ఉందని, దానికి తగినట్లుగా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంటామన్నారు.

పదేళ్ళ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చాం
పదేళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలకంటే నాలు గున్నరేళ్ళలో తాము ఇచ్చినవే ఎక్కువ అని కెసిఆర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇప్పటికే చాలా భర్తీ అయ్యాయని, మిగిలిన ప్రక్రియ కొన సాగుతూ ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపొందించిన తర్వాత అనేక కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని, వాటి ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కలిగాయని అన్నారు.

కాంగ్రెస్ బలమెంతో ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది
కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలమెంతో రాష్ట్రంలో ఈ నాలు గున్నరేళ్ళలో జరిగిన ఉప ఎన్నికల్లోనే తేలిపోయిందని కెసిఆర్ వ్యా ఖ్యానించారు. నారాయణఖేడ్, పాలేరు శాసనసభ నియోజకవర్గాలు కాంగ్రెస్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నవని, అనారోగ్య కారణాలతో సిట్టింగ్ ఎంఎల్‌ఎలు చనిపోతే వారి తరఫున కుటుంబ సభ్యులే పోటీచేశారని, కానీ ఆ రెండు స్థానాలనూ ఆ పార్టీ గెలి పించుకోలేకపోయిందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ బలమెంతో తేలిపోయిం దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల బలం పుంజుకుంటోందని వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ఒక్క రాష్ట్రంలోనైనా ఇరవై ఎంపి స్థానాలను గెల్చుకుంటామని ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ఉందా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఫలానా రాష్ట్రంలో గెల్చుకుంటామని ఇప్పటికైనా చెప్పగలదా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఉద్యోగులకే ఎక్కువ వేతనం
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఉద్యో గులకు వేతనాలను ఇస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులకు వస్తున్న జీతంకంటే ఎక్కువే ఇస్తున్నామన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కారణంగానే 30% అలవెన్సును ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారు.

కెసిఆర్ భయపడేది ప్రజలకే
ప్రధాని మోడీ వత్తిళ్ళకు, దేశవ్యాప్తంగా ఆయన ప్రభావం పడిపోతూ ఉందన్న భయానికే కెసిఆర్ ముందస్తు ఎన్ని కలకు వెళ్తున్నారంటూ వస్తున్న విమర్శలను ఆయన ప్రస్తా విస్తూ, కెసిఆర్ ఎవ్వరికీ భయపడరని, ఆయన ఎంత మొండి వ్యక్తో ప్రజలకు బాగా తెలుసని, కేవలం ప్రజలకు మాత్రమే భయపడతాడని అన్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలకు కూడా కెసిఆర్ భయపడతాడా అని ప్రశ్నించా రు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొ న్న కెసిఆర్‌కు కాంగ్రెస్ ఒక లెక్కా అని ప్రశ్నించారు.

ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నా
ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తాను మొదటి నుంచీ ఏ ఆ లోచనతో ఉన్నానో ఇప్పటికీ అదే వైఖరికి కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, అ వసరాల విషయంలో స్పష్టమైన అవగాహన ఉందని, స మాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలనే తాను కోరుకుంటున్నానని, నీతి ఆయోగ్ సమావేశంలో సైతం తాను ఫెడరల్ స్ఫూర్తి గురించి వ్యాఖ్యానించానని కెసిఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరే అన్ని అధికారాలూ కేంద్రీకృతం కావడం మంచి పద్ధతి కాదని ఆ సమావేశంలోనే వ్యాఖ్యా నించానని, ఈ విధానం మారాలని, అందుకే తాను ‘ఫెడ రల్ ఫ్రంట్’కు బీజం వేశానని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు. తాను ప్రస్తావిస్తున్న ఫ్రంట్ కొన్ని పార్టీల కూటమి కాదని, రాష్ట్రాల హక్కులకు ముందుకొచ్చే శక్తుల సమూహమని అన్నారు. కేంద్రం దగ్గర ఉన్న అధికారాలన్నీ రాష్ట్రాలకు బదిలీ కావాల్సిందేనని, ఇందులో మలో ఆలోచనే లేదన్నారు. తాను ప్రతిపాదించిన ఫ్రంట్ చాలా బలమైనదని, ఎప్పటికీ నిలిచి ఉండేదని అన్నారు. కేంద్రం దగ్గర ’కన్‌కరెంట్’ లిస్టులో ఉన్న అంశాలన్నీ రాష్ట్రానికి బదిలీ కావాల్సిందేనని అన్నారు.

కాంగ్రెస్‌తో పొత్తు చంద్రబాబుకే నష్టం
కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంపై కెసిఆర్ వ్యాఖ్యానిస్తూ అది చంద్రబాబుకే నష్టమని అన్నారు. కృష్ణా, గోదావరి జ లాల విషయంలో తెలంగాణకు నష్టం కలిగిస్తూ, హక్కులకు విఘాతం కలిగిస్తూ కుట్రలు ప న్నారని, అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు కుదు ర్చుకుంటే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తు జుగుప్సాక రమైనదని వ్యాఖ్యానించారు. జనం ఈ రెండు పార్టీల పొ త్తు విషయంపై చీదరించుకుంటున్నారని అన్నారు. కెసిఆర్ తన లక్షంలో విజయం సాధించారని, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు.

కేంద్రానికి అంశాలవారీ మద్దతు
కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నెరపుతున్నది అంశాలవారీ మద్దతు మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా కేంద్రంతో సఖ్యతగా ఉంటోందని అన్నారు. ఏనాడూ ఎన్‌డిఏ కూటమిలో టిఆర్‌ఎస్ భాగస్వామి కాదని, ఆ పార్టీతో ఎలాంటి పొత్తూ లేదని స్పష్టం చేశారు. అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కోరిక మేరకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. సైద్ధాంతికంగా తమ పార్టీ వంద శాతం సెక్యులర్ అని, అయితే ప్రధానిగా ఉన్న మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను కలిసి రాష్ట్ర అవసరాలను సాధించడంలో సంప్రదింపులు జరపడంలో ఎలాంటి తప్పూ లేదని అన్నారు.