Thursday, March 28, 2024

కామన్ గుడ్ ఫండ్ కింద ఆలయాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

చారిత్రాత్మకమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు
అవసరమైన చోట నిర్మాణాలతో పాటు దేవాలయాలకు మరమ్మతులను
సుమారు రూ.300 కోట్ల కేటాయింపు


మనతెలంగాణ/ హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో ఆలయాల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చారిత్రక ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని వాటికి నిధులను కేటాయిస్తోంది. ఆదాయం ముఖ్యం కాదని, ఆలయాల చారిత్రాత్మకతను నేటి తరానికి తెలిసేలా ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలను గుర్తించి దేవాదాయ శాఖ అధికారులు జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాల జాబితా ఆధారంగా ఆయా ఆలయాల మరమ్మతులతో పాటు అక్కడ అదనపు నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఉమ్మడి జల్లాల ప్రాతిపదికన ఆదిలాబాద్‌లో కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలలోని ఆలయాలకు అధికంగా నిధులను ప్రభుత్వం కేటాయించింది. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగినది యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోయేలా ప్రభుత్వం నిర్మాణం చేస్తోంది.
దేవాదాయ, ధర్మదాయ శాఖ కింద 6 నుంచి7 వేల ఆలయాలు.

సర్వశ్రేయో (కామన్ గుడ్ ఫండ్) నిధి కింద చేపడుతున్న పునరుద్ధరణ పనుల్లో పలు ఆలయాల్లో అవసరమైన చోట నిర్మాణాలను చేపట్టడంతో పాటు దేవాలయాలకు మరమ్మతులను చేపట్టింది. అవసరమైన చోట దేవతామూర్తుల విగ్రహాలను సైతం కొత్తగా కొనుగోలు చేయడంతో పాటు పాత విగ్రహా మూర్తులను అందంగా తీర్చిదిద్దేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయాల పునరుద్ధరణలో భాగంగా దేవతామూర్తుల విషయంలో స్థపతి (శిల్పి), డిప్యూటీ స్థపతులతో పాటు వాస్తు పండితులతోనూ సమాలోచనలు జరిపిఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. దేవాదాయ, ధర్మదాయ శాఖ కింద ఇప్పటికే 6 నుంచి7 వేల ఆలయాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని అధికారులు తెలిపారు. మాములుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలంటే స్థానికంగా అందించే మ్యాచింగ్ ఫండ్ (20శాతం) కాకుండా 80 శాతం నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రస్తుతం కొన్ని ఆలయాల్లో మ్యాచింగ్ ఫండ్ సమకూరకపోవడంతో 100 శాతం నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని అధికారులు తెలిపారు.

దాదాపు 831 ఆలయాల అభివృద్ధికి చర్యలు

రాష్ట్రంలో సర్వశ్రేయో నిధి కింద జీర్ణావస్థలో ఉన్న దాదాపు 831 ఆలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం సుమారుగా రూ.300 కోట్లను విడుదల చేసింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది. చాలా పురాతన ఆలయాల్లో పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపట్టిన అధికారులు వాటిని త్వరతగతిన పూర్తి చేశారు. మొదటగా 500 దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయగా మిగతా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని ఆలయాల్లో మాత్రం అరకొర పనులు మిగిలిపోయాయని వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఆలయాల ప్రహారీ గోడలు, పార్కింగ్, సిసి కెమెరాల ఏర్పాటుతో

ఛాయాసోమేశ్వరాలయం (నల్లగొండ), శంభులింగేశ్వరాలయం (నల్లగొండ), గణపురం (వరంగల్) దేవాలయాల సముదాయాలు నాగులపాటి అన్నారం, అలంపూర్ (జోగులాంభ) దేవాలయాల్లో పునరుద్ధరణ పనులతో పాటు పలు దేవాలయాల్లో గోపురాలు, ద్వారాలు, ధ్వజస్థంబాలకు సంబంధించి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఆలయాల ప్రహారీ గోడలు, పార్కింగ్, సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు ఆలయాల భూములకు నరిరక్షణ చర్యలు చేపట్టారు. భక్తుల కోరిక మేరకు సైతం పలు పురాతన ఆలయాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం నిర్మాణ పనుల విషయంలో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులతో ఒక కమిటీని సైత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్న తీరుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

చరిత్రలో నిలిచేలా యాదాద్రి నిర్మాణం

చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి నిర్మాణం జరపాలని సిఎం కెసిఆర్ నిర్ణయించగా దానికి సంబంధించి ఇప్పటికే 97 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు కెసిఆర్ అధికారులతో యాదాద్రి కట్టడంపై సమీక్ష జరపడంతో పాటు వారికి తగిన సూచనలు, సలహాలను ఇస్తున్నారు. భవిష్యత్ తరాలకు కొలమానంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎటూ చూసిన తెలంగాణ సంస్కృతీ, సాంస్కృతీక చిహ్నాలే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. రెండువేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా, ఈ నిర్మాణానికి మూడున్నర లక్షల టన్నుల కృష్ణశిల వినియోగిస్తున్నారు. 4.5 ఎకరాల్లో దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని శాస్త్రాలకు అనుకూలంగా ఈ నిర్మాణాన్ని జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం మార్చిలో ఈ ఆలయాన్ని పునఃప్రారంభించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News