Friday, April 19, 2024

జి-7 దానం!

- Advertisement -
- Advertisement -

G7 countries Supply of 100 crore vaccine doses

 

ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్‌లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా ఈ నేతలు రెండేళ్ల తర్వాత ఇప్పుడు స్వయంగా ముఖాముఖి సమావేశానికి హాజరయ్యారు. అమెరికాలో ఒంటెద్దు పోకడల ట్రంప్ హయాం అంతరించిన తర్వాత ఏర్పాటైన ఈ సమావేశంలో అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 11 నుంచి 13వరకు జరుగుతున్న ఈ భేటీ వల్ల ప్రపంచ సంపన్నులకు మేలు జరుగుతుందే గానీ సాధారణ ప్రజానీకానికి అంతగా ఒరిగిదేమీ ఉండదని ముందే జోస్యాలు వెలువడ్డాయి. ట్రంప్ మాదిరిగా కాకుండా అంతర్జాతీయ సమస్యలపై అందరిలో ఒకరై వారిని కలుపుకొనిపోయే వైఖరిని బైడెన్ ప్రదర్శించడం గమనించవలసిన విషయం. జి7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలకు సభ్యత్వం ఉన్నది. వీరి ప్రస్తుత సమావేశానికి ముందే ఈ దేశాల బృందం ప్రపంచ ప్రజలకు 100 కోట్ల టీకా డోసులను సరఫరా చేయనున్నట్టు ప్రచారం అయింది.

దీనిపై విమర్శలు దూసుకొచ్చాయి. అమెరికా ఇస్తానని ముందే చెప్పిన 10కోట్లు, బ్రిటన్ ఇవ్వనున్న 50కోట్ల డోసులు ఇందులో భాగంగా ఉంటాయి. ఇది ఏమూలకూ చాలదని ప్రజాప్రతిఘటన సంఘాలు పెదవివిరుస్తున్నాయి. 100 కోట్ల డోసులతో సరిపెడితే దానిని ఈ కూటమి వైఫల్యంగా పరిగణించవలసి వుంటుందని ఆక్స్‌ఫామ్ ఆరోగ్య విధాన వ్యవహారాల మేనేజర్ అన్నా హెరియట్ అన్నారు. ప్రపంచానికి ఇప్పుడు ఉన్న పళంగా 1100కోట్ల టీకా డోసులు కావాలని, అందులో ఈ 100కోట్లు లెక్కకు రాదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిపై గల యాజమాన్య హక్కులను (పేటెంట్) ప్రపంచమంతటా ఎత్తివేయాలని సూచిం చారు. ఇప్పటి మహా సంక్షోభం ఇటువంటి దానధర్మాలతో తొలగదన్నారు. టీకాల ఉత్పత్తి రహస్యాలను, శాస్త్రీయ మర్మాలను ప్రపంచమంతటా గల యోగ్యులైన తయారీ దారులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.

లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వ సైన్స్ , ఉదార సహాయ, వదాన్య సంస్థ డైరెక్టర్ అలెక్స్ హ్యరీ కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు తక్షణమే ప్రపంచ ప్రజలందరికీ అందాలని, ఈ సంవత్సరం చివరినాటికి కాదని అన్నారు. ప్రపంచం మొత్తం సంపదలో సగం కంటే ఎక్కువ ఉన్న ఈ ఏడు సంపన్న దేశాల బృందం గతేడాది నుంచి కొవిడ్ దేశదేశాల ప్రజల ప్రాణాలను అవలీలగా కబళిస్తుంటే తీరిగ్గా ఇప్పుడు సమావేశమై 100కోట్ల డోసులు విదిలిస్తామన్న సంకేతాలివ్వడం హాస్యాస్పదం. ఇంతకీ కనీవినీఎరుగని ఆరోగ్య సంక్షోభంతో పోరాటంలో అన్ని దేశాల ప్రజలను చేర్చుకుని సంఘటితంగా ఎదుర్కొనే స్థితిని సమాయత్తం చేయడానికి బదులు అరకొర సాయాలతో చేతులు దులుపుకోవడం ఎంతమాత్రం సముచితమైన పరిణామం కాదు. అందరు కలిస్తేనే పెళ్లి , జనాభాపరంగా పెద్ద దేశాలైన ఇండియా, చైనా, రష్యాలను కూడా కలుపుకున్నప్పుడే అది ప్రపంచ కళ్యాణం అవుతుంది. అందుచేత ఈ జి7 అసంబద్ధమైనదని చెప్పకతప్పదు.

దాని నిర్ణయాలెప్పుడూ ఈ దేశాల వ్యాపార దిగ్గజాలకు మార్కెట్లను అన్వేషించడమే పనిగా ఉంటాయి. ఉన్న పళంగా ఇవి ప్రజల కోసం కార్చే కన్నీళ్లు నిజమైనవని భావించరాదు. అవి ముమ్మాటికీ మొసలికన్నీళ్లే. అన్ని విధాలా అమెరికాతో ఢీ అంటూ పోటీపడుతున్న చైనాను దాని తలసరి ఆదాయం తక్కువని చూపి కూటమిలోకి ప్రవేశించనీయడం లేదు. రష్యాను ఒకదశలో సభ్యదేశంగా చేర్చుకున్నారు. కాని క్రిమియా సందర్భంగా దాని వైఖరిని తప్పుబట్టి తొలగించారు. సువిశాల మార్కెట్ ఉన్న భారత్‌ను తమ లాభాలకు వాడుకుంటూనే గొప్ప దేశమని దువ్వుతూనే ఈ కూటమిలో దానిని చేర్చుకోవడం లేదు. కొవిడ్ సంక్షోభం ఇది అది అనకుండా అన్ని దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అమెరికా, బ్రిటన్, యూరప్‌లలో కూడా లక్షలాది శవాలు తేలాయి. గాలిలో వ్యాపించే ఈ ప్రళయ వైరస్ ప్రపంచమంతటిని ఒకేస్థాయిలో దెబ్బతీస్తున్నప్పుడు అగ్రరాజ్యాలం, సంపన్నదేశాలం అని జబ్బలు చరుచుకునే జి7వంటివి ఎప్పుడో, ఎంత గొప్పగానో అంతర్జాతీయ స్థాయి పోరాట విధానాన్ని రూపొందించి వ్యాక్సిన్లు, ఆక్సిజన్ వంటివి సకాలంలో విశ్వజనులందరికీ చేరేటట్టు చూసి ఉండవలసింది.

యుద్ధాలకైతే అరక్షణం ఆగకుండా పరగులు తీసే ఈ దేశాలు మూడవ ప్రపంచంలోని వనరులను దోచుకోవడానికి పోటీపడే ఈ శక్తులు ఇంతటి సంక్షోభంలో ప్రపంచ పోరాట బృందాన్ని నిర్మించకపోవడం వారి నైచ్యానికి నిదర్శనం. ఇటువంటి విశ్వ వేదిక మీద ఆకలి వల్లనో, వైరస్‌ల వల్లనో, యుద్ధాల వల్లనో అమాయక ప్రజలను అనునిత్యం పిట్టల్లా రాలిపోవడం వింతకాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News