Home ఎడిటోరియల్ మహాత్మునికి దేశభక్తి పరీక్ష…

మహాత్మునికి దేశభక్తి పరీక్ష…

Gandhi

 

ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జాతిపితగా పేరొందిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. గాంధీ, గాడ్సేలలో ఎవరు గొప్ప అనే తర్కం పెరిగి దేశంలో భిన్నాభిప్రాయాలు పొడసూపాయి. గాంధీపట్ల లోలోపల వ్యతిరేకతను దాచుకున్న హిందుత్వ వాదులు బహిరంగంగానే దానిని వ్యక్తపరచేందుకు ముందుకొస్తున్నారు. దేశ విభజన సమయంలో ముస్లింలను బుజ్జగించడమే గాంధీ తప్పటడుగు అని ఆయన బతికి ఉంటే దేశం మరింత నష్టపోయేదన్న వాదన మొదలైంది.
బిజెపికి పండిత్ నెహ్రూ అంటే మొదటి నుండి చుక్కెదురే. ప్రథమ ప్రధానిగా ఆయనకున్న పేరును గమనించి నెహ్రూను విమర్శించేందుకు భాజపా సాహసించలేదు.

అయితే గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణం, ప్రతిపాదన, ఆవిష్కరణ అన్ని సందర్భాల్లోనూ ప్రధాని మోడీ అన్యాపదేశంగా నెహ్రూను పటేల్‌తో పోల్చుతూ పటేల్‌ను ముందుకు జరిపి నెహ్రూ స్థానాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే దేశ పురోగతి మరోలా ఉండేదని అనేసే దాకా వెళ్లారు. నెహ్రూపై బిజెపికి కోపం ఈనాటిది కాదు. ఓ రకంగా బిజెపి మూల పార్టీ ఆవిర్భావానికి పరోక్షంగా నెహ్రూయే కారణం. భారతీయ జనసంఘ్ స్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని నెహ్రూ తొలి కేబినెట్‌లో పరిశ్రమల మంత్రిగా పని చేశారు. ముఖర్జీ 1943 నుండి 1946 దాకా అఖిల భారతీయ హిందూ మహాసభకు అధ్యక్షులుగా ఉన్నారు. గాంధీ హత్య కేసులో శిక్షపడిన వారు ఈ హిందూ మహా సభ సభ్యులే.

బిజెపి వాళ్లు రద్దు చేసి తీరుతామంటున్న ఆర్టికల్ 370 యే నెహ్రూ ముఖర్జీల మధ్య వివాదానికి కారణమైంది. దేశంలో ఒక రాష్ట్రానికి సొంత జెండా, విడిగా ప్రధాని ఉండకూడదంటూ శ్యాంప్రసాద్ లోక్‌సభలో 26 జూన్ 1952 నాడు తన గొంతు వినిపించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ జమ్ము ప్రజాపరిషత్ నేతృత్వంలో ఆందోళన చేపట్టి ఆ సత్యాగ్రహంలో గుండె పోటుతో చనిపోయారాయన.

నెహ్రూ తర్వాత గాంధీ పట్ల ప్రజలకున్న గౌరవాన్ని తెగ్గోసే ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు దేశం గాంధీని, నెహ్రూను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న వారి చేతుల్లో ఉంది. విచిత్రమేమిటంటే నెహ్రూనుగాని, ఇందిరనుగాని ఏమైనా అంటే మాట్లాండేందుకు కాంగ్రెస్ నాయకులున్నారు కాని గాంధీకి ఏ వర్గమూ, రాజకీయ పార్టీ లేదు. అప్పుడప్పుడు వైశ్యులు ఖండించడం గాంధీ దేశంలో కోల్పోతున్న ప్రభకు నిదర్శనం. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక చోట బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం తొలగించి అవమాన పరిస్తే దళిత బహుజన సంఘాలు, నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలు నిర్వహిస్తున్నారు. అదే ఒక చోటు నుంచి గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే దానిపై ఆందోళన చేపట్టేవారుంటారా అన్న అనుమానం వేస్తుంది. బిజెపి, కాంగ్రెసులకుగాని, మరే ప్రాంతీయ పార్టీలకుగాని అంబేడ్కర్ అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. అయితే దేశంలోని దళిత ఓట్లకు ఆశపడి అంబేడ్కర్ ముందు తల దించుతున్నారు.

ఈ మధ్య కాలంలో గాంధీని కాల్చి చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడుగా కీర్తింపబడడం మొదలైంది. గాంధీ దేశభక్తిని నిరూపించుకునే అవసరం రావడం ఓ విచిత్రమైన పరిస్థితి. గాంధీ విగ్రహాలు దేశం మూలమూలనా ఉన్నాయి. రూపాయి నోటుపై గాంధీ బోసినవ్వుల బొమ్మ ఉంటుంది. ఎన్నో సంస్థలకు ఆయన పేరు పెట్టారు. ఆయన జన్మదినం దేశ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించారు. ఇంతటి గౌరవం దేశంలో మరే నేతకూ దక్కలేదు. ఇప్పుడు ఆయనను తప్పుపడుతూ చంపిన వాడే గొప్ప వాడనే వాదన తెరపైకి వచ్చింది.

బిజెపి, హిందుత్వ వర్గాలకు గాంధీపట్ల సదభిప్రాయం లేకున్నా ఈ ఎన్నికల్లో మాత్రం గాంధీ గాడ్సే చర్చకు శ్రీకారం చుట్టింది కమల హాసన్. ఆయన ఈ మధ్య కాలంలో స్థాపించిన రాజకీయ పార్టీ మక్కల్ నీధి మయామ్ తమిళనాడులోని 4 అసెంబ్లీ స్థానాలకు మే 19న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపింది. ప్రచారంలో భాగంగా మే 12 తేదీన కమల్ హాసన్ ఓ చోట అదీ ముస్లిం జనాభా అధికంగా ఉన్న అరవకుంబి సభలో స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది నాధూరాం గాడ్సే అని అన్నారు.

ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి అన్నాడోకాని భాజపా నేతలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తమిళనాడు మంత్రి ఒకరు కమల్ నాలుక తెగ్గోస్తానని ప్రకటించారు. మే 16న ప్రజ్ఞా ఠాగూర్‌ను ఒక విలేకరి కమల్ మాటల్ని ప్రస్తావిస్తూ దీనిపై మీ కామెంట్ ఏమిటని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఆమె ‘నాథూరాం గాడ్సే దేశభక్తుడు, దేశభక్తుడిగానే ఉంటాడు. ఆయనను తీవ్రవాది అన్నవారికి ఈ ఎన్నికల ఫలితాలే జవాబు చెబుతాయి’ అని అంది. ఒక దేశ భక్తుడు మరో దేశభక్తుడ్ని చంపడు కాబట్టి గాడ్సే దేశభక్తుడైతే మరి గాంధీ ఎవరు అనే ప్రశ్నకు ప్రజ్ఞ్ఞనే సమాధానం చెప్పాలి. లేదా పరోక్షంగా గాంధీని దేశ ద్రోహిగా చిత్రస్తే దానికి వివరణ ఈయాలి. గాంధీని విమర్శించేందుకు ఇది సమయం, సందర్భం కాదన్నట్లు మోడీ, అమిత్ షాలు ప్రజ్ఞ వ్యాఖ్యలను క్షమించలేమన్నారు.

స్వయంగా ప్రధాని మోడీకి జాతిపితగా కీర్తింపబడుతున్న గాంధీపై ఏ మాత్రం గౌరవముందో ఆయన ట్వీట్‌ను పరిశీలిస్తే తెలిసిపోతుందని ఈ మధ్య ఆల్ట్ న్యూస్ అనే వెబ్ పత్రిక కొన్ని విషయాలు బయటపెట్టింది. ప్రధాని మోడీ అక్టోబర్ 2, 2017 నాడు గాంధీని తలుచుకుంటూ తలవంచి ఆయనకు వినమ్రంగా నివాళిని అర్పించుకుంటున్నాను అని తన ట్విట్టర్‌లో పెట్టాడు. గాంధీ పట్ల అంత విధేయతను జీర్ణించుకోని మోడీ ట్వీట్ అనుచరులు తమ తమ అభిప్రాయాలను వెంటనే తెలియజేశారు. వాటిని చదివితే మోడీ అనుచరుల్లో మహాత్మా గాంధీపట్ల ఎంత ద్వేషం ఉందో తెలిసిపోతుంది.

గాడ్సే ఈజ్ గాడ్ అని ఒకరు ట్వీట్ చేయగా, పుట్టుకతో గాంధీ ఇంటి పేరుగల ఓ మహిళ తన పేరు చివరన తిట్టు ఉండడం సహించలేకపోతున్నాను, దానికి బదులుగా నా ఇంటి పేరు మోడీగాగాని గాడ్సేగా గాని ఉంటే ఎంత బాగుండు అని పోస్టు చేసింది. ఎవరు ఎవరినీ ఏ కారణం లేకుండా చంపరు అని ఒక కామెంట్. గాడ్సేకు దేశంపట్ల అపారమైన భక్తి ఉండబట్టే ముస్లింలను బుజ్జగిస్తున్న గాంధీని చూడలేక చంపేశాడు అని ఒకరు. పార్లమెంట్‌లో గాంధీ బొమ్మ పక్కన గాడ్సే పటం కూడా పెట్టాలని మరోకరి డిమాండ్. రాముడు రావణున్ని చంపాడు, కృష్ణుడు కంసున్ని చంపాడు, గాడ్సే గాంధీని చంపాడు అని ఒక వ్యాఖ్య. ఇలా గాంధీకి వ్యతిరేకంగా గాడ్సేను సమర్థిస్తూ ఎన్ని ట్వీట్లు తన ట్విట్టర్‌లో వచ్చినా మోడీ దేనిపైనా వ్యాఖ్యానించకపోవడం, ఖండించకపోవడం చూడవచ్చు.

బిజెపి గొప్ప దేశ భక్తుడుగా కీర్తించే వీర్ సావర్కర్ కూడా గాంధీ హత్య కేసులో నిందితుడే. ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో ఆయన్ని విడుదల చేయడమైందని జస్టిస్ జిడి ఖోస్లా 1965 లో ది మర్డర్ ఆఫ్ మహాత్మా’ పుస్తకంలో పేర్కొన్నారు. జస్టిస్ ఖోస్లా గాంధీ హత్య కేసు విచారణ జరిపిన బెంచిలో ఓ న్యాయమూర్తిగా వ్యవహరించారు.
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ మందిర ప్రాంగణంలో 19 మే నాడు హిందూ మహాసభ సభ్యులు గాడ్సే ఫోటో పెట్టి ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. గాంధీని ఏ పరిస్థితుల్లో గాడ్సే చంపాడో తెలుపుతూ మరాఠీలో ‘హే రాం నాథూరాం’ అనే నాటకం కూడా తయారైంది.

పుస్తకాలు, సినిమాలు ఎన్నయినా రావచ్చు. ఈ హత్యపై చర్చించే అధికారం అందరికీ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా గౌరవింపబడుతున్న ఓ భారతీయుడిని మనమే కించపరిస్తే పోయేది గాంధీ పరువు కాదు, మనది, దేశానిది.

Gandhi’s Patriotism to Insult