Home ఆదిలాబాద్ ఇచ్చోడ కేంద్రంగా నకిలీ విత్తన దందా…

ఇచ్చోడ కేంద్రంగా నకిలీ విత్తన దందా…

 fake Seeds

 

ఆదిలాబాద్ : పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న నకిలీ విత్తన ముఠా మాత్రం తన పనిని కానిచ్చేస్తుండడం జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. జిల్లా కేంద్రంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరంలోని ఇచ్చోడ కేంద్రంగా ఈ ముఠా తమ దందాను కొనసాగిస్తూ రైతులను నట్టేట ముంచే పనిలో పడింది. గుజరాత్‌లో తయారవుతున్న నిషేదిత బీజీ-3 విత్తనాలు అక్కడి నుంచి ఇచ్చోడకు నేరుగా తెప్పించి మారుమూల గిరిజన గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

బీజీ-3 విత్తనాలు విత్తుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాకుండా కలుపు నివారణకు ఉపయోగించే గోలెప్తోసెట్ మందుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని రైతులను మభ్య పెడుతుండడంతో వీటికి బ్రాండెడ్ విత్తనాల కంటే ఎక్కువ డిమాండ్ పెరిగిందని అంటున్నారు. ఇక కొన్ని మండలాల రైతులు ఏకంగా ఈ విత్తనాల కోసం వ్యాపారులను, దళారులను ఆశ్రయించడం మొదలు పెట్టారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు గుజరాత్ నుంచి నిషేదిత బీజీ-3 విత్తనాలు దిగుమతి చేసుకుని సొమ్ముచేసుకున్నారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చోడ కేంద్రంగా కోట్లాది రూపాయల నిషేదిత బీజీ-3 విత్తనాల వ్యాపారం జరిగినట్లు చెబుతున్నారు. జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, సిరికొండ, తలమడుగు, తాంసి, భీంపూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, జైనథ్, నిర్మల్ జిల్లాలోని పెంబి, మామడ తదితర ప్రాంతాల్లో ఈ విత్తనాలను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణ బ్రాండెడ్ విత్తన ప్యాకెట్ ధర 700 రూపాయలుండగా, బీజీ-౩ విత్తన ప్యాకెట్ వెయ్యి రూపాయల నుంచి 12 వందల రూపాయలకు విక్రయించినట్లు చెబుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లో సబ్ డీలర్లను ఏర్పాటు చేసుకొని ఈ దందాను కొనసాగించడం గమనార్హం.

నకిలీ విత్తనాల కేసుల్లో అరెస్టయిన వ్యాపారులను తమదైన శైలిలో విచారించిన పోలీసులు పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా సబ్ డీలర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే వరుసగా ఇచ్చోడకు చెందిన వ్యాపారులు నకిలీ విత్తనాల కేసులో పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 16 వరకు ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో రూ 40 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తుండగా పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన పత్తి విత్తనాల దుకాణం యజమానిని అదుపులోకి తీసుకొని నకిలీ విత్తనాలు నింపడానికి ఉపయోగించే రూ 5 లక్షల విలువైన 5 వేల ఖాళీ ప్యాకెట్లు, కెమికల్‌ను కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించి దుకాణం లైసెన్సు రద్దుచేశారు.

ఈ నెల 2న ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రగతి ఏజెన్సీ యజమానికి చెందిన మ్యాక్స్ ఫికప్ వాహనంలో రూ.6 లక్షల విలువైన నకిలి విత్తనాలు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇతని షాపు లైసెన్సు రద్దు చేయడానికి వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు సిపార్సు చేశారు. ఐక వారం రోజుల క్రితం సాయికృప ట్రేడర్స్‌కు చెందిన అడవ్ గంగాధర్‌కు చెందిన రూ. 25 లక్షల విలువైన నకిలీ విత్తనాలు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. నార్నూర్ మండల కేంద్రంలోని గంగాధర్‌కు చెందిన సాయినాథ్ ట్రేడర్స్ లైసెన్స్ రద్దుకు అధికారులు నివేదికను పంపించారు.

ఈ సంఘటనలో గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా అడవ్ రవికాంత్, అడవ్ సాయినాథ్, సుధాకర్ నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ వద్ద రెండు రోజుల క్రితం రూ. 2 లక్షల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ విత్తనాల దందా జరుగుతుందని తెలియడంతో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇచ్చోడ కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులపై విసృతంగా తనిఖీలు నిర్వహించారు.

శ్రీకాంత్ అండ్ కంపెనీ పేరుతో మూడు నెలలుగా గుజరాత్ నుంచి పార్సిళ్లు వస్తున్నట్లు గుర్తించారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సాయికృప ట్రేడర్స్‌కు చెందిన కంపెనీగా గుర్తించి ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన ఎల్‌ఆర్ ఆధారంగా గుజరాత్ నుంచి నేరుగా నిజామాబాద్‌కు వచ్చే ట్రాన్స్‌ఫోర్టులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రోజే శ్రీకాంత్ అండ్ కంపనీకి చెందిన 1250 నకిలీ విత్తన ప్యాకెట్లు ట్రాన్స్‌పోర్టులో పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు గుజరాత్ నుంచి ఈ కంపనీ పేరుపై రూ. కోటి 12 లక్షల విలువ చేసే విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు.

ఇంతే కాకుండా వివిధ మార్గాల నుంచి 5 కోట్ల రూపాయలకు పైగా నకిలీ విత్తన ప్యాకెట్లు జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులకు చేరినట్లు పోలీస్, వ్యవసాయాధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలపై పోలీస్, వ్యవసాయాధికారులు రైతులను చైతన్య పర్చినప్పటికీ పెరుగుతున్న పెట్టుబడుల నుంచి ఉపశమనం పొందేందుకు బీజీ-౩ విత్తనాలను ఆశ్రయించడం వ్యాపారులకు వరంగా మారుతుందని అంటున్నారు. నకిలీ విత్తన వ్యాపారం చేస్తున్న వారి దుకాణాల లైసెన్సులను రద్దు చేసిన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వ్యాపారులు ఈ విత్తనాలను విక్రయించకుండా చూడాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

Gang Cheats Farmers with fake Seeds