Home తాజా వార్తలు నయీమ్ నవాబు

నయీమ్ నవాబు

ఆస్తుల విలువ 2 వేల కోట్లు
1019ఎకరాల వ్యవసాయ భూమి,
29 భవనాలు, 2 కిలోల బంగారం
ఇంకా పెండింగ్‌లో 60 కేసులు
– సిట్ దర్యాప్తులో వెల్లడి

Nayeem

మన తెలంగాణ/హైదరాబాద్:  గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల విలువ అక్షరాలా 2 వేల కోట్లుగా సిట్ తేల్చింది. మొత్తం 1019 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ఖరీదైన భవనాలు, 2 కిలోల బంగారంతో పాటు రెండు కోట్ల నగదు ఉన్నట్లు సిట్ నిర్థారించింది. ప్రస్తుతం ఈ ఆస్తులన్నీ కోర్టు ఆధీనం లో ఉన్నట్లు సిట్ స్పష్టం చేసింది. నయీమ్‌పై మొత్తం 251 కేసులు నమోదయ్యాయని, వీటిలో 119 కేసుల దర్యాప్తు పూర్తయ్యాయ ని సిట్ వెల్లడించింది. ఇంకా 60 కేసులు కొలిక్కిరావాల్సి ఉందని, మరో రెండు నెల ల్లో అన్ని కేసులను పూర్తిచేస్తామని సిట్ పేర్కొంది. ఇదిలావుండగా నయీమ్ తన భా ర్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపై ఆస్తులు కూటబెట్టినట్లుగా సిట్ గుర్తించింది.అలాగే నయీమ్ సోదరి, అతని దగ్గర బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ తగిన ఆధారాలు సేకరించింది. ఈక్రమంలో హైదరాబాద్‌లోని అల్కాపురి కాలనీలో రెండు ఖరీదైన ఇళ్ల విలువ రూ. 6 కోట్లు ఉన్నట్లు సిట్ విచారణలో తేలింది.

అలాగే మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ రూ.5 కోట్ల మేర ఉండొచ్చని సిట్ అంచానా వేసింది. షాద్‌నగర్‌లో 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్ విలువ దాదాపు రూ. 25 కోట్లు, తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ రూ. 35 కోట్లు, కరీంనగర్ శివారులోని సగునూర్‌లో రూ. 5 కోట వెంచర్, నల్గొండలో నయీమ్ అనుచరుల పేరిట రెండు ఇళ్లు, 18 ఎకరాల  సాగుభూమి వివుల రూ. 4 కోట్లు, మిర్యాల గూడ నయీమ్ అత్త పేరిట ఉన్న 4 ఎకరాల భూమి ఖరీదు రూ.65 లక్షలు, భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180కి పైగా ఓపెన్ ప్లాట్స్ విలువ రూ.12 కోట్లు, గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇళ్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య సిట్ విచారణలో వెల్లడించింది. అదేవిధంగా నాగోల్, సరూర్‌నగర్‌లో నయీమ్ అనుచరులైన శ్రీధర్,శేషన్నల పేరిట ఉన్న 2 ఫంక్షన్ హాల్స్ విలువ రూ. 6కోట్లకు పైగానే ఉన్నట్లు తేలింది.

నార్సింగ్, శంషాబాద్, కల్వకుర్తి, మేడ్చల్, శామీర్‌పేట్‌లలో ఇళ్లు, 11ఎకరాల భూమి, రిసార్ట్ విలువ దాదాపు రూ.33 కోట్ల వరకు ఉన్నట్లు సిట్ తేల్చిచెప్పింది. అలాగే మోయినాబాద్, అజీజ్‌నగర్, ఛత్తీస్‌గడ్, రాయపూర్‌లలో రూ. 6 కోట్ల మేర ఆస్తులున్నట్లు తేలింది. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం సిట్ విచారణలో 210మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో కేవలం 46 కేసులలో ఆధారాలు లభ్యమయ్యాయని సిట్ వివరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమౌతోంది. ఇదిలావుండగానయీమ్ జరిపిన సెటిల్‌మెంట్స్ సంపాదించినభూములు చేతులు మారడంతో సిట్ దర్యాప్తుకు కొంత ఇబ్బంది కలుగుతోంది. అయినప్పటికీ కేవలం రెండు, మూడు నెలల్లో నయీమ్ అక్రమార్జన కేసును పూర్తి చేస్తామని సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.