Friday, March 29, 2024

ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు

- Advertisement -
- Advertisement -

 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్‌స్టర్
వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్‌కౌంటర్

భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దర్శనం కోసం వచ్చిన అతడ్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులో తీసుకున్నారు. ఈ సమయంలో అతను ‘నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలాను’ అని గట్టిగా అరవడం గమనార్హం. దూబేకు చెందిన ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. దూబేను తాము అరెస్టు చేశామని, అతను తమ కస్టడీలో ఉన్నాడని మిశ్రా తెలిపారు.‘

దూబే మహంకాళి ఆలయానికి కారులో వచ్చాడు. మొదట ఒక పోలీసు కానిస్టేబుల్ అతడ్ని గుర్తించి మరో ముగ్గుర్ని(సెక్యూరిటీ సిబ్బందిని) అప్రమత్తం చేశాడు. వారు అతడ్ని పక్కకు తీసుకు వెళ్లి ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు’అని మిశ్రా తెలిపారు. అయితే ఆలయవర్గాల కథనం కాస్త భిన్నంగా ఉంది. దూబే గురువారం ఆలయం గేట్ వద్దకు చేరుకున్న తర్వాత పోలీసు పోస్టు దగ్గర ఉన్న కౌంటర్‌లో రూ.250ల దర్శనం టికెట్ కొన్నాడని, ఆ తర్వాత దగ్గర్లో ఉన్న దుకాణంవద్దకు ప్రసాదం కొనుగోలు చేయడానికివెళ్లగా షాపు యజమాని అతడ్ని గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశాడని వారు చెప్తున్నారు. దూబేను ఆలయంలోకి వెళ్లడానికి ముందే అరెస్టు చేశారా, లేక దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చినప్పుడు అరెస్టు చేశారా అనే విషయం కూడా వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

పోలీసులు అతడి పేరు అడగ్గా తన పేరు వికాస్ దూబే అని గట్టిగా అరిచి చెప్పాడని, దీంతో పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బంది కలిసి అతడ్ని అరెస్టు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముందుగా దూబేను ఎవరు గుర్తించారని విలేఖరులు మిశ్రాను అడగ్గా, ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇది ఇంటెలిజన్స్‌కు సంబంధించిన వ్యవహారమని, ఇప్పుడే ఈ విషయాలు బైటికి వెల్లడించలేమని అంతకు ముందు ఆయన చెప్పారు. కాగా ఇది మధ్యప్రదేశ్ పోలీసులు సాధించిన పెద్ద విజయం అని, కాన్పూర్ ఘటన తర్వాత తమ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని మిశ్రా తెలిపారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గత శుక్రవారం ఎనిమిది మంది పోలీసుల కాల్చివేత ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటినుంచి అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

ఇప్పటివరకు దూబే అనుచరులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌కు ముఖ్య అనుచరుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు మంగళవారం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దూబేను అరెస్టు చేసినందుకు ఉజ్జయిని పోలీసులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభినందిస్తూ‘మహాకాల ఆలయానికి వెళ్లిన తర్వాత తమ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని అనుకునే వారికి మహాకాలుడి గురించి తెలియదు’ అని ఓ ట్వీట్‌లో అన్నారు. దూబే అరెస్టు తర్వాత తాను యుపి సిఎం ఆదిత్యనాథ్‌తో మాట్లాడానని, త్వరలోనే దూబేను యుపి పోలీసులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు.

మరో ఇద్దరు అనుచరుల ఎన్‌కౌంటర్
మరో వైపు వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని యుపి పోలీసులు గురువారం కాల్చి చంపారు. బుధవారం ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన కార్తికేయను ట్రాన్సిట్ రిమాండ్‌పై కాన్పూర్‌కు తీసుకు వస్తుండగా దారిలో అతను పోలీసు రివాల్వర్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి ప్రశాంత్‌కుమార్ చెప్పారు. కార్తికేయ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్‌టిఎఫ్ జవాన్లు గాయపడ్డారని, దరిమిలా జరిగిన కాల్పుల్లో కార్తికేయ మరణించాడని ఆయన చెప్పారు. ఎటావా సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ప్రవీణ్ అలియాస్ బౌవా దూబే మరణించినట్లు ఎటావా ఎస్‌పి ఆకాష్ దూబే చెప్పారు.

చెంపదెబ్బతో నోరు మూసుకున్న దూబే
అరెస్టు చేసే సమయంలో వికాస్ దూబే తాను వికాస్ దూబేనంటూ గట్టిగా కేకలు వేస్తుండగా మధ్యప్రదేశ్ పోలీసు అధికారి ఒకరు అతని చెంపపై గట్టిగా కొట్టి ‘ చుప్, ఆవాజ్ నహీ’ (నోరు మూసుకో, అరవొద్దు) అని అరవడంతో దూబే నోరు మూసుకున్నాడు.

Gangster Vikas Dubey Arrested in Madhya Pradesh

తనిఖీ లేకుండా 700కి.మీ ఎలా వెళ్లాడు?

వికాస్ అరెస్టుపై ప్రియాంకా గాంధీ ప్రశ్న
లక్నో: వికాస్ దూబే అరెస్టుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘ఎలాంటి తనిఖీ లేకుండా వికాస్ దూబే 700 కిలోమీటర్లు ప్రయాణించాడంటే ఆశ్చర్యంగా ఉంది. దారుణమైన ఎన్‌కౌంటర్ తర్వాత యుపి ప్రభుత్వం వికాస్ దూబే విషయంలో అప్రమత్తం చేయడంలో విఫలమైంది. అందువల్లే అతను ఉజ్జయిని చేరుకోగలిగాడు. ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి ప్రభుత్వంతో కల సంబంధాలను సూచిస్తుంది’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. కాగా, వికాస్ దూబేను అరెస్టు చేశారా లేక అతడే లొంగిపోయాడా అనే దానిపై వివరణ ఇవ్వాలని యుపి మాజీ ముఖ్యమంత్రి , సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. అతడికి సంబంధించిన కాల్ రికార్డ్‌ను ప్రజలకు అందుటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Gangster Vikas Dubey Arrested in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News