Home జాతీయ వార్తలు గ్యాంగ్‌స్టర్ దుబే ఎన్‌కౌంటర్

గ్యాంగ్‌స్టర్ దుబే ఎన్‌కౌంటర్

Gangster Vikas Dubey killed in Encounter At Kanpur

 

ఉజ్జయిని నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా ఘటన
కాన్వాయ్‌లోని వాహనం బోల్తా పడడంతో పారిపోవడానికి యత్నం
పిస్టల్ లాక్కుని పోలీసులపైనే కాల్పులు
ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు యుపి పోలీసుల ప్రకటన
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు విపక్షాల డిమాండ్

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతుడయ్యాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం .. గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో పట్టుబడిన వికాస్ దూబేను శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టిఎఫ్) పోలీసులు కాన్పూర్‌కు తరలించేందుకు బయలు దేరారు. మార్గమధ్యంలో కాన్పూర్ జిల్లాలోని భౌంటీ వద్ద గేదెల గుంపు అడ్డం రావడంతో వర్షం కారణంగా రోడ్డు జారుడుగా ఉండి కాన్వాయ్‌లోని ఒక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీన్ని అదనుగా తీసుకున్న దూబే ఒక పోలీసు తుపాకీని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడు.

లొంగిపోవాలన్న పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేశాడు. పైగా పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దూబేను ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు పోలీసులు గాయపడినట్లు కాన్పూర్ రేంజ్ పోలీసు ఐజి మోహిత్ అగర్వాల్ చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్ అలియాస్ బౌవా దూబే గురువారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. మొత్తంమీద కాన్పూర్ సమీపంలోని బిక్రులో ఎనిమిది మంది పోలీసులు హతమైన నాటినుంచి వికాస్ దూబే సహా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు హతమైనారు.

దూబేను చనిపోయాక ఆస్పత్రికి తీసుకు వచ్చినట్లు కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌బి కమల్ చెప్పారు. దూబే శరీరంపై నాలుగు తూటా గాయాలున్నాయని, వీటిలో మూడు ఛాతీపై, మరోటి చేతిపై ఉన్నాయనిఆయన విలేఖరులకు చెప్పారు. ఇద్దరు పోలీసులకు కూడా చేతులకు గాయాలైనట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి వైద్యుల బృందం దూబే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. మృత దేహానికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించగా, నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టులో పిటిషన్
దూబే ఎన్‌కౌంటర్‌కు కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఐదుగురు దూబే అనుచరుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్ట్టేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని, దూబేకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని కోరుతూ ఘనశ్యాం ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం రోజులుగా యుపి పోలీసులు చేసినవన్నీ ‘బూటకపు’ ఎన్‌కౌంటర్లుగా అనుమానాలున్నందున తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు. ‘ వికాస్ దూబేకు ప్రాణహాని జరక్కుండా యుపి ప్రభుత్వం, పోలీసులు పూరిస్థాయి రక్షణ కల్పించాలి. కోర్టులో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఎప్పటికప్పుడు పోలీసు చేతిలో అతను మరణించకుండా రక్షణ కల్పించాలి’ అని ఆ పిటిషన్‌లో కోరారు.

దూబే కేసును సిబిఐకి అప్పగించాలని కూడా పిటిషనర్ అభ్యర్థించారు. చట్టప్రకారం న్యాయ ప్రక్రియ ద్వారా నేరం రుజువు కాకుండా, పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో అతడ్ని చంపేసి న్యాయవ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోలేరని ఉపాధ్యాయ్ విన్నవించారు. గత శుక్రవారం కాన్పూర్ సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల బృందంపై దూబే, అతడి అనుచరులు జరిపిన కాల్పుల్లో ఒక డిఎస్‌పి సహా 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచి దూబే పరారీలో ఉన్నాడు. దూబే గురించి సమాచారం ఇచ్చిన వారికి పోలీసులు 5లక్షల రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. దూబేపై హత్యా నేరాలు సహా 60కి పైగా క్రిమినల్ కేసులున్నాయి.

 

Gangster Vikas Dubey killed in Encounter At Kanpur